యూఏఈ జాతిపిత
- May 06, 2024
బ్రిటీష్ పాలకుల కారణంగా ముక్కలు చెక్కలైన ఎమిరేట్స్ రాజ్యాన్ని తన శక్తి యుక్తులతో ఏకీకరణ చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాన్ని స్థాపించి, ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్. నేడు యూఏఈ జాతిపిత జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ జయంతి.
జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ 1918,మే 6వ తేదీన అరబ్ రాజ్యాల్లో ఒకటైన అబుదాబి పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ ఖలీఫా అల్ నహ్యాన్, సలామా బింట్ బుట్టి అల్ ఖుబైసి దంపతులకు నాలుగో కుమారుడిగా జన్మించారు. తన సోదరుడు అబుదాబి పాలకుడు షఖ్‌బుత్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ ఆకస్మిక మరణంతో అప్పటి వరకు అబుదాబి తూర్పు ప్రాంతానికి గవర్నర్ గా ఉన్న జాయెద్ తన సోదరుడి స్థానంలో అబుదాబి పాలకుడిగా 1966,ఆగస్ట్ 6వ తేదీన పట్టాభిషిక్తులయ్యారు.
1950వ దశకంలో ఎమిరేట్స్ ప్రాంతంలో బ్రిటిష్ పాలకులు ఆయిల్ నిక్షేపాలను కనుగొన్న తర్వాత ఆ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించేందుకు సౌదీ అరేబియా, ఇరాక్ , ఇరాన్ దేశాలు పోటీ పడేవి. ఈ దేశాల మధ్య ఏర్పడ్డ పోటీని బ్రిటిష్ ప్రభుత్వం తనకి అనుకూలంగా మార్చుకొని ఆయా దేశాల్లోని సహజ వనరులను తన కైవసం చేసుకునేందుకు వ్యూహ రచన చేసింది. తన అధీనంలో ఉన్న ఎమిరేట్స్ ప్రాంతంలోని ఆయిల్ నిక్షేపాలను ఆ ప్రాంత పాలకుల అనుమతి లేకుండా సౌదీ, ఒమన్, ఇరాక్ దేశాలకు కట్టబెట్టింది.
తమ అనుమతి లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం ఆయిల్ నిక్షేపాలను వేరే దేశాలకు కట్టబెట్టడం ఇష్టం లేని ఎమిరేట్స్ పాలకులు తొలుత స్వతంత్ర కూటమిగా ఏర్పడి బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఈ కూటమి ఏర్పాటులో అబుదాబి పాలకుడైన జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ కీలకమైన పాత్ర పోషించారు. తమపై ఎమిరేట్స్ కూటమి తెస్తున్న ఒత్తిడికి తలొగ్గిన 1966 తర్వాత నుంచి ఆయిల్ నిక్షేపాలను లీజ్ కిచ్చే హక్కును ఎమిరేట్స్ పాలకులకే విడిచి పెట్టింది.
ఎమిరేట్స్ కూటమి విజయం సాధించడంలో కీలకమైన పాత్ర పోషించిన జాయేద్, ఎమిరేట్స్ కూటమిలోని రాజ్యాలను కలిపి స్వతంత్ర దేశంగా ఏర్పడాలని ఆయన ప్రతిపాదించారు. జాయెద్ ప్రతిపాదన మిగిలిన పాలకులకు నచ్చడంతో వారు అంగీకారం తెలిపారు. ముందుగా ఎమిరేట్స్ రాజ్యాలకు, మిగిలిన అరబ్బు దేశాలకు ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో జాయేద్ సఫలీకృతం అయ్యారు.
1971, డిసెంబర్ 10వ తేదీన ఎమిరేట్స్ రాజ్యాలైన అబుదాబి, అజ్మన్ , దుబాయ్ , షార్జా, రస్ అల్ ఖైమా , ఫుజారైయా, ఉమ్మాల్ ఖ్వాయిస్న్ లను కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)గా ఏర్పడింది. ఈ కొత్త దేశానికి రాజధానిగా అబుదాబిని నిర్ణయించారు. యూఏఈ ఏర్పాటులో కీలమైన పాత్ర పోషించిన యూఏఈ కు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అంతేకాకుండా, ప్రజల అభీష్టం మేరకు యూఏఈ దేశ అధ్యక్షుడిగా జాయేద్ బాధ్యతలు చేపట్టి 2004 వరకు ఆ పదవిలోనే కొనసాగారు.
యూఏఈ అధ్యక్షుడిగా జాయేద్ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆయిల్ నిల్వలను కలిగి ఉన్న యూఏఈని మిగిలిన రంగాల్లో సైతం అభివృద్ధి చేసేందుకు జాయేద్ పూనుకున్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారు. దేశంలో పర్యాటకాన్నిపెంచేందుకు మాల్స్ , హోటల్స్ మరియు గల్ఫ్ కోస్ట్ లో కృత్రిమ దీవులు వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశారు. బుర్జ్ ఖలీఫా నిర్మాణం , పామ్ జువెరా దీవుల సముదాయం జాయేద్ ఆలోచనలే అని చెబుతారు.
జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ దయగల పాలకుడిగా గుర్తింపు పొందారు. తన పాలనలో నియంతృత్వాన్ని దరిచేరనీయకుండా ప్రజాస్వామ్య బద్దంగా దేశాన్ని పాలించారు. ముస్లిం మతం మెజారిటీగా ఉన్న యూఏఈలో ఎటువంటి వివక్షకు తావులేకుండా అన్ని మతాల ప్రజలను గౌరవించారు. ఆయా మతాల వారి ప్రార్థనా మందిరాల నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చారు. దేశంలో మత సమరస్యత కోసం కృషి చేసిన పాలకుడు జాయేద్ అంటే అన్ని వర్గాల ప్రజలకు ఎంతో గౌరవం.
దేశంలో అక్షరాస్యతను పెంచేందుకు విద్యకు ప్రాముఖ్యత నిస్తూ యూఏఈ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కూల్స్ , కాలేజీలను నిర్మించి ఉచితంగా ప్రవేశాలు కల్పించారు. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందించేందుకు దేశవ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించారు. జాయేద్ తన హయాంలోనే ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రజా ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలను ప్రవేశపెట్టారు.
ప్రజలను కన్న బిడ్డలుగా ప్రేమించిన కరుణామయుడైన పాలకుడిగా జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ చరిత్రలో నిలిచిపోయారు. రాజనీతిజ్ఞుడు, దానశీలి, దయార్థ హృదయుడైన వాలిద్ అల్-ఉమ్మహ్ (జాతిపిత) షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ 2004,నవంబర్ 2వ తేదీన డయాబెటిస్ మరియు కిడ్నీ సంబంధిత సమస్యలతో తన 86వ యేట మరణించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా