సినిమా రివ్యూ:‘ రాజు యాదవ్’.!
- May 25, 2024జబర్దస్త్‌తో గెటప్ శీనుగా పాపులర్ అయిన కమెడియన్ శీను హీరోగా నటించిన సినిమానే ‘రాజు యాదవ్’. ఇటీవల ‘హనుమాన్’ సినిమాలో హీరోకి ఫ్రెండ్‌గా లెంగ్తీ రోల్ పోషించి సినీ జనానికి బాగా దగ్గరైపోయాడు. ‘హనుమాన్’ తర్వాత వచ్చిన సినిమానే కావడంతో ప్రమోషన్లు బాగా చేశారు ‘రాజు యాదవ్’కి.
పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఈ సినిమాకి సపోర్ట్ అందించారు. అంతేకాదు, ఈ వారం సినిమాలేమీ రిలీజ్‌కి లేవు. ధియేటర్ల బంద్ కారణంగా కావచ్చు.. పోస్ట్‌పోన్‌ల వ్యవహారం కావచ్చు.. కారణాలేమైనా సోలోగా వచ్చేశాడు ‘రాజుయాదవ్’. మరి, ‘రాజు యాదవ్’ ఎంత మేర ఆకట్టుకున్నాడో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
రాజుయాదవ్ (గెటప్ శీను) డిగ్రీ ఫెయిలై అల్లరి చిల్లరిగా తిరిగే ఓ సాధారణ కుర్రాడు. క్రికెట్ ఆటలో భాగంగా ముఖానికి బాల్ తగిలి మూతి పక్కకి పోతుంది. అలా స్మైలీ ఎక్స్‌ప్రెషన్ ఒక్కటే ఫేస్‌కి పరిమితమైపోతుంది. అది సరి చేయాలంటే లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పడంతో.. లక్షలు సంపాదించే వేటలో పడతాడు రాజు యాదవ్. ఆ క్రమంలో ఆయన జీవితంలోకి స్వీటీ (అంకితా కారట్) ప్రవేశిస్తుంది. సాప్టవేర్ ఇంజనీర్ అయిన స్వీటీతో లవ్‌లో పడతాడు రాజు యాదవ్. స్వీటీ కూడా రాజు యాదవ్‌ని ప్రేమించిందా.? అసలు స్వీటీతో రాజు యాదవ్ ప్రేమలో పడడానికి కారణమేంటీ.? తన లవ్‌ని గెలిపించుకున్నాడా.? ఆమె ప్రేమ కారణంగా తాను అనుకున్నది సాధించాడా.? తెలియాలంటే ‘రాజు యాదవ్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
గెటప్ శీను పర్‌ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేముంది. జబర్దస్త్ ప్లాట్‌పామ్ ద్వారా ఆయన పోషించని పాత్ర లేదు, వేయని గెటప్ లేదు. ఈ సినిమాలో సింగిల్ ఎక్స్‌ప్రెషన్ ముఖంతో ఫస్టాఫ్ అంతా కడుపుబ్బా నవ్వించాడు గెటప్ శీను. అయితే, సెకండాఫ్‌కొచ్చేసరికి ఆయన నుంచి ఊహించిన నవ్వులు కరువవుతాయ్. అంతేకాదు, కథనం కూడా సహనానికి పరీక్ష కావడంతో రాజు యాదవ్‌ని భరించడం కష్టమైపోతుంది. హీరోయిన్ అంకితా కారట్ అందంగా కనిపిస్తూనే బోల్డ్ సన్నివేశాల్లోనూ చాలా ఈజీగా నటించేసింది.. పర్‌పామెన్స్ కూడా ఓకే. రాజు యాదవ్‌కి తండ్రి పాత్రలో కనిపించిన ఆనంద చక్రపాణి తన పరిధి మేర బాగానే నటించాడు. మిగిలిన పాత్ర ధారుల్లో మిర్చి హేమంత్, సంతోష్ కల్వచర్ల, జబర్దస్త్ సన్నీ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
కొత్త దర్శకుడు కృష్ణమాచారి.కె తీసుకున్న పాయింట్ కాస్త కొత్తగా అనిపించినా అదే కొత్తదనంతో కథనాన్ని నడిపించడంలో ఫెయిలయ్యాడు. గెటప్ శీను వంటి నటుడి నుంచి ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన స్టఫ్ ప్రేక్షకులకు అందించడంలో విఫలమయ్యాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఓకే అనిపించినా కథ ముందుకెళ్లేకొద్దీ, కథనం డ్రమటిక్‌గా మారిపోతుంది. ఎలాంటి లాజిక్కుల్లేకుండా మూస ధోరణిలో కథనం సాగుతుంది. సాగతీత ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ సో సో అంతే. ఇక, ఎడిటింగ్ అయితే, సహనానికి పరీక్షే. ఈ తరహా కథలకు స్పీడ్ నెరేషన్ వుండాలి. సాగతీత భరించలేని విధంగా వుంటుంది. చాలా కత్తెర పడాల్సిన సన్నివేశాలు ప్రేక్షకుడ్ని వేధిస్తాయ్. నిర్మాణ విలువలు ఓకే. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లుగా వుంది.
ప్లస్ పాయింట్స్:
గెటప్ శీను పర్‌ఫామెన్స్, అక్కడక్కడా నవ్వించిన కొన్ని కామెడీ సన్నివేశాలు.. క్లైమాక్స్ సన్నివేశాలు..
మైనస్ పాయింట్స్:
అనుకున్న పాయింట్‌ని అంతే వేగంగా ఫన్నీ టోన్‌లో చెప్పేసి వుండుంటే బాగుండేది. అలాగే రన్ టైమ్. బోర్ కొట్టించేసిన పరమ రొటీన్ సన్నివేశాలూ, సెంటిమెంట్ సీన్లు..
చివరిగా:
‘రాజు యాదవ్’ గెటప్ శీను రేంజ్ కామెడీ డ్రామా అయితే కాదు.. అలా అనుకుని వెళితే ఆశించిన విధంగా నవ్వును ఎంజాయ్ చేయలేరు.
తాజా వార్తలు
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి