పరశురామ జయంతి

- April 22, 2024 , by Maagulf
పరశురామ జయంతి

పరశురాముడు విష్ణుమూర్తి దశావతారములలో ఆరవది. ఈ అవతారాన్ని ఆవేశావతారం అంటారు...  అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంతవరకే పరశురాముడు  తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగాలుగుతాడు. వైశాఖ శుద్ద తదియ రోజున పరశురాముడు జన్మించాడని స్కాంద, బ్రహ్మండ పురాణాలు చెబుతున్నాయి. క్షత్రియుల నుంచి ప్రజలను రక్షించడానికి పరశురాముడు అవతరించాడని విశ్వాసిస్తుంటారు. అలాగే పరశురాముడి జయంతి కూడా త్రేతాయుగ ప్రారంభరోజే అని నమ్ముతుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పరశురాముడి జయంతి వైశాఖ మాసంలో వస్తుంది. శుక్ల పక్షం మూడవ రోజున జయంతి జరుపుకుంటారు.

పరశురామ జయంతి నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంధాలు తెలుపుచున్నవి.
శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు.

భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు.ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.పరశురాముడు మహా పరాక్రమవంతుడు.పరశురాముడు చిరంజీవుల్లో ఒకడిగా ఇప్పటికీ భూమిపై అతను సంచరిస్తునట్లుగా నమ్ముతుంటారు.భీష్ముడు, ద్రోణాచారి, కర్ణుల గురువు పరశురాముడు.

పరశురాముడు తన పరశువు(గొడ్డలి) ను సముద్రంలోకి విసరివేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ్డ భూమి లో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.ఈ క్షేత్రాలు అన్నీ కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమల లో ఉన్నాయి. అవి ఉడిపి, కొల్లూరు, గోకర్ణ,  సుబ్రహ్మణ్య, శంకరనారాయణ,కుంభాసి/ఆనేగడ్డ, కోటేశ్వర ప్రాంతాలు పరశురామక్షేత్రాలు.

పరశురాముడు పూర్ణావతారము కాదనీ, అవశేషావతారమనీ అంటారు. కనుకనే పరశురాముని స్తోత్రాలూ, మందిరాలూ చాలా తక్కువ. కేరళ రాజధాని తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉన్నది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం

పరశురామ జయంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి.. సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉంటారు. కేవలం పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఈరోజున లక్ష్మీ నారయణను ఆరాధిస్తారు. పవిత్ర తులసి ఆకులు, చందనం, కుంకమ, పువ్వులను విష్ణువుకు అర్పిస్తారు. 

                                            --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com