సిఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అచార్య యార్లగడ్డ

- June 29, 2024 , by Maagulf
సిఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అచార్య యార్లగడ్డ

విజయవాడ: ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరును పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు  విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మ భూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. అధికారం లోకి వచ్చిన మరుక్షణమే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవటం అభినందనీయమన్నారు. ఈ మేరకు శనివారం విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేసారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరును వైఎస్‌ఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా మార్చడంపై కలత చెంది, నిరసన వ్యక్తం చేస్తూ అధికార భాషా సంఘం చైర్మన్‌ పదవితో పాటు హిందీ అకాడమీ, తెలుగు అకాడమీ ఛైర్మన్ పదవులకు లక్ష్మీప్రసాద్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్‌కు భారతరత్న తీసుకువస్తామన్న సీఎం ప్రకటనను యార్లగడ్డ స్వాగతించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయంకు పేరును పునరుద్ధరించటంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్‌ సైతం వేగంగా స్పందించారని సంతోషం వ్యక్తం చేసారు. 

ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాష ప్రాముఖ్యతను చాటిచెప్పడంతోపాటు ఐక్యరాజ్యసమితిలో అధికార భాషల్లో ఒకటిగా మార్చడమే విశ్వ హిందీ పరిషత్ లక్ష్యం అని అచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ సందర్భంగా అన్నారు. హిందీ భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు పరిషత్ కృషి చేస్తుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హిందీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తనవంతు సహకారం అందిస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు హిందీ నేర్చుకోవాలని వైఎల్‌పి విజ్ఞప్తి చేసారు. భవిష్యత్తులో హిందీలో కూడా చట్టాలు వస్తాయన్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయన్న ఆర్యోక్తి, వైఎస్సార్‌సీపీ విషయంలో నిజం అయ్యిందన్నారు. స్వయంకృత ఆపరాధమే ఈ పరిస్ధితికి కారణమన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com