తెలుగు జర్నలిజం దిక్సూచి
- June 05, 2024
బూదరాజు గా సుపరిచితులైన తెలుగు భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా చీరాల ఫిర్కా లోని వేటపాలెం గ్రామంలో అమ్మమ్మ ఇంట జన్మించారు. వీరి స్వగ్రామం పక్కనే ఉన్న స్వర్ణ గ్రామం. అయితే వీరి చిన్నతనంలోనే తల్లిగారు మరణించడంతో అమ్మమ్మ, తాతయ్య సంరక్షణలో పెరిగారు. (తర్వాత కాలంలో చీరాల ప్రాంతం మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భాగమైంది).
రాధాకృష్ణ చిన్నతనం తెలుగు బాష మీద ఎంతో మక్కువ చూపేవారు. అందుకు తగ్గట్లే వారి కుటుంబంలో సైతం సాహితీ వాతావరణం ఉండేది.ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత చీరాలలోని ప్రసిద్ధ వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినా కొన్ని కారణాల రీత్యా అందులో ఎక్కువ కాలం కొనసాగలేదు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుండి తెలుగు విభాగంలో ఏంఏ పూర్తి చేసి " హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్‌స్క్రిప్షన్స్" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు పట్టా (పీహెచ్ డి ) అందుకున్నారు. పీహెచ్ డి చేస్తూనే యూజీసీ రీసెర్చ్ స్కాలర్ గా పనిచేశారు.
తెలుగు భాషలో కాలానికి తగ్గట్టుగా వ్రాసే భాషా పదకోశం వృద్ధి చెందకపోవడం కారణంగా పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్న దశలో నాటి ప్రభుత్వం తెలుగు అకాడెమీ ఏర్పాటు చేసి వీరిని భాషా పరిశోధన విభాగానికి అధిపతిగా,ఆ సంస్థకు ఉపసంచాలకుడుగానూ నియమించింది.ఆ బాధ్యతలు చేపట్టి తెలుగు భాషలోని వివిధ మాండలికాల్లో ఉన్న పదకోశాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. జిల్లాల వారీగా ఆయా మాండలికాలకు సంబంధించిన పదకోశాన్ని పుస్తకాలుగా ప్రచురించారు.
పదకోశ నిర్మాణం , కైఫియ్యత్తుల ప్రచురణ , తెలుగులోని ప్రాచీన గ్రంథాలను ఆధునీకరించడం పంటి పనులనే కాకుండా సంస్థలో పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకొచ్చారు. 1988లో తెలుగు అకాడమీలో కొన్ని కారణాల రీత్యా స్వచ్చంద పదవీ విరమణ చేసేదాకా ఆ సంస్థ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.
భారతీయ జర్నలిజం రంగంలో ముఖ్యులైన కోటంరాజు సోదరులతో వీరికి ఉన్న బంధుత్వం కుడా జర్నలిజం రంగం పట్ల ఆసక్తిని కలిగించింది.చిన్నతనంలో వేటపాలెంలోని ప్రముఖ గ్రంథాలయం సారస్వత నికేతనానికి వచ్చే పలు పత్రికలను క్షుణ్ణంగా చదివేవారు. తర్వాత కాలంలో ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీ రావు గారితో ఉన్న వ్యక్తిగత పరిచయం కారణంగా ఈనాడు పత్రికలో పుణ్యభూమి శీర్షికన సి.ధర్మారావు పేరుతో వందలాది వ్యాసాలు రాశారు.
జర్నలిజం రంగంలో ముఖ్యంగా ఈనాడు పత్రికకు పనిచేసే యువజర్నలిస్టుల నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఈనాడు జర్నలిజం స్కూల్ ను ప్రారంభించడం జరిగింది. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఉంటూనే రచనా పద్దతులు , అనువాదం మొదలైన అంశాలపై క్లాసులు చెప్పేవారు. కేవలం సిలబస్ వరకే పరిమితం కాకుండా జీవితానుభవాలను బోధించేవారు. విద్యార్థులు కోసం ప్రత్యేకంగా పలు పుస్తకాలను రాశారు. ముఖ్యంగా ఈనాడు పత్రిక కోసం వీరు వ్రాసిన "ఈనాడు భాషా స్వరూపం" పుస్తకం తెలుగు జర్నలిజం రంగానికి సంబంధించిన అత్యుత్తమ గ్రంథంగా గుర్తింపు పొందింది.
సుమారు 10 సంవత్సరాల పాటు ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ గా వేలాది మందిని పాత్రికేయులుగా తీర్చిదిద్దారు. వీరి శిష్యుల్లో ముఖ్యులు ఏపీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ మాజీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , ఏపీ మీడియా కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారు జీవీడి కృష్ణమోహన్ తో పాటుగా ఎంతో మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ టీవీ మరియు దినపత్రికలకు ఎడిటర్స్ గా పనిచేస్తున్నారు. వీరే కాకుండా ఇంకా ఎందరో వివిధ రంగాల్లో కీలకమైన స్థానాల్లో వీధులు నిర్వహిస్తూ ఉన్నారు.
రాధాకృష్ణ అనువాద రంగంలో నిష్ణాతులు. కేంద్ర సాహిత్య అకాడమీ, NBT కి సంబంధించిన పలు పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. అలాగే పలు తెలుగు పుస్తకాలను సైతం ఇంగ్లీషులోకి అనువదించారు. అలాగే, జర్నలిజం, తెలుగు భాషకు సంబంధించిన అనేక పుస్తకాలను రాశారు. అంతేకాకుండా, ఇతరుల రచనలను, పరిశోధన పత్రాలను తెలుగు అకాడెమీ తరుపున ప్రచురించారు. తెలుగు జర్నలిజం అభివృద్ధి మరియు తెలుగు భాషాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన బూదరాజు రాధాకృష్ణ ఎంతగానో కృషి చేశారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







