బైలింగ్వల్ స్టార్...!
- May 25, 2024
అతడు పేరుకు తమిళ హీరో అయినా, తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. తనదైన సహజన నటనతో తమిళంతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు.పేరుకు సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు కార్తి. నేడు బైలింగ్వల్ స్టార్ హీరో కార్తి పుట్టినరోజు.
కార్తీ పూర్తి పేరు కార్తీక్ శివకుమార్. 1977, మే 25వ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. కార్తీ చెన్నైలోని క్రీసెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికాలోని న్యూయార్క్ బింగ్టన్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ నందు మాస్టర్స్ పూర్తి చేశాడు. అమెరికాలో కొంత కాలం ఉద్యోగం చేశాడు.
కార్తీ కుటుంబ నేపథ్యంలోకి వెళితే తండ్రి శివకుమార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ, తెలుగు చిత్రాల ప్రేక్షకులకు సుపరిచితమే. సోదరుడు సూర్య పాన్ ఇండియా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. తండ్రి, సోదరుడిని స్ఫూర్తిగా తీసుకోని సినిమా రంగంలో కార్తీ అడుగుపెట్టాడు. న్యూయార్క్ లో చదువుతున్న సమయంలో ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తి చేశాడు.
సినిమా పట్ల ఆసక్తితో 2003లో చెన్నై వచ్చి దిగ్గజ దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆయన దర్శకత్వం వహించిన ‘అయుత ఎఘుతు’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే ఒక చిన్న క్యారెక్టర్ లో తళుక్కున మెరిశాడు. తెలుగులో ఈ సినిమా ‘యువ’ అనే పేరుతో విడుదల అయ్యింది. రత్నం వద్ద పనిచేస్తున్న సమయంలోనే పరుత్తి వీరన్ చిత్రంలో హీరోగా నటించాడు. 2007లో విడుదలైన ‘పరుత్తి వీరన్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఆయన ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కార్తీ నటించిన ‘యుగానికొక్కడు’ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా కార్తీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ‘ఆవారా’ సినిమా కార్తి కెరీర్ కు మరింత బూస్టింగ్ ఇచ్చింది. ‘నా పేరు శివ’, ‘శకుని’ సహా పలు సినిమాల్లో నేచురల్ యాక్టింగ్ తో ఆహా అనిపించాడు.
కార్తీకి తెలుగునాట ఉన్న ఆదరణ వల్ల తను నటించిన ప్రతి చిత్రం (మధ్యలో ఒకటి, రెండు తప్పించి) తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతూ వచ్చాయి. తెలుగు,తమిళ భాషల్లో సైతం తనే డబ్బింగ్ చెప్పుకోవడం కార్తీ కి బాగా కలిసి వచ్చింది. 2016లో నాగార్జునతో కలిసి నటించిన బైలింగ్వల్ చిత్రం ‘ఊపిరి’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, కార్తీ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమాతో తెలుగులోనూ ఆయనకు ఫ్యాన్ బేస్ పెరిగింది.
‘ఊపిరి’ తర్వాత కార్తీ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మార్కులతో బయటపడ్డాయి. 2019లో యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ సినిమాలో కార్తీ సరికొత్త లుక్ తో కనిపించి ఆడియన్స్ ను అలరించాడు.
ఇక తన గురువు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్ లో నటించి పాన్ ఇండియా వైడ్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఆ తర్వాత వచ్చిన 'సర్దార్' ‘జపాన్’ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి. ప్రస్తుతం ప్రేమ్ కుమార్ .సీ దర్శకత్వంలో ‘మేయిఅలగన్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
కార్తీ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ హాస్పిటల్స్ తో కలిసి తమిళనాడు వ్యాప్తంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాడు. అలాగే, తమ కుటుంబానికి చెందిన ట్రస్ట్ ద్వారా వేలాది మంది నిరుపేద విద్యార్థులను చదివిస్తున్నాడు. ఇవే కాకుండా పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీ విరాళాలు అందిస్తున్నాడు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్‌లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!