ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

- May 03, 2024 , by Maagulf
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

ప్రపంచంలో జరిగే సంఘటనలను, వార్తలుగా సామాన్య జనానికి చెరవేసే బాధ్యత పత్రికలకుంది. పత్రికలకు ఉండే భావ స్వేచ్చ హరించబడితే ప్రజలు అజ్ఞానంలో అలమటించక తప్పదు.ప్రజాస్వామ్య దేశాలల్లో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా నిలుస్తాయి. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికలు నాలుగో స్థంబం వంటివి. అందుకే పత్రికా స్వేచ్ఛ కాపాడబడాలి. నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం.

ప్రపంచంలో ప్రభుత్వాల పాలన సజావుగా కొనసాగుతుందంటే అందులో పత్రికల పాత్ర కీలకం. ప్రభుత్వానికి ఉండే మూడు అంగాలు (లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటీవ్‌, జ్యుడీషియల్‌)తో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు పత్రికా స్వేచ్ఛ ఎంతో ఆవశ్యకం. అందుకే దీన్ని నాలుగో స్తంభంగా పేర్కొన్నారు. 1729-1797ల మధ్య జీవించిన ఆంగ్లో ఐరిష్‌ పొలిటికల్‌ థియరిస్ట్‌ ఎడ్మండ్‌ బ్రూక్‌ మొదటిసారిగా పత్రికలను ఉద్దేశించి శక్తి అన్న పదాన్ని ప్రయోగించాడు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న పత్రికా స్వేచ్ఛపై కొన్ని దేశాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. విధి నిర్వహణలో భాగంగా ఎందరో జర్నలిస్టులు బలయ్యారు.

1993లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన చేసింది. అంతకు రెండేండ్ల ముందు 1991లో ఆఫ్రికన్‌ జర్నలిస్టులు ఏప్రిల్‌ 29 నుంచి మే 3 వరకు నమీబియాలోని విండ్‌హాక్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేసి పత్రికా స్వేచ్ఛపై ఒక కీలక ప్రకటన చేశారు. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో సెన్సార్‌షిప్‌ ఉండేది. పత్రికా స్వేచ్ఛపై అనేక ఆంక్షలుండేవి. వీటికి నిరసనగా ఆఫ్రికన్‌ జర్నలిస్టులు మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని ఐరాస నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి యేటా మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా యునెస్కో 1997 నుంచి ఏటా మే 3వ తేదీన గుల్లెర్మోకేనో వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం అవార్డులను అందజేస్తున్నది. ప్రమాదపు టంచుల్లో సైతం నిర్భయంగా వ్యవహరించి పత్రికా స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన జర్నలిస్టులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద 25,000 అమెరికన్‌ డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు. గుల్లెర్మోకేనో అనే వ్యక్తి కొలంబియాలోని ఓ పత్రికకు ఎడిటర్‌ గా పనిచేసేవారు. అతని రాతల వల్ల డ్రగ్‌ మాఫియా అతనిపై కక్ష గట్టి, 1986 డిసెంబర్‌ 17న దారుణంగా హత్య చేసింది. ఆయన బలిదానం పత్రికా స్వేచ్ఛకు స్ఫూర్తిగా నిలవడంతో ఆయన పేరు మీద గుల్లెర్మోకేనో అవార్డును అందజేస్తున్నారు.

పత్రికారంగం రూపులు మార్చుకుంటోంది. కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు పత్రికలే ప్రధాన సమాచార వారధులు. తొలినాళ్లలో ఒక పత్రిక ముద్రితమైన తేదీ నుంచి వారం రోజుల తర్వాత కూడా పాఠకునికి చేరే పరిస్థితి ఉండేది. అప్పటి పరిస్థితులు, మౌలిక వసతులు అలా ఉండేవి. కానీ.. రాను రాను ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అత్యంత వేగంగా పత్రికారంగం అందిపుచ్చుకుంటోంది. ఒకప్పుడు మెయిన్‌ పేపర్‌కే పరిమితమైన పత్రికలు క్రమంగా జిల్లా అనుబంధాలు, మండల, డివిజన్‌ స్థాయి అనుబంధాలను ప్రచురిస్తున్నాయి. అంతేకాదు.. జిల్లా స్థాయిలో ఎడిషన్లు నిర్వహిస్తున్నాయి. దీంతో సమాచారం మరింత విస్తృతంగా ప్రజల్లోకి చేరవేయడంలో పత్రికలు ముందడుగు వేశాయి.

ఎలక్ట్రానిక్‌ మీడియా ఉనికిలోకి రాకముందే పత్రికా స్వేచ్ఛను కాపాడే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఈ దినోత్సవం ఇప్పటికీ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగానే పరిగణింపబడుతోంది. రేడియో, ఎలక్ట్రానిక్‌ మీడియా, వెబ్‌ మీడియా ఉధ తరూపం దాల్చిన నేటి పరిస్థితుల్లో పత్రికా రంగాన్నివిస్తృతార్థంగా మీడియాగా పరిగణిస్తున్నారు. అంటే.. దీనిని మనం పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా కాక.. మీడియా స్వేచ్ఛా దినోత్సవంగా అనువదించుకోవాల్సిన అవసరం ఉంది.

కానీ నేడు పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. మీడియాపై నియంత్రణకు ప్రభుత్వాలు, ఉగ్రవాద సంస్థలు ఆంక్షలు విధిస్తున్నాయి. మీడియాపై దాడులకు తెగిస్తున్నాయి. పత్రికల గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాయి. పాత్రికేయుల రహస్య మూలాల గుర్తింపు బహిర్గతం చేయాలని వారిని వేధిస్తున్నారు. రాజకీయాల్లోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విలసిల్లడానికి, పరిగెత్తే కాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటకు వార్తలు అందించే విలేకరులు ప్రతి దినం ఎన్నో దాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరి వివరాలు తెలియకుండా పోతున్నాయి. 
                         

పత్రిక, మీడియా స్వేచ్ఛగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మరోవైపు, పత్రికా స్వేచ్ఛకు సంబంధించి గత ఏడాది నుంచి అత్యంత అధ్వాన్నమైన దేశాల జాబితాలో భారత్‌ చేరిపోయింది. అంతర్జాతీయ మీడియా పర్యవేక్షణా సంస్థ ‘రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) ఇటీవల విడుదల చేసిన జాబితాలో భారత్‌ కూడా చేరింది. జర్నలిస్టులపై నిఘా వుంచడానికి, వారిని వేధింపులకు గురిచేయడానికి కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించే దేశాల జాబితా ఇది. ప్రపంచ సైబర్‌ సెన్సార్‌షిప్‌ వ్యతిరేక దినం సందర్భంగా ఈ జాబితా విడుదల చేశారు. ఈ జాబితా చూస్తే భావ ప్రకటనా స్వేచ్ఛకు తీవ్రమైన ప్రమాదం వుందనేది స్పష్టమవుతోంది.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com