బిజినెస్ ఉమన్

- May 24, 2024 , by Maagulf
బిజినెస్ ఉమన్

ఆమె విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్త. ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు సొంతం చేసుకున్నారు. ఆమె మరెవరో కాదు పారిశ్రామిక వర్గాల్లో ఉమ చిగురుపాటి గా సుపరిచితులైన చిగురుపాటి ఉమాదేవి.  

ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని వ్యాపార కుటుంబంలో జన్మించారు. చీరాల వీ.ఆర్.ఎస్ & వై.ఆర్.ఎన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి, గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం నుండి సాయిల్ మైక్రోబయాలజీ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఉమ తండ్రి చావా కృష్ణమూర్తి చీరాల కేంద్రంగా రైస్ మిల్లు మరియు ఇతర వ్యాపారాలు నిర్వహించేవారు. ముఖ్యంగా రైస్ మిల్లర్ల సంఘాలలో కీలకమైన పాత్ర పోషించారు.

తల్లిదండ్రులకు ముగ్గురు కుమార్తెలు కావడంతో వారిలో తన పెద్ద కుమార్తె ఉమ ని వ్యాపారాలకు వారసురాలిగా భావించి చిన్నతనం నుంచే తమ రైస్ మిల్లు వ్యవహారాల్లో భాగం చేశారు. చిన్నతనంలోనే తండ్రి మార్గదర్శత్వంలో నేర్చుకున్న వ్యాపార మెలకువలు తర్వాత కాలంలో ఆమెకు ఎంతో ఉపయోగపడ్డాయి.

1982లో గుంటూరుకు చెందిన డాక్టర్ చిగురుపాటి కృష్ణ ప్రసాద్ ని వివాహాం చేసుకున్నారు. కృష్ణ ప్రసాద్ తండ్రి వైద్య దిగ్గజం,పేదల వైద్యుడిగా ప్రసిద్ధి గాంచిన డాక్టర్ చిగురుపాటి నాగేశ్వరరావు. వీరు కేవలం వైద్యుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యకర్తగా, విద్యావేత్తగా ప్రసిద్ధి గాంచారు.

ఉమ వివాహాం తర్వాత కృష్ణ ప్రసాద్ గారు గ్రాన్యుల్స్ ఇండియా ఫార్మా కంపెనీని ప్రారంభించడం జరిగింది. ఆ సంస్ధ అభివృద్ధి కోసం తన భర్తతో పాటు ఉమ సైతం ఎంతో కృషి చేశారు. కృష్ణ ప్రసాద్ రీసెర్చ్ విభాగం చూసుకుంటే ఉమ కీలకమైన మానవ వనరులు మరియు ఫైనాన్స్ విభాగాలను పర్యవేక్షణ చేసేవారు.ఇద్దరూ వ్యక్తులతో మొదలైన ఆ కంపెనీ నేడు దేశ ఫార్మా రంగంలో అగ్రగామిగానున్న సంస్థల జాబితాలో చేరడమే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పించడం జరిగింది. గ్రాన్యుల్స్ ఇండియా ఈ స్థాయికి చేరుకోవడంలో ఉమ గారి పాత్ర చాలా కీలకమైనది అని స్వయంగా కృష్ణ ప్రసాద్ అనేక పర్యాయాలు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం గ్రాన్యుల్స్ ఇండియా బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.

ఫార్మా రంగంతో పాటు కృష్ణ ప్రసాద్ స్థాపించిన పలు కంపెనీల్లో ఉమ పాత్ర చాలా కీలకమైనది. మన దేశంలోని ప్రీమియర్‌ బొటిక్‌ వైన్‌ తయారీ కేంద్రాల్లో ఒకటైన KRSMA ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.వైన్‌ తయారీకి కావాల్సిన ముడి సరుకును పండించేందుకు కర్ణాటకలోని హంపి హిల్స్‌లో ద్రాక్షతోటకు బీజం వేసి పెంచి పోషించారు. అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని కార్యకలాపాలను ఆమే దగ్గరుండి చూసుకుంటున్నారు.

కేవలం లాభాలను ఆర్జించాలానే ఉద్దేశంతో కాకుండా ప్రపంచ వైన్ తయారీ మార్కెట్లో నాణ్యత పరంగా KRSMA బ్రాండ్ పేరు చెప్పుకోవాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నమని, మావారు కృష్ణ ప్రసాద్ సహకారంతో ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఉమ చెబుతున్నారు.    

ఉమగారు హైదరాబాద్ చాప్టర్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(FLO) కు చైర్‌పర్సన్‌గా సైతం ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్‌గా తన హయాంలో అటు క్షేత్ర స్థాయిలోను.. ఇటు ఉన్నత స్థాయిలోను.. రెండు విధాలుగా మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల కోసం పలు వర్క్ షాప్స్, ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయించారు.

చదువుకునే రోజుల్లో క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తే నాగార్జున విశ్వవిద్యాలయం తరుపున పలు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. వ్యాపార రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఐదు పదుల వయసులో కృష్ణప్రసాద్ తో కలిసి దేశ, విదేశాల్లో జరిగిన వివిధ మారథాన్ రేసుల్లో పాల్గొనడం మొదలుపెట్టి, ఇప్పటి వరకు రెండుసార్లు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కారు. ప్రస్తుతం పాల్గొంటున్నారు.

ఉమ చదువుకునే రోజుల్లోనే యూనివర్సిటీ తరుపున నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేవారు.ఆ స్ఫూర్తితోనే గ్రాన్యుల్స్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.కంపెనీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ మరియు హ్యూమన్‌ రిసొర్సెస్‌ విభాగాలను ముందుండి సమర్థంగా నడిపిస్తున్నారు.

వ్యాపారాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా గడిపే ఉమ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమెకు ముగ్గురు పిల్లలు. కుమారుడు హర్ష గ్రాన్యుల్స్ ఇండియా సంస్థ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, కుమార్తెలు ప్రియాంక, ప్రజ్ఞ్యా(కవలలు)లలో ప్రియాంక గ్రాన్యుల్స్ ఇండియా సంస్థ డైరెక్టర్ కాగా, ప్రజ్ఞ్యా డాక్టర్ గా స్థిరపడ్డారు.

సానుకూల దృక్పథం (Positive Thinking), ఓపిక (Patience), చూసి తెలుసుకునే గుణం (perceiveness)..ఈ 3 లక్షణాలు (3 P's) అలవర్చుకుంటే ఎవరైనా. మరీ ముఖ్యంగా మహిళలు తామనుకున్నది సాధించవచ్చు అని ఉమ చెబుతారు. అంతే కాకుండా వ్యాపారం కూడా మారథాన్ లాంటిదే, ప్రతికూల వాతావరణాన్నీ, ఆటంకాలను ఎదుర్కుంటూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటేనే విజయం దక్కుతుందని అంటారు.

వృత్తి మరియు వ్యక్తిగత జీవితాలను సమన్వయం చేసుకుంటూ విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఉమ నేటి యువతరం ముఖ్యంగా యువతులకు స్ఫూర్తి దాయకమైన వ్యక్తి. ఉమా దేవి చిగురుపాటి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..ఆల్‌ ఇన్‌ ఒన్‌ వండర్‌ఫుల్‌ ఉమెన్‌. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com