బక్రీద్ పండుగ
- June 17, 2024
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 6:45 గంటల నుంచి 8:30 వరకు మసీదులు, ఈద్గాహ్‌ల వద్ద ‘ఈదుల్ అజ్‌హా’ ప్రత్యేక నమాజును వేలాదిమంది ముస్లింలు ఆచరించనున్నారు. ఇందుకోసం మసీదులన్నీ ముస్తాబై ఉన్నాయి. త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ పండుగలో ‘ఖుర్బానీ’ చేసేందుకు జిల్లా ముస్లింలు సిద్ధమయ్యారు.
నమాజు అనంతరం తమ తహతకు తగ్గట్లు గొర్రెలు వంటి వాటిని ఖుర్బానీ చేసి ఆ మాంసాన్ని పంచిపెట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది బక్రీద్. ఇబ్రహీం అలైహిస్సలాం, ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం త్యాగస్మరణే సోమవారం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇదుల్ అజ్‌హా (బక్రీద్)ను జరుపుకుంటుంటారు.
బక్రీద్ పండుగను ఈదుల్ అజ్‌హాగా పేర్కొంటారు. ఖుర్బానీ అంటే సమర్పణ, త్యాగం, బలి అని అర్థం. సుమారు 4వేల ఏళ్ల క్రితం ఇరాక్ దేశంలో పండిత కుటుంబంలో జన్మించిన దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీంకు(సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకరోజున కల వచ్చింది. ఆ స్వప్నంలో 86 ఏళ్ల వృద్ధాప్యంలో జన్మించిన తన ఏకైక కుమారుడు ఇస్మాయిల్‌ను ఖుర్బానీ చేయాలని అల్లాహ్ ఆ కలలో ఇబ్రాహీంను ఆదేశించినట్లు కల సారాంశం. అల్లాహ్ ఆదేశానుసారం తన కుమారుడిని బలి ఇవ్వడం కోసం సిద్ధం కాగా అల్లాహ్ దాన్ని స్వీకరించి ఇస్మాయిల్‌కు బదులు స్వర్గం నుంచి ఓ పొట్టేలు (దుంబా)ను పంపి ఖుర్బానీ చేయడమే ఈ పండుగ ప్రత్యేకత.
ఇబ్రాహీం త్యాగానికి ప్రతిఫలంగా ప్రాప్తించిన ఈ పండుగను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈదుల్ అజ్‌హా ప్రత్యేక నమాజు అనంతరం ఖుర్బానీ చేస్తారు. ఆర్థ్దికంగా ఉన్నవారు ఒంటరిగా గొర్రె, మేకపోతులను దానం చేస్తారు. మధ్యతరగతి వారు ఏడుగురు కలిసి ఆవును, 13 మంది కలిసి ఒంటెను ఖుర్బానీ చేసి మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒకటి పేదలకు, మరొకటి బంధువులకు ఇస్తారు. ఇంకో వాటాను తమ ఇంటికి ఉపయోగించుకుంటారు.
బక్రీద్ పండుగ అనేది త్యాగానికి ప్రతీక. ఖుర్బానీ అంటే జంతుబలి కాదు, మానవుడు దైవమార్గంలో తన సర్వస్వాన్ని త్యజిస్తానని చేసే ప్రకటన మాత్రమే. దైవాన్ని విశ్వసించడం, మానవులంతా ఒకటేనని నమ్మాలి. చెడును నిరోధించడం, మంచిని పెంచడం, కష్టాలలో సహనం వహిస్తూ, త్యాగ నిరతిని చూపించాలన్న సందేశమే ఖుర్బానీలో దాగి ఉంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హజ్ వ్యాక్సినేషన్.. ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కీలక అప్డేట్..!!
- నేబర్ హత్య..వ్యక్తి పై విచారణ..మానసిక పరిస్థితి సరిగ్గా లేదా?
- కువైట్‌లో డ్రైవర్‌ను చంపిన ఓనర్ కు ఉరిశిక్ష..!!
- యూఏఈలో ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలు..!!
- ఈద్ అల్-అధా..కువైట్ లో జూన్ 5-9 వరకు సెలవులు..!!
- మక్కాలో నలుగురు చైనా జాతీయులు అరెస్టు..!!
- తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల..
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..