సుమధుర గాయని..!

- May 10, 2024 , by Maagulf
సుమధుర గాయని..!

సినిమా తెరపై కనిపించే హీరోలు-హీరోయిన్లు నాణేనికి ఒకవైపు అయితే.. తెర వెనకున్న మనకు కనిపించని పాత్రలే నాణేనికున్న రెండో భాగం. ఆ రెండో భాగంలో గాయకులు, డబ్బింగ్‌ ఆర్టిస్టులూ పాత్రధారులే. అనుకోకుండానే సినిమా రంగంలోకి వచ్చి ఊహించలేనన్ని పురస్కారాలు.. అంతకుమించిన గుర్తింపు సాధించారు ఆమె. ఆమె మన అభిమాన హీరోయిన్లకు గొంతక అయ్యారు. వాళ్ల సినిమాకు పాటగా మారారు. సౌందర్య నుంచి తమన్నా వరకు.. భాషతో సంబంధం లేకుండా రాణిస్తున్నారు సింగర్ సునీత. నేడు సుప్రసిద్ధ గాయని సునీత పుట్టినరోజు.

సింగర్ సునీత అలియాస్ ఉపద్రష్ట సునీత 1978, మే 10వ తేదీన గుంటూరు పట్టణంలో సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో  జన్మించారు. సంగీతం పట్ల ఉన్న ఆసక్తి కారణంగా శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. సునీత 15 ఏళ్ల చిన్న వయసులో గాయనిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. దిగ్గజ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'పాడుతా తీయగా' ప్రోగ్రాంలో పాడారు.

గాయనిగా మొదటి మూవీ రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'గులాబి'లో "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" పాటతో కెరీర్ ప్రారంభించారు సునీత. అప్పట్లో ఈ పాట ఓ సన్సేషన్‌. ఎంతోమంది సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఈ పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ దెబ్బతో సునీత పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. తరువాత ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడారు. సింగర్ గా రాణిస్తున్న సమయంలో హీరోయిన్‌ గానూ అవకాశాలు వచ్చినా సున్నితంగా వాటిని తిరస్కరించారట.

డబ్బింగ్‌ ఆర్టిస్టుగానూ తన శ్రావ్యమైన గొంతుతో దశాబ్ధాలుగా అలరిస్తూ వస్తున్నారామె.వెండితెరపై ఆమె సోనాలి బెంద్రే, సౌందర్య, జ్యోతిక, ఛార్మి, నయనతార, తమన్నా, అనుష్క, జెనీలియా, శ్రియా సరన్, సదా, త్రిష, భూమిక, స్నేహ, మీరా జాస్మిన్, లైలా, కమలినీ ముఖర్జీ, కత్రినా కైఫ్ వంటి స్టార్‌ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. అలా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా దాదాపు 500 వందల సినిమాలకు తన గొంతు ఇచ్చారట. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఆమె సుమారు 9 నంది అవార్డులు గెలుచుకున్నారు. ఇక సింగర్‌గా ఎన్నో ఫిలిం ఫేర్‌, రాష్ట్ర అవార్డులతో పాటు మరిన్ని పురస్కారాలు అందుకున్నారు.

ఇండస్ట్రీలో సింగర్‌ సునీతకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందనడంలో సందేహం లేదు. సింగర్స్‌ అంతా వేరు.. సునీత వేరు అనేంతగా తన గానం, రూపుతో ఆకట్టుకున్నారామే. తనదైన యాటిట్యూడ్‌తో ఇండస్ట్రీలో స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న సునీతకు స్టార్‌ హీరోయిన్ల రేంజ్‌లో క్రేజ్‌ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఆ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న ఏకైక మహిళా సింగర్‌ సునీత. ఏ మహిళా సింగర్‌కు కూడా లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమెకు ఉంది. 

                      --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com