భారత సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ పితామహుడు

- May 23, 2024 , by Maagulf
భారత సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ పితామహుడు

భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ పితామహుడుగా పేరు గాంచారు రాజా రామ్మోహన్ రాయ్. సమాజంలోని సాంఘిక  దురాచారాలను రూపు మాపడానికి విశేష కృషి చేశారు. ప్రజల్లో వేళ్లూనుకొని ఉన్న మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. నేడు భారత సంఘసంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జయంతి.

రాజా రామ్మోహన్ రాయ్ 1772 సంవత్సరం మే 22 న బెంగాల్ ప్రెసిడెన్సీలోని హూగ్లీ సమీపంలో గల రాధానగర్ గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయన స్వేచ్ఛగా, హేతుబద్ధంగా ఆలోచించేవాడు. హిందు, మహమ్మదీయ, క్రైస్తవ మతగ్రంథాలను క్షుణ్నంగా చదివాడు. బెంగాలీ, ఇంగ్లిష్‌, సంస్కృతం, పర్షియన్‌, అరబీ, ఫ్రెంచ్‌, లాటిన్‌, గ్రీక్‌, హీబ్రూ తదితర భాషలు నేర్చుకున్నారు.

1815లో ఆత్మీయసభ అనే సంస్థను స్థాపించారు. భగవంతుడు ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇదే 1828లో బ్రహ్మసభగా పరివర్తన చెందింది. ఇదే సమయంలో నాటి భారత సమాజంలో ఉన్న బహు భార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలను ఖండించారు. ఆయన కృషి ఫలితంగానే అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ 1829లో రెగ్యులేషన్ XVII ద్వారా సతీ సహగమనం చట్టవిరుద్ధమని ప్రకటించాడు.

దేవుడికి, ప్రజలకు మధ్యవర్తులుగా ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్న పురోహితుల తరగతిని రాజా రామ్మోహన్ రాయ్ నిరసించారు. రంగు, జాతి, కులాలకు అతీతంగా మానవులందర్నీ ఏకం చేయడానికి ఆయన కృషి చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటును ప్రశంసించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం పత్రికల స్వాతంత్య్రంపై పరిమితులు విధించడాన్ని, భారతీయులను ఉన్నత పదవులకు దూరంగా ఉంచడాన్ని రాయ్ వ్యతిరేకించారు.

రాయ్ కేవలం సామాజిక సంస్కర్త మాత్రమే కాదు విద్యావేత్త కూడా! ఆధునిక విద్యా విధానం ప్రవేశ పెట్టడానికి కృషిచేశారు. 1817లో డేవిడ్‌ హేర్‌తో కలిసి హిందూ కాలేజీని స్థాపించాడు. బాలికల విద్య కోసం పాఠశాలలు ఏర్పాటుచేశారు. పత్రికా రంగంలోనూ రాయ్‌ తనదైన ముద్రవేశారు. "పయనీర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం"గా ప్రసిద్ధి గాంచిన రాయ్, తొలి బెంగాలీ వారపత్రిక సంవాద్‌ కౌముది ప్రారంభించారు. భారత పత్రికా స్వేచ్ఛ కోసం గొంతెత్తారు.

రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదును ఇచ్చిన మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ కోరిక మేరకు ఆయన తరఫున రాయబారిగా 1830లో ఇంగ్లండ్ రాజైన నాలుగో విలియం ఆస్థానానికి వెళ్లారు. బ్రిటిష్‌వారు ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని రామ్మోహన్ రాయ్ ద్వారా మొగలు చక్రవర్తి కోరాడు. అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన రాయ్ 1833, సెప్టెంబరు 27న బ్రిస్టల్ నగరంలో మృతి చెందారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com