జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు

- June 17, 2024 , by Maagulf
జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు

న్యూ ఢిల్లీ: కొత్త క్రిమినల్ చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ బాధ్యత) అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారం ప్రకటించారు.ఈ చట్టాల అమలుకు నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించలేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. భారతీయ శిక్షా స్మృతి (ఐపిసి), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి), సాక్షాధారాల చట్టం స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష చట్టం అమలు ఉంటుందని మేఘ్వాల్ తెలియజేశారు. కొత్త చట్టాల అమలు నిమిత్తం అవసరమైన శిక్షణ కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టినట్లు కూడా ఆయన తెలిపారు. ఆదివారం కోల్‌కతాలో ‘క్రిమినల్ జస్టిస్ విధానం అమలులో భారత ప్రగతి పథం’ ప్రారంభ సమావేశంలో మేఘ్వాల్ ప్రసంగిస్తూ,‘సకాలంలో, వేగంగా, లోపరహిత న్యాయం’ చేకూర్చడానికి జూలై 1 నుంచి ఆ మూడు కొత్త చట్టాల అమలు జరుగుతుంది’ అని చెప్పారు. సరైన రీతిలో సంప్రదింపులు జరగలేదన్న ఆరోపణలను మేఘ్వాల్ ప్రస్తావిస్తూ, ‘తమను సంప్రదించలేదని కొందరు అంటున్నారు.

అది అసత్యం. వలసవాద చట్టాల మార్పు కోసం డిమాండ్ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉంది. ఆ ప్రక్రియ చాలా కాలం క్రితమే మొదలైంది’ అని చెప్పారు. అన్ని రాష్ట్రాల నుంచి సూచనలు కోరినప్పటికీ 18 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే స్పందించాయని మంత్రి తెలిపారు. ‘తుదకు భారత ప్రధాన న్యాయమూర్తి, 16 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఐదు లా అకాడమీలు, 22 లా యూనివర్శిటీలు కూడా తమ సూచనలు అందజేయడమైంది’ అని ఆయన తెలియజేశారు. ‘మేము అందరు ఎంపిలను సంప్రదించాం. ఉభయ సభల సభ్యులతో సహా 142 మంది మాత్రమే స్పందించారు. దేశవ్యాప్తంగా ఎంఎల్‌ఎలు అందరి నుంచి కూడా సూచనలు అడిగాం. వారిలో 270 మంది మాత్రమే స్పందించారు. మేము విస్తృతంగా సంప్రదించాం. కానీ ఎవ్వరూ తమ అభిప్రాయాలు తెలియజేయలేదు’ అని మేఘ్వాల్ చెప్పారు. ‘నాలుగు సంవత్సరాల సమగ్ర పరిశీలన అనంతరం ఆ చట్టాల రూపకల్పన జరిగింది. సంప్రదింపులు లేవన్న మాట అసత్యం. పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిగాయి. హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన 58 సమావేశాలు జరిగాయి’ అని ఆయన నొక్కిచెప్పారు.

సామాజిక పురోగతి, సాంకేతిక పరిజ్ఞానం ప్రమేయంకారణంగా వలసవాద చట్టాల నుంచి దూరంగా జరగడం అవసరమని మేఘ్వాల్ సూచించారు. ‘మారుతున్న కాలాలు, కొత్త సాంకేతికలతో మెరుగుదలలు ఉండాలి. పౌరులకు సకాలంలో న్యాయం అందడం లేదు. అందువల్ల మేము జీరో ఎఫ్‌ఐఆర్, క్షమాభిక్ష పిటిషన్, లింగ తటస్థత చేర్చాం. ఈ విధానంలో సమస్యలు ఉన్నాయి. అందుకే మార్పులు చేస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త చట్టాలు ప్రజల ప్రాధాన్యంగా, సకాలంలో అమలు జరిగేలా ఉన్నాయని, భారత శీఘ్రతర అభివృద్ధితో అనుసంధానమై ఉన్నాయని మేఘ్వాల్ తెలిపారు. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం, కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవ్ మణి, భారత లా కమిషన్ సభ్య కార్యదర్శి రీటా వశిష్ట కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com