నవ విఖ్యాత నటసార్వభౌముడు

- May 20, 2024 , by Maagulf
నవ విఖ్యాత నటసార్వభౌముడు

ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలే.. నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన నటన, అభినయంతో తాత నందమూరి తారక రామారావు మరిపిస్తూ.. డాన్స్ లో మైకేల్ జాక్సన్ ను మరిపించేలా మెప్పించి.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నాడు తారక్. నేడు టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు.

జూనియర్ ఎన్టీఆర్ లేదా తారక్ పూర్తి పేరు నందమూరి తారక రామారావు.1983,మే 20వ తేదీన  నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు హైదరాబాద్ లో జన్మించాడు. తారక్ హైదరాబాదులోని   విద్యారణ్య ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. గుంటూరు విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ , హైదరాబాద్ సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాడు.

తార‌క్ చిన్న‌ప్పుడే భ‌ర‌త‌నాట్యం, కూచిపూడీలు నేర్చుకుని ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చాడు. తార‌క్‌కు తొమ్మిదేళ్ళ వ‌య‌సున్నప్పుడు తాత‌ సీనియ‌ర్ ఎన్టీఆర్ ‘బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర’ సినిమా హిందీ వెర్షన్‌లో చిన్న పాత్రలో న‌టింప‌జేశారు. ఈ చిత్రంలో తన మూడో తరం నట వారసుడైన తార‌క్ న‌ట‌నను చూసి పెద్దాయన మురిసిపోయారు. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన నిర్మాత ఎమ్‌.ఎస్ రెడ్డి గారిని పిలిపించి తార‌క్ వ‌య‌సుకు త‌గ్గ క‌థ‌ను ఎంచుకొని సినిమా తీయ‌మ‌ని చెప్పారు.

  ఎమ్‌.ఎస్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో అప్పటి యువ దర్శకుడైన గుణ‌శేఖ‌ర్‌ దర్శకత్వంలో 1995 జూన్‌లో ‘బాల‌ల రామాయ‌ణం’ షూటింగ్ మొద‌లు పెట్టారు. ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి 1996 ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీలో బాల రాముడిగా పౌరాణిక పాత్రలో అద్భుతంగా నటించి.. మెప్పించాడు. ఈ సినిమాతో తొలిసారి నంది అవార్డు సైతం అందుకున్నాడు తారక్. అంతేకాదు ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది.  

2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్నుచూడాలని’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు ఎన్టీఆర్. కానీ ఆ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. ఈ సినిమా షూటింగ్ సరిగ్గా 21 యేళ్ల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజే ప్రారంభమైంది. అలా హీరోగా తారక్.. తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.అలా కొన్ని రోజుల త‌ర్వాత ఎస్ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ తార‌క్‌తో ‘స్టూడెంట్ నం.1’ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో హీరోగా తొలిసారి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ‘సుబ్బు’ విడుద‌లై ఫ్లాప్‌గా నిలిచింది.

సుబ్బు తర్వాత వివి వినాయ‌క్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ సూపర్ డూపర్ హిట్టయింది. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగులు ఎన్టీఆర్ కు మాస్ లో తిరుగులేని ఇమేజ్ ను తీసుకొచ్చాయి.ఈ సినిమాతో ఎన్టీఆర్ టాలీవుడ్ రైజింగ్ స్టార్ హీరోల స‌ర‌స‌న నిలిచాడు. ఆది  చిత్రం అప్ప‌ట్లోనే రూ.20కోట్ల షేర్‌ను సాధించింది.‘ఆది’ త‌ర్వాత ‘అల్ల‌రి ప్రియుడు’, ‘నాగ’ సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి.
   
2003లో రాజమౌళి దర్శకత్వంలో చేసిన సింహాద్రి చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘనవిజయం సాధించడంతో పాటుగా మాస్ ఆడియన్స్ అల్ టైమ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ న‌ట‌న‌, డ్యాన్సుల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ మూవీ సాధించిన విజయంతో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా స్థిరపడ్డాడు.

‘సింహాద్రి’ త‌ర్వాత తారక్ తదుపరి ప్రాజెక్టుల మీద ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. సింహాద్రి లాంటి భారీ హిట్ తర్వాత జూనియర్‌ను వరుస పరాజయాలు పలకరించాయి. ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు ఒకదాని వెనక ఒకటి క్యూ కట్టి ఫ్లాపైనా… నటుడిగా తారక్ ఎన్నడూ ఫెయిల్ కాలేదు. ఈ మూవీస్ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘రాఖీ’ ఎన్టీఆర్ నటనలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాతో తారక్ మహిళ ప్రేక్షకాభిమానం అమాంతం పెరిగింది.

రాఖీ సినిమాలో ఎన్టీఆర్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కినా… బాగా లావయ్యాడన్న కామెంట్స్ వినపడ్డాయి. అందుకనే కృష్ణవంశీ హీరోయిన్ చేత బొండం అని పిలిపించాడు. వీటన్నింటికి చెక్ పెడుతూ… యమదొంగ మూవీలో సన్నబడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసారు. 2007లో విడుదలైన ఈ చిత్రం రాజ‌మౌళి-తార‌క్‌ల కాంబోలో హ్య‌ట్రిక్‌గా నిలిచింది. ఈ చిత్రంలో తార‌క్ పోషించిన య‌ముడు పాత్ర చూసి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ డైలాగ్స్‌, డ్యాన్స్ ఇలా సినిమాలో ప్ర‌తీది ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేశాయి.

యమదొంగ త‌ర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంత్రి’ సినిమా ఫ్లాప్ అవ్వ‌గా, వినాయక్ డైరెక్షన్లో చేసిన ‘అదుర్స్’ తో యాక్టర్ గా మరో మెట్టెక్కాడు.2009లో విడుదలైన ఈ సినిమాలో రెండు విభిన్నపాత్రల్లో వైవిధ్యభరితమైన నటన కనబరిచి.. అందరిచేత అదుర్స్ అనేలా చేశాడు జూనియర్. ఈ మూవీలోని చారీ పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ అందరినీ నవ్వించింది. ఈ మూవీతో తాను హాస్యపాత్రలు సైతం బాగా చేయగలనని నిరూపించుకున్నాడు.

ఊర మాస్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ప్రయోగాలకు ప్రాధాన్యత నిస్తూ 2010లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘బృందావనం’ సినిమాతో క్లాస్‌లో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే 2011లో భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ‘శ‌క్తి’ ప్రేక్ష‌కులనే కాదు తార‌క్ అభిమానుల‌ను కూడా తీవ్రంగా నిర‌శాప‌రిచాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ‘ఊస‌ర‌వెల్లి’, ‘ద‌మ్ము’, ‘బాద్‌షా’, ‘రామ‌య్య‌వ‌స్తావ‌య్యా’, ‘ర‌భ‌స’ వంటి వ‌రుస ఫ్లాప్‌లు తార‌క్‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి.

ఈ దశలోనే కెరీర్ పరంగా డౌన్ అయిన ఎన్టీఆర్ ను 2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘టెంపర్’ సినిమా నిలబెట్టింది. ఈ  సినిమా తర్వాత వ‌చ్చిన ‘నాన్న‌కు ప్రేమ‌తో’, ‘జన‌తాగ్యారెజ్‌’, ‘జై ల‌వ‌కుశ‌’, ‘అరవింద స‌మేత’ సినిమాలతో వరుసగా 5 విజ‌యాలు అందుకున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే టెంప‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్ క‌థ‌ల సెలక్షన్ పూర్తిగా మారిపోయింది. ఒక దానికి మ‌రోకటి సంబంధం లేకుండా విభిన్న కథలను ఎంచుకొని బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకోవడమే కాకుండా యువ ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ సంపాదించాడు.

ఎన్టీఆర్,రాజమౌళి కలయికలో వచ్చిన నాలుగో చిత్రం "ఆర్ఆర్ఆర్". 2023, మార్చి 25న రిలీజైన ఈ చిత్రం ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ చిత్రంతో తార‌క్ అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్‌తో   డబుల్ హాట్రిక్ సక్సెస్‌లను అందుకున్నారు.

తార‌క్ బహుముఖ ప్రజ్ఞాశీలి. కేవలం నటనే కాకుండా సింగర్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు. యమదొంగ చిత్రంలో ఓలమ్మీ తిక్క రేగిందా పాటతో సింగర్‌గా మారి తను నటించిన పలు చిత్రాల్లో పాడాడు. తన మిత్రుడైన కన్నడ సూపర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ కోరిక మేరకు ఆయన చిత్రంలో సైతం ఎన్టీఆర్ పాడాడు. వెండితెర‌పైనే కాకుండా బుల్లితెర‌పై కూడా ప్ర‌క్ష‌కుల‌ను ఎన్టీఆర్  ఆక‌ట్టుకున్నాడు. ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’, ‘బిగ్‌బాస్‌’ వంటి రియాల్టీ షోస్‌తో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. న‌టుడిగానే కాదు వ్యాఖ్యాత‌గా కూడా త‌నేంటో అని ఈ రెండు రియాలిటీ షోస్‌తో నిరూపించాడు.

తారక్ అద్భుతమైన వక్త, తాత సీనియర్ ఎన్టీఆర్ లాగానే గుక్కతిప్పుకోకుండా ప్రసంగాలు చేయడంలో దిట్ట. తెలుగు, తమిళం, ఇంగ్లీష్,  మలయాళం, హిందీ , ఉర్దూ, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు. తన వాక్పటిమతో సినిమా వారినే కాకుండా అన్ని రంగాల ప్రముఖులను ఆకట్టుకున్నారు. 2009లో టీడీపీ తరుపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ మాటలు వినడానికే ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. ఎన్టీఆర్ వినసొంపుగా మాట్లాడుతుంటే ప్రజలు ఎంత సేపైన వినేందుకు సిద్ధంగా ఉంటారు.

తారక్ వ్యక్తిగత జీవితానికి వస్తే 2011లో నార్నె లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు మొగపిల్లలు. వాళ్ళ పేర్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్. తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ సైతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, హీరోగా రాణిస్తున్నాడు.        

ప్ర‌స్తుతం తారక్ కొర‌టాల శివ‌తో దేవర సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. దేవరతో పాటుగా బాలీవుడ్ హీరో హృతిక్రోషన్ కలిసి మల్టీస్టారర్ వార్ 2 చిత్రంలో సైతం నటిస్తున్నాడు. కొరటాల శివ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు.  

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com