అభినవ భారత కుబేరుడు

- April 19, 2024 , by Maagulf
అభినవ భారత కుబేరుడు

ఫోబ్స్ జాబితా ప్రకారం.. ఆసియాలో అత్యంత సంపన్నుడు, ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో స్థానాలతో ప్రమేయం లేకుండా కొనసాగుతున్న భారతీయ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత అంబానీ. ఈరోజు ముకేశ్ అంబానీ జన్మదినం.

ముకేశ్ అంబానీ ఏప్రిల్ 19, 1957న పారిశ్రామికవేత్త దివంగత ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ దంపతులకు ముకేశ్ యెమెన్‌లోని ఏడెన్ పట్టణంలో జన్మించాడు. ఆ సమయంలో ధీరూభాయ్ యెమెన్‌లో వ్యాపారం చేసేవారు. అనంతరం ధీరూభాయ్ కుటుంబసమేతంగా భారతదేశానికి తిరిగి వచ్చి 1966లో రిలయన్స్ సంస్థను స్థాపించడం జరిగింది.అనతి కాలంలోనే ఇండియాలోనే ప్రముఖ కంపెనీగా రిలయన్స్ ఎదిగింది.

ముకేశ్ అంబానీ ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో MBA చదువుతున్న సమయంలోనే తండ్రి ధీరూభాయ్ తో  కలిసి రిలయన్స్ సంస్థను నడిపేందుకు  కాలేజీ నుంచి  డ్రాపౌట్ అయ్యాడు. తండ్రి ధీరూభాయ్ అంబానీతో కలిసి 1981లో రిలయన్స్ పెట్రోలియం కెమికల్స్‌ను ప్రారంభించాడు.

తండ్రి మరణం తర్వాత ముకేశ్, అనిల్ అంబానీలు రిలయన్స్ వ్యాపారాన్ని పంచుకున్నారు. ముకేశ్ అంబానీ తన అనుభవానికి  తగినట్లుగానే ఆయిల్ అండ్ పెట్రోకెమికల్ వ్యాపారాన్ని తీసుకున్నాడు. అనిల్ టెలికం బిజినెస్ ఎంచుకున్నాడు. అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా ఇండియాలో క్రూడ్ పెట్రోల్ రేట్లు పెరగడం అంబానీకి తిరుగులేకుండా పోయింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్ ఎదిగాడు.

 బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం అంబానీ వద్ద ఉన్న సంపదతో నెల రోజుల పాటు భారత దేశాన్ని నడపవచ్చని పేర్కొంది. అంబానీ సారథ్యంలో రిలయన్స్ ఎనర్జీ, పెట్రో రసాయననాలు, వస్త్రాలు, సహజ వనరులు, రీటెయిల్, స్పోర్ట్స్, టెలికమ్యూనికేషన్స్ మరియు మీడియా రంగాల్లోకి ప్రవేశించింది. అంబానీ ఆస్తుల విలువ 116.1 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.9,69,600 కోట్లు).

ముకేశ్ అంబానీ ఇల్లు అంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోమ్ ప్రాపర్టీలలో అగ్రస్థానంలో ఉంది. దీనిని దక్షిణ ముంబైలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ. 11 వేల కోట్లు. ఈ భవనంలో 27 అంతస్తులు ఉన్నాయి. 600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ముకేశ్ అంబానీకి ముందుచూపు ఎక్కువ,  తన దగ్గర ఉన్న లక్షల కోట్ల రూపాయలను మనలా ఎఫ్డీల్లో, మ్యూచువల్ ఫండ్లలో పెట్టడు.  మంచి భవిష్యత్ ఉన్న ఆధునిక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతాడు.మెడిసిన్ డెలివరీ కంపెనీ నెట్‌మెడ్స్‌లో ముకేశ్ 60 శాతం వాటాను కొనుగోలు చేశారు. అలాగే 'యాడ్‌వెర్బ్ టెక్నాలజీస్' అనే భారతీయ రోబోటిక్స్ స్టార్టప్‌లో దాదాపు రూ.983 కోట్లు వెచ్చించి మెజారిటీ వాటాను దక్కించుకున్నాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం 2020లో ఆన్‌లైన్ ఫర్నిచర్ రిటైలర్ అర్బన్ లాడర్‌లో 96 శాతం వాటాను రూ. 182 కోట్లకు కొనుగోలు చేసింది. త్వరలో టీవీ, స్ట్రీమింగ్ కంపెనీ వయాకామ్ 18లో 13 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం ఉంది.  

విద్యుత్ రంగంలో ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయాలనే ఆలోచనతో 500 మెగావాట్ల కోసం అదానీ పవర్ లిమిటెడ్తో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. తద్వారా అదానీ పవర్ ప్రాజెక్ట్‌లో 26 శాతం వాటాను కైవసం చేసుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. అదానీ పవర్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్లో 5 కోట్ల ఈక్విటీ షేర్ల్ కోసం కోసం రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. క్యాప్టివ్ యూజర్స్ పాలసీ ప్రకారం ఈ ఒప్పందం జరిగింది.

                                            --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com