తొలి త‌రం న్యూస్ రీడ‌ర్ శాంతి స్వ‌రూప్ ఇకలేరు

- April 05, 2024 , by Maagulf
తొలి త‌రం న్యూస్ రీడ‌ర్ శాంతి స్వ‌రూప్ ఇకలేరు

హైదరాబాద్: తెలుగులో మొట్టమొదట న్యూస్ రీడ‌ర్ గా గుర్తింపు పొందిన శాంతిస్వరూప్ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం గుండె పోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. మలక్ పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. ఈరోజు ఉదయం గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.

నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..అంటూ ఆరోజుల్లో దూరదర్శన్ ద్వారా అందర్నీ శాంతిస్వరూప్ పలకరించేవారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ చానల్ లో ఆయన వార్తలు చదవడం ప్రారంభించారు. టెలీ ప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి పదేళ్ల పాటు ఆయన వార్తలు చదివారు. న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 2011లో పదవీ విరమణ పొందినప్పటికీ.. రిటైర్ అయ్యేంత వరకు ఆయన వార్తలు చదువుతూనే ఉన్నారు.

శాంతి స్వరూప్‌ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఎలాంటి కార్యక్రమమైనా ఏకధాటిగా నడపగల దిట్ట. రామంతాపూర్‌లోని టీవీ కాలనీలో ఆయన నివాసం. 20ఏళ్లకు పైగా తెలుగు వార్తలు చదివిన ఏకైక వ్యక్తిగా శాంతి స్వరూప్ ఘనత వహించారు. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి. ఎలాంటి వార్త అయినా ఒకేలా చదవడం ఆయన ప్రత్యేకత. ఇక ఈయన లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. శాంతిస్వరూప్ భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా పని చేశారు. కొంత కాలం క్రితమే ఆమె కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక శాంతిస్వరూప్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com