కార్యకర్త టూ కేంద్రమంత్రి...!

- June 11, 2024 , by Maagulf
కార్యకర్త టూ కేంద్రమంత్రి...!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంట్ నుండి ఎన్డీయే అభ్యర్థిగా విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మ జాక్‌పాట్ కొట్టారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ మోడీ3.0లో కేంద్ర సహాయ మంత్రి వదవిని దక్కించుకున్నారు.

బీజేపీ వర్మగా సుపరిచితులైన భూపతిరాజు శ్రీనివాసు వర్మ 1967 ఆగస్టు 4వ తేదీన భూపతిరాజు సూర్యనారాయణ రాజు, సీత దంపతులకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. భీమవరంలోని దంతులూరి నారాయణరాజు (డీఎన్ఆర్) కళాశాలలో డిగ్రీ, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పూర్తి చేశారు.

వర్మ విద్యార్ధి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌)లో క్రియాశీలకంగా పనిచేశారు. అయితే తర్వాత కాలంలో బీజేపీ భావజాలానికి ఆకర్షితుడై 1988లో బీజేపీ కార్యకర్తగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు.1991 - 97 మధ్య కాలంలో బీజేపీ భీమవరం పట్ణణ అధ్యక్షుడిగా, 1992-95లో పశ్చిమ గోదావరి జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా, 1997-1999 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శిగా, కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంట్‌ కన్వీనర్‌గా, 2001-02 వరకు పార్టీ జాతీయ కౌన్సిల్‌ మెంబర్‌గా వ్యవహరించారు.

2008 -14 మధ్య రెండు పర్యాయాలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. తర్వాత కాలంలో భీమవరం పురపాలక ఇంఛార్జీ ఛైర్మన్‌గానూ పని చేశారు. 2020 - 23 వరకు రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.

3 దశాబ్దాలుగా బీజేపీకి సేవలందిస్తున్న వర్మ సంఘ్ పరివార్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. 2024 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరుపున ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణా స్వీకరం చేసిన మోడీ మంత్రివర్గంలో రాష్ట్రానికి సంబంధించి వివాదరహితుడుగా, తొలినుంచి పార్టీ విధేయుడిగా ఉన్న శ్రీనివాస్ వర్మ వైపే చూపారు. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా వర్మను నియమించారు.

శ్రీనివాస వర్మ బీజేపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తోన్న ఆయనకు కేంద్ర మంత్రి పదవి వరించడం పట్ల బీజేపీ శ్రేణులు, అభిమానులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com