సంపూర్ణమైన నటుడు ..!
- May 21, 2024
నటన అనేది ఓ విచిత్రరంగం. అక్కడ కొందరు ఎంతో కాలంగా నటిస్తూ ఉంటారు. కానీ తమకంటూ ఓ స్టయిల్ ఏర్పరచుకోలేరు. కానీ ఇంకొందరు కొద్దికాలంలోనే గుర్తింపు పొందుతారు. ఎలాంటి వారసత్వపు బ్యాక్ గ్రౌండూ లేకపోయినా… ఎవరబ్బా ఈ నటుడు అని … అందరూ అతన్నే చూస్తారు. ఓ పక్క నటన నేర్చుకుంటూనే నటనకి కొత్త అర్థాలు చెబుతారు. వీళ్లే వెండితెర వెలుగులవుతారు. మోహన్‌లాల్ కచ్చితంగా ఈ కోవకే చెందుతారు. చూడగానే ఆకర్షించే ముఖం, చిత్రమైన వాచకం, అవలీలగా పలికే హావభావాలు, అద్భుతమైన నటనా కౌశలం.. ఇవన్నీ కలిస్తే మోహన్‌లాల్. నేడు భారతదేశం గర్వించతగ్గ నటుడు మోహన్ లాల్ పుట్టినరోజు.
మోహన్‌లాల్ అనగానే ఏదో నార్త్ ఇండియన్ పేరులా అనిపిస్తుంది కానీ.. ఆయన పూర్తి పేరు మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్. 1960 మే 21న కేరళలోని పతనంతిట్ట జిల్లా ఎలంతూర్ గ్రామంలో విశ్వనాథన్ నాయర్, శాంతకుమారి దంపతులకు జన్మించారు. లాల్ తండ్రి కేరళ ప్రభుత్వంలో న్యాయ శాఖా కార్యదర్శిగా పనిచేశారు. తిరువనంతపురంలోని మహాత్మగాంధీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేశారు.
హైస్కూల్ లో చదివే రోజుల నుంచీ మోహన్ లాల్ నాటకాల్లో నటిస్తూ వచ్చారు. దాంతో తొలినుంచీ నటనపై ఆయనకు ఆసక్తి ఉందనే చెప్పాలీ. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ లాల్ చిన్ననాటి నుంచి స్నేహితులు. 18 ఏళ్ళ ప్రాయంలోనే మోహన్ లాల్ మిత్రులతో కలసి ‘తిరనోత్తమ్’ అనే చిత్రం నిర్మించారు. అందులో ఓ చిన్న పాత్రలో కనిపించారు.డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా సుప్రసిద్ధ దర్శకుడు ఫాజిల్ (నటుడు ఫాహద్ ఫాజిల్ తండ్రి) దర్శకత్వంతో వచ్చిన ‘మంజిల్ విరింజ పూక్కల్’ అనే సినిమాలో విలన్ పాత్రకు ఎంపికయ్యారు. ఆ సినిమా బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది..
లాల్ చదువు పూర్తి కాగానే ఆయన దృష్టి నటనపై తప్ప మరే దానిపైనా కేంద్రీకృతం కాలేదు. వరుసగా లభించిన ప్రతి పాత్రనూ చేస్తూ పోయారు. 1983లో ఏకంగా 25 చిత్రాలలో చిన్నాచితకా వేషాలు వేశారు. ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే ధరించారు. పలువురు పేరున్న దర్శకుల చిత్రాలలో నటించడం మూలంగా మోహన్ లాల్ కు నటునిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాతి సంవత్సరం ప్రియదర్శన్ దర్శకత్వంలో పూచక్కోరు మూక్కుర్తి అనే కామెడీ సినిమాలో హీరోగా నటించారు.
మోహన్‌లాల్ హీరోగా చేయడం పెట్టిన తర్వాత.. మళ్లీ విలన్‌పాత్రలు వేయలేదు.. అటు పిమ్మట మోహన్‌లాల్ నటనను చూసి ఎంతో మంది దర్శకులు మనసు పారేసుకున్నారు. సుప్రసిద్ధ దర్శకులైన అరవిందన్, హరిహరన్, ఎమ్‌టి వాసుదేవన్ నాయర్, పద్మరాజన్, భరతన్, లోహితాదాస్ వంటి అగ్రశ్రేణి దర్శకులకు ఆత్మీయుడయ్యారు.. వారు సృష్టించిన భిన్నమైన పాత్రలను ఛాలెంజ్‌గా తీసుకున్నాడు.. అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
టి.పి.బాలగోపాలన్ ఎమ్.ఏ, కిరీడం, చంద్రలేఖ, నరసింహం, భరతం, దశరథమ్, నాడోడికట్టు, కిలుక్కమ్, సదయమ్, గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్, నంబర్ 20 మద్రాస్ మెయిల్, దేవాసురమ్, హిస్ హైనెస్ అబ్దుల్లా, పవిత్రం, కాలాపాని, మిథునం, వానప్రస్థం ఇలా అద్భతమైన చిత్రాల్లో నటించారు.ఇప్పటికి దాదాపు 360 పైచిలుకు చిత్రాల్లో మోహన్ లాల్ నటించారు.
మళయాళ చిత్రసీమలో ఒకప్పటి సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్, ఆయన తరువాత స్టార్ గా ఎదిగిన మమ్ముట్టి కూడా అదే తీరున నటించిన వారే. ఆ స్ఫూర్తితోనే మోహన్ లాల్ సైతం దొరికిన ప్రతి పాత్రలోనూ తనదైన అభినయం ప్రదర్శిస్తూ సాగారు. ఆయన హీరోగా నటించిన అనేక చిత్రాలు కేరళ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. మూస ధోరణిలో కాకుండా వైవిధ్యం అనిపిస్తే చాలు వేరే మాట లేకుండా క్లాసిక్, ఫ్యామిలీ, మాస్ మసాలా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మురిపించి మళయాళ సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు.
నటుడంటే కేవలం హీరో కాదు.. అన్ని రకాల హావభావాలు ప్రదర్శించాలి. పాత్రోచితంగా ప్రవర్తించాలి. కొందరు హీరోల్లా మోహన్‌లాల్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోలేదు. తన పాత్రలను తానే శాసించలేదు.. పాత్రల కోసం తనని తను మలచుకున్నాడు. తెరమీద పాత్రలో మోహన్‌లాల్ కాదు కనిపించాల్సింది, పాత్ర మాత్రమే కనిపించాలన్న ఆదర్శంతో తన వ్యక్తిత్వాన్ని పాత్రలకు ధారపోశారు.
హీరోయిన్ల పక్కన గెంతులేసే పాత్రలు కావాలని ఏనాడూ కోరుకోలేదు. ఇప్పుడు కూడా తన వయసుకు తగ్గట్టు పాత్రలేసుకుంటూ వస్తున్నారు.. అందుకే నటుడిగా శిఖరాగ్రాన కూర్చున్నారు. మాస్ క్రేజ్, క్లాస్ క్రేజ్ అన్న పదాలు మనం వింటూ ఉంటుంటాం.. ఈ పదాలేమిటో మోహన్‌లాల్‌కు తెలియదు.. ఎందుకంటే ఆయన మాస్‌కు ఇష్టుడే, క్లాస్‌కు ఇష్టుడే! అందుకే అవార్డులు సాధించగల సినిమాలు చేయగలరు, బాక్సాఫీసును బద్దలు కొట్టే సినిమాలూ చేయగలరు.
మోహన్‌లాల్ నటిస్తుంటే ఒక్కసారి దర్శకులు కూడా తన్మయంలో మునిగిపోయేవారట! కట్ చెప్పడం కూడా మర్చిపోయేవారట! తన మూలాలను మోహన్‌లాల్ ఎప్పుడూ మర్చిపోలేదు.. ఇప్పటికీ సమయం దొరికితే నాటకాలు వేస్తూనే ఉంటారు.. తను సూపర్‌స్టార్‌గా ఉన్నకాలంలోనే ఓ నాటకం కోసం ఆరు నెలలు షూటింగ్‌ను వాయిదా వేసుకున్నారంటే నమ్ముతారా? నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీలో కర్ణన్ అనే సంస్కృత నాటకాన్ని రూపొందించింది.
ఇందులో మోహన్‌లాల్ ప్రధానపాత్ర.. ఇందుకోసం ఆరు నెలలు సినిమాలకు దూరంగా ఉండి, సంస్కృతం నేర్చుకుని ఆ పాత్రను పండించారు మోహన్‌లాల్.. తీవ్రమైన అభినివేశం, ఏదో చేయాలనే తపన, అందుకు తగినట్టుగా ప్రజ్ఞాపాటవాలు..ఇవన్నీ ఉన్న నటుడు మోహన్‌లాల్. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటారు. ఇప్పటికీ తనకు నటన తప్ప మరేదీ పెద్దగా రాదంటారాయన. ఆ నటనలోనూ తెలిసింది తక్కువేనంటారు. నేర్చుకోవలసింది చాలా ఉందని నిజాయితీగా చెబుతారు.
మలయాళ చలన చిత్ర పరిశ్రమలో హీరోల కంటే దర్శకులకే ఎక్కువ పేరుండేది. ఆరోజుల్లో వారు హీరోలకంటే ఎక్కువ పారితోషికం తీసుకునేవారు. మిగిలిన చలనచిత్ర పరిశ్రమల్లో లాగా ఇక్కడ నటీనటులను ఆరాధించే వారు కాదు.కానీ, మమ్ముట్టి, మోహన్ లాల్ స్టార్లుగా ఎదిగిన తర్వాత వారిద్దరూ కలిసి పరిస్థితిని మార్చారు. దేశవ్యాప్తంగా మలయాళ చిత్రం అంటే సగటు భారతీయుడికి గుర్తొచ్చే పేర్లు మమ్ముట్టి, మోహన్ లాల్. వీరి తర్వాత మాలీవుడ్ పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగిన సురేష్ గోపి సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మోహన్ లాల్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సైతం నటించారు. 1994లో తన మిత్రుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన బాలకృష్ణ ‘గాండీవం’ చిత్రంలో ఏయన్నార్ పై చిత్రీకరించిన ‘గోరువంక వాలగానే..’ పాటలో మోహన్ లాల్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇదే ఆయన కనిపించిన తొలి తెలుగు చిత్రం! అనంతరం 2 దశాబ్దాల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో పాటుగా, విలక్షమైన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సోలో హీరోగా ‘మనమంతా’ చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో అనువాదమై ప్రేక్షకులను అలరించాయి.
మోహన్ లాల్ బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆయన కేవలం నటుడే కాదు సింగర్, నిర్మాత, మెజీషియన్, కుస్తీ యోధుడు, వ్యాపారవేత్త వంటి రంగాల్లో సైతం తన ప్రతిభతో రాణిస్తున్నారు. సింగర్ గా పలు సినిమాల్లో, ప్రవేట్ ఆల్బమ్స్ లో పాడి ప్రేక్షకులను మెప్పించారు. నిర్మాతగా ఆయన తీసిన పలు చిత్రాలు గొప్ప చిత్రాలుగా దేశమంతటా కీర్తించబడ్డాయి.
మోహన్ లాల్ ఇప్పటి వరకు అయిదు జాతీయ అవార్డులను గెల్చుకున్నారు. నిర్మించి, నటించిన భరతం, వానప్రస్థం సినిమాలకు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న మోహన్‌లాల్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డులు కూడా వచ్చాయి. ‘వానప్రస్థం’ సినిమాకు ఉత్తమ నిర్మాతగా నేషనల్ అవార్డు అందుకున్నారు. తెలుగులో ఆయన నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడు క్యాటగిరిలో జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డుతో పాటుగా నంది అవార్డు లభించింది. ఎనిమిది సార్లు ఉత్తమ నటునిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.కేరళ ప్రభుత్వ అవార్డులూ ఆయన చెంత చేరి వెలిగాయి.
మోహన్ లాల్ వ్యక్తిగత జీవితానికి వస్తే ప్రముఖ తమిళ నిర్మాత కె.బాలాజీ కుమార్తె సుచిత్రను మోహన్ లాల్ పెళ్ళాడారు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ సైతం తండ్రి బాటలోనే పయనిస్తూ హీరోగా మారాడు. ప్రణవ్ నటించిన హృదయం చిత్రంతో ద్వారా పాన్ ఇండియా వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
మోహన్‌లాల్ వంటి నటులు చాలా అరుదుగా దొరుకుతారు. ఇన్నేళ్లుగా సూపర్‌స్టార్‌గా ఉండటం, విజయవంతమైన చిత్రాలలో నటించడం, నటించిన ప్రతీ సినిమాలోనూ నటనలో వైరుధ్యాన్ని కనబర్చడం కాదు ప్రత్యేకత.. ఇంతకాలం ప్రేక్షకులకు ‘ ఇక చాల్లే తప్పుకో’ అనే భావన రానీయకుండా నటించుకురావడం! ఈ విద్య అందరికీ అబ్బదు.ప్రజలు ఇంతలా పొగుడుతున్నారంటే మోహన్‌లాల్‌లో ఏదో మెస్మరిజం ఉండే ఉంటుంది.. ఆ అయస్కాంత శక్తి నటన నుంచి వచ్చింది..
సంపూర్ణ నటనకు నిర్వచనం చెప్పాలంటే మోహన్‌లాల్ పేరు తీసుకుంటే సరిపోతుంది.. మలయాళీలు ప్రేమతో ముద్దుగా పిల్చుకునే లాలెటన్ నిజంగానే ది కంప్లీట్ మ్యాన్.. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఇట్టే ఒదిగిపోతారు. పాత్రలో పరకాయప్రవేశం చేస్తారు. ప్రేక్షకులను నవ్విస్తారు. ఏడిపిస్తారు. భావోద్వేగాలకు గురి చేస్తారు. ఆయన దర్శకులకు కావల్సిన నటుడు. దర్శకులు కోరుకున్న నటుడు.
--డి.వి.అరవింద్ (మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు