'శ్రీ సాంస్కృతిక కళాసారథి-సింగపూర్' ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం

- July 03, 2024 , by Maagulf
\'శ్రీ సాంస్కృతిక కళాసారథి-సింగపూర్\' ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం

"శ్రీ సాంస్కృతిక కళాసారథి-సింగపూర్" ఆధ్వర్యంలో పవిత్ర మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా, అంతర్జాల మాధ్యమంగా ప్రత్యేక ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పంచమహాసహస్రావధాని అవధాన సమ్రాట్ డా.మేడసాని మోహన్  "శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం" అనే అంశం పై రెండు గంటలపాటు ప్రవచనాన్ని అందించారు. 

యోగిని ఏకాదశి మరియు మతత్రయ ఏకాదశి కలిసిన రోజు యొక్క విశిష్టతను వివరించి, ఏకాదశి వ్రతమహిమ గురించి తెలియజేశారు. అనంతరం కురుక్షేత్ర సంగ్రామం ముందు పాండవులు ఆచరించిన ఏకాదశి వ్రత కథను గూర్చి తెలియజేశారు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు జరిగిన రాయబార ఘట్టాలనుండి సంగ్రామ సమాప్తి వరకు జరిగిన సన్నివేశాలన్నింటినీ కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ, తిక్కన భారతం లోని పద్యాలను ఉదహరిస్తూ, వాటిలోని సాహితీ విశిష్టతను తెలియజేస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని నడిపించిన తీరు అంతా అద్భుతంగా వివరించారు. తానే కర్త కర్మ క్రియ అయ్యి, ధర్మసంస్థాపన మూల లక్ష్యంగా యుద్ధ సారథ్యం చేయడంలో, వివిధ సందర్భాలలో కృష్ణ భగవానుడు ప్రదర్శించిన లీలల వెనక ఉద్దేశాలను చక్కగా వర్ణించి చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. 

శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "డా మేడసాని మోహన్ ఎంతో అభిమానంగా తమ సంస్థను ప్రోత్సహించే సహృదయులని, గతంలో కూడా వారి ప్రవచనాలను  సింగపూర్ తెలుగు ప్రజలు ఆదరించారని, మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా వారు ఈ ప్రత్యేక ప్రవచనం  అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 

సింగపూర్ నుండి కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు పాతూరి రాంబాబు, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి కాసర్ల శ్రీనివాస్ ఆంధ్ర కళావేదిక ఖతార్ అధ్యక్షులు వెంకప్ప భాగవతుల, ప్రతినిధి సాహిత్య జ్యోత్స్న, యూఏఈ నుంచి దినేష్,బహ్రెయిన్ తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సంస్థ ప్రధాన కార్యవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభను నిర్వహించగా, రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వహణలో యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయగా, వెయ్యికి మంది పైగా ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ చూసారు అని నిర్వాహుకులు

తెలియచేసారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com