ఆధునిక తత్వవేత్తల మార్గదర్శి

- May 12, 2024 , by Maagulf
ఆధునిక తత్వవేత్తల మార్గదర్శి

మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు కోసం తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేసిన తత్వవేత్త అతడు. ఆయన బోధించిన తత్త్వం ఏ నిర్ణీత తాత్త్విక చట్రంలోకీ ఇమడదు. దాని ప్రత్యేకత దానిదే. సమస్త జీవరాసుల పట్ల కారుణ్యాన్ని వ్యక్తం చేస్తుండేవారు. ఆయనే ఆధునిక తత్వవేత్తల మార్గదర్శి జిడ్డు కృష్ణమూర్తి. నేడు జిడ్డు కృష్ణమూర్తి జయంతి.

జిడ్డు కృష్ణమూర్తి 1895, మే 12న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని మదనపల్లెలో జన్మించారు. మద్రాసులోని అడయారు దివ్యజ్ఞాన సమాజానికి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. అనీబిసెంట్ దానికి అధ్యక్షురాలు. జిడ్డు కృష్ణమూర్తి, ఆయన సోదరుడు నిత్యానంద అక్కడే విద్యనభ్యసించేవారు. ఆ తర్వాత వారిని అనిబిసెంట్ తదుపరి విద్య కోసం ఇంగ్లాండ్ పంపించింది. పారిస్ లోని సారబాన్ విశ్వ విద్యాలయంలో కృష్ణమూర్తి సంస్కృతమూ, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేశారు.

1925లో తమ్ముడి మరణంతో కృష్ణమూర్తి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తమ్ముడి మరణం కృష్ణమూర్తిలో పెను మార్పులు తీసుకువచ్చింది.కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్" అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి, కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. ఆ సంఘం తరుపున 1929 నుండి 1986లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు.

మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలి ఇవే కృష్ణమూర్తి భోదనలు.మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి కృష్ణమూర్తి ఎక్కువ కాలం విదేశాల్లో గడిపారు. అయితే ప్రతి సంవత్సరం భారతదేశానికి వచ్చేవారు.  

కృష్ణమూర్తి బోధనా దృక్కోణం ఆధారంగా ఏర్పాటు చేసిందే ప్రముఖ పాఠశాల రిషి వ్యాలీ స్కూల్. మదనపల్లె పట్టణానికి 16 కి.మీ. దూరంలో 375 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ ఆశ్రమ విధానాన్ని ఆదర్శంగా చేసుకొని ఈ పాఠశాలను స్థాపించారు. సమాజ సేవ, పాఠ్యేతర కార్యకలాపాలు, చర్చలు, సమావేశాలు, ప్రత్యేక ఆసక్తులపై సమావేశాలూ పాఠశాల విద్యలో భాగం. ఈ పాఠశాల బహుళశ్రేణి బోధన పద్ధతిని ఆవిష్కరించింది. ఈ పద్ధతి దేశవ్యాప్తంగా, ప్రపంచం మొత్తం చాలా చోట్ల ఆదరణ పొందింది.

1985 అక్టోబర్ లో ఇంగ్లాండ్ నుంచి భారతదేశం వచ్చారు. ఆ తర్వాత ఆయనలో విపరీతమైన అలసట, జ్వరం, బరువు కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపించాయి. 1986 జనవరి 10న మద్రాసులో ఆయన ఆఖరి ఉపన్యాసం తర్వాత తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు.  ఓహైకి చేరుకున్న వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలలో ఆయనకు పాంక్రియాటిక్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. 1986 ఫిబ్రవరి 17న తొంభై ఏళ్ళ వయసులో పాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాధితో మరణించారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com