సంస్కరణల సృష్టికర్త .. రాజీవ్ గాంధీ

- May 21, 2024 , by Maagulf
సంస్కరణల సృష్టికర్త .. రాజీవ్ గాంధీ

కొందరి గురించి చెప్పేటప్పుడు ఉన్నదాన్నే కొండంతలు చేసి చెప్పాల్సి వస్తుంది. అది కష్టం.. మరి కొందరి గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి వాళ్లలోని కొండంత ప్రతిభను కొంచెంలో చెప్పాల్సి వస్తుంది.. ఇది మరింత కష్టం! రెండో కోవకు చెందుతారు భారత దేశం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. నేడు రాజీవ్ గాంధీ వర్థంతి.

రాజీవ్‌గాంధీ 1944 ఆగ‌స్టు 20వ తేదీన బొంబాయిలో ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ దంపతులకు జన్మించారు. ఆయ‌న తాత పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ భారతదేశానికి తొలి ప్ర‌ధాని. తల్లి ఇందిరా గాంధీ సైతం దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేశారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్ల‌మెంటు స‌భ్యుడు అయ్యారు. నిర్భ‌యంగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే పార్ల‌మెంటేరియ‌న్‌గా పేరు తెచ్చుకున్నారు.

రాజీవ్‌గాంధీ త‌న బాల్యాన్ని తాత‌గారితో క‌ల‌సి తీన్‌మూర్తి హౌస్‌లో గ‌డిపారు. అక్క‌డ ఇంధిరాగాంధీ ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌కురాలిగా ప‌నిచేశారు. డెహ్రాడూన్‌లోని వెల్హామ్ ప్రెప్ స్కూల్‌కు కొద్దికాలంపాటు వెళ్ళిన రాజీవ్‌గాంధీ త‌రువాత రెసిడెన్షియ‌ల్ డూన్ స్కూల్‌కు మారారు. అక్క‌డ ఆయ‌న అనేక మందితో ప్ర‌గాఢ మైత్రిని పెంపొందించుకున్నారు. సోదరుడు సంజ‌య్‌గాంధీ కూడా ఆయ‌న‌తో క‌లిశారు.

స్కూల్ చ‌దువు పూర్త‌యిన త‌రువాత రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ క‌ళాశాల‌లో చేరారు. అయితే త్వ‌ర‌లోనే లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజ్‌కి మారారు. అక్క‌డ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు.ఇంగ్లండ్ నుంచి తిరిగివ‌చ్చిన వెంట‌నే ఢిల్లీ ఫ్లైయింగ్ క్ల‌బ్ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష పాసై క‌మ‌ర్షియ‌ల్ పైలెట్ లైసెన్సు తీసుకోవ‌డానికి వెళ్ళారు. అన‌తికాలంలోనే దేశీ విమాన సంస్థ ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్‌ లో పైలట్‌గా చేరారు. సోదరుడు సంజయ్ గాంధీ సైతం పైలట్ లైసెన్స్ పొందారు.

రాజకీయాల పట్ల మొదట నుంచి రాజీవ్ ఆసక్తి చూపేవారు కాదు. 1980లో సంజయ్ ఆకస్మిక మరణంతో త‌ల్లికి అండగా నిలిచేందుకు    రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. త‌మ్ముని మృతి కార‌ణంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రాజీవ్‌గాంధీ గెలుపొందారు.కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసే ప్ర‌క్రియ‌ను త‌న భుజ‌స్కందాల‌పై వేసుకున్నారు. ఆ త‌రువాత కాలంలో అనేక ప‌రీక్షా స‌మ‌యాల్లో ఆయన శ‌క్తి సామ‌ర్థ్యాలు, ప్ర‌జ్ఞాపాట‌వాలు బ‌య‌ట‌ప‌డుతూ వ‌చ్చాయి.

1984 అక్టోబ‌ర్ 31న త‌ల్లి ఇందిరాగాంధీ దారుణ హ‌త్య‌కు గురైన స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ నేతల ఒత్తిడి మేరకు రాజీవ్ కాంగ్రెస్ జాతీయ  అధ్య‌క్షునిగా, ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన వయస్సు 40 ఏళ్లు మాత్రమే. అంతకు ముందు కానీ లేదా ఆ తర్వాత కానీ మళ్లీ అంత చిన్న వయస్సులో ఆ అవకాశం ఎవ్వరినీ వరించలేదు.

ప్రధానిగా రాజీవ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తల్లి మృతికి కారణమైన వ్యక్తులకు చెందిన సిక్కు మతంపై కాంగ్రెస్ నేతలు కక్ష గట్టారు.  సిక్కు మతస్తులపై పక్కా ప్రణాళికతో ఇందిరా గాంధీ హత్యకి ప్రతీకారంగా కాంగ్రెస్ నేతల ప్రమేయంతో సాగిన అల్లర్లలో దేశవ్యాప్తంగా 2800 మంది సిక్కులు మరణించగా, ఢిల్లీలోనే 2100 మరణాలు సంభవించాయి. ఈ భయంకరమైన మారణహోమం కారణంగా వేలాది మంది సిక్కు ప్రజలు సర్వసం కోల్పోయారు.ఈ ఉదంతంతో కాంగ్రెస్ మెజారిటీ సిక్కు వర్గానికి దూరమైంది.    

1984 డిసెంబర్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద మెజార్టీ రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 401 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధానిగా రాజీవ్ పలు సంస్కరణలకు నాంది పలికారు. ఐటీ, రక్షణ, వాణిజ్య,  టెలీకమ్యూనికేషన్స్, ఆర్థిక రంగాల్లో దేశం పురోగతికి సాధించేందుకు పూనాదులు రాజీవ్ హయాంలోనే పడ్డాయి.

రాజీవ్ హయాంలోనే ప్రజా ప్రతినిధులు అనైతికంగా పార్టీలు మారుతుంటే వారిని కట్టడి చేసేందుకు ఫిరాయింపుల చట్టం, అందరికి ఉచిత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు 1986లో ఎడ్యూకేషన్ చట్టాలను అమలు చేశారు. భారత దేశ విదేశాంగ విధానంలో మార్పులు తీసుకొచ్చి అగ్రరాజ్యం అమెరికాతో మైత్రి బంధాన్ని పటిష్టం చేశారు. భారత్ సరిహద్దు శ్రీలంక, మాల్దీవ్స్ లలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఆ దేశ ప్రభుత్వాలకు సహకరించారు.

రాజీవ్ పరిపాలనలో దేశం అభివృద్ధి దిశగా అడుగులేస్తున్న సమయంలోనే బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి రావడంతో, అప్పటి వరకు ఆయన కున్న క్లీన్ మ్యాన్ ఇమేజ్ మసకబారింది. దాంతో పాటుగా రాజీవ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అతని సన్నిహితుల కారణంగా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోని రాజకీయంగా బలహీన పడ్డారు.

1989లో కాంగ్రెస్ ఓటమి చవిచూసిన తరువాత ప్రతిపక్షనేతగా కొనసాగుతూ అప్పటి నేషనల్ ఫ్రంట్ కూటమి తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజా పోరాటాలు నిర్వహించారు. 1990 చివర్లో అప్పటి ప్రధాని వి.పి.సింగ్ రాజీనామాతో చంద్రశేఖర్ ప్రధాని అయ్యేందుకు రాజీవ్ కీలక పాత్ర పోషించారు. చంద్రశేఖర్ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇచ్చారు. అయితే రాజీవ్ తో వచ్చిన చిన్న అభిప్రాయబేధం కారణంగా చంద్రశేఖర్ తన పదవికి రాజీనామా చేయడంతో 1991లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి.

కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారంలో భాగంగా 1991,మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీపెరంబదూర్ పట్టణంలో పర్యటిస్తున్న సమయంలో శ్రీలంక ఉగ్రవాద ఎల్టీటి సంస్థ మానవబాంబును పంపి రాజీవ్ గాంధీని హత్యచేయించింది. మానవబాంబు పేలడంతో రాజీవ్ గాంధీ  తునాతున‌క‌ల‌య్యారు. ప్రపంచ దేశాల రాజకీయ చరిత్రలో అత్యున్నత పదవిలో ఉండి మరణించిన తల్లి కొడుకులుగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ నిలిచిపోయారు.

రాజీవ్ మరణాతరం సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం యాదృచ్ఛికం. 1991లో దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలకు గాను ఆయన్ని భారత రత్నతో గౌరవించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజీవ్ గాంధీ స్మారక చిహ్నాలు ఉన్నాయి. 1991 నుండి  ఆయన వర్థంతిని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా భారతదేశం జరుపుకుంటుంది.


--డి.వి.అరవింద్ (మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com