సోషలిస్టు ప్రధానమంత్రి....!
- July 12, 2024
ఇయన ఎవరో గుర్తుపట్టారా! నాకు తెలిసి ఇప్పటి తరానికి అసలు ఏ మాత్రం తెలియకపోవచ్చు .కానీ 60,70, 80,90 దశకాల దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఒక గొప్ప నాయకుడు ఇతడు. రాజకీయ అధికారం కంటే ఆత్మగౌరవమే మిన్నగా భావించి ఏకంగా దేశ ప్రధాని పదవినే తృణ ప్రాయంగా త్యజించిన మహానేత. వీరి పేరు చంద్ర శేఖర్.
ఉత్తరప్రదేశ్ లోని పుర్వాంచల్ ప్రాంతంలో ఒకప్పటి కరువు కాటకాలకు నిలయమైన బలియా జిల్లాలోని ఒక కుగ్రామం నుండి వచ్చిన చంద్రశేఖర్ విద్యార్థి దశలోనే సోషలిస్ట్ విద్యార్థి విభాగం తరుపున రాజకీయాల్లో అడుగుపెట్టారు.
అనంతరం భారతీయ సోషలిజం పితామహుడు ఆచార్య నరేంద్ర దేవ ప్రియ శిష్యుడిగా క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పార్టీలో నరేంద్ర దేవ, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, అశోక్ మెహతా వంటి ఉద్దండుల సహచర్యంతో జాతీయ భావాలతో కూడిన సామ్యవాద దృక్పథాన్ని అలవరుచుకున్నారు.
అతి వాదిగా ముద్ర పడిన ప్రముఖ సోషలిస్ట్ నేత లోహియా సోషలిస్ట్ పార్టీలో ఉంటూనే తాను సైద్ధాంతికంగా దగ్గరగా ఉండే అతివాద వామపక్ష సోషలిజం వైపు పార్టీనీ నడిపించేందుకు చేసిన ప్రయత్నాలను విఫలయత్నం చేయడంలో యువకుడైన చంద్రశేఖర్ పాత్ర మరువలేనిది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సోషలిస్ట్ పార్టీ సైతం వామపక్ష పిడీవాద కబంద హస్తల్లోకి వెళ్తున్న సమయంలో సోషలిజం వైపు మొగ్గు చూపుతున్న నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ లో చేరి పాలనలో ఆమెకు సహాయకుడిగా నిలిచారు.
కాంగ్రెస్ పార్టీ లో చేరినప్పటికీ వృద్ద నేతలకు, ఇందిరాకు మిగిలిన నాయకుల్లా వాళ్ళ భజన చేస్తూ కూర్చో లేదు, తనతో పాటుగా అప్పటి యువ కాంగ్రెస్ నేతలైన కృష్ణ కాంత్ (తర్వాత కాలంలో దేశ ఉపరాష్ట్రపతి గా పనిచేశారు) రామ్ ధన్, మోహన్ ధారియా వంటి వారితో కలసి" యుంగ్ టర్క్స్ "గా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక తీర్మానాలు, ఇందిరా గాంధీ పాలనా వైఫల్యాలను బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చారు.
చంద్రశేఖర్ నేతృత్వంలోని యంగ్ టర్క్స్ కారణంగానే ఇందిరా సోషలిస్ట్ పంథాలో పూర్తి స్థాయిలో నడుస్తూ , తన పాలనలో విధానపరమైన నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. బ్యాంకుల జాతీయకరణ, రాజ భరణాల రద్దు, నీరు పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడం వంటివి జరగడానికి ముఖ్య కారణం వారే.
ఇందిరా గాంధీకి చంద్రశేఖర్ అంటే ఎంతో అభిమానం పదవుల కోసం తన చుట్టూ చేరి భజనలు చేస్తూ వచ్చే నాయకుల కంటే తన పాలన గాడి తప్పిన ప్రతి సారి విమర్శలు చేస్తూ వచ్చిన ఆయనకే ఎక్కవ విలువ ఉండేది. ఆమె తాను చేపట్టే ప్రతి పథకం గురించి ముందుగా చంద్రశేఖర్ గారితో చర్చించి ఆయన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పథకాన్ని అమలు చేయడం జరిగింది.
1975 లో దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీ విధించిన అత్యవసర సమయంలో చంద్రశేఖర్ నేతృత్వంలోని యంగ్ టర్క్స్ ను సైతం అరెస్ట్ చేశారు. జైల్లో నుంచే ఇందిరా నియంత విధానాలకు వీరు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు.
1977 లో విడుదలైన తర్వాత జయప్రకాష్ నారాయణ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనతా పార్టీ లో చేరి ఉత్తరాన పార్టీ తరపున క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కృషి చేశారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్, చౌధరి చరణ్ సింగ్, వాజ్ పేయ్ ఇతరత్రా దిగ్గజాలు ఉన్న ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
జనతా పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే, జనసంఘ్, సోషలిస్ట్, స్వతంత్ర మరియు పాత కాంగ్రెస్ నేతలతో కూడిన కలగూర గంప లాంటి జనతా పార్టీ ని నడిపించడంలోనే ఆయన నాయకత్వ నైపుణ్యాలు గురించి దేశ రాజకీయాల్లో ఒక స్పష్టత ఏర్పడింది. అయితే నాయకుల మధ్య వచ్చిన వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంగా 1980 నాటికి జనతా పార్టీ విచ్ఛిన్నమైన తర్వాత కూడా ఆ పార్టీలోనే కొనసాగుతూ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.
చంద్రశేఖర్ రాజకీయ జీవితంలో కీలకమైన మలుపు భారత యాత్ర పేరుతో చేసిన పాదయాత్ర.భారత దేశ రాజకీయ చరిత్రలో ఇటువంటి యాత్ర అప్పటి వరకు ఎవరు చేపట్టలేదు. కన్యాకుమారి నుండి ఢిల్లీ వరకు ఉద్దేశించిన ఈ యాత్రలో కన్యాకుమారి నుంచి మొదలు పెట్టి సుమారు 4260 కిలో మీటర్లు నడిచి ఢిల్లీ చేరుకున్నారు. ఇంతటి సుదీర్ఘ యాత్ర చేసిన మరో జాతీయ నాయకుడు అప్పటి నుండి మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టే వరకు ఎవరు లేరు అంటే అతిశయోక్తి కాదు. .
భారత యాత్ర సమయంలో చంద్రశేఖర్ గ్రామీణ భారతంలో నివసిస్తున్న అన్ని వర్గాల ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారికి తన ద్వారా అందే సహాయాన్ని అప్పటికప్పుడు అందిస్తూ వారికి మరింత దగ్గరయ్యారు.ఈ యాత్ర కు కులమతాలకు అతీతంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు .ఈ యాత్ర ద్వారా దేశ రాజకీయాల్లో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర తర్వాత కాలంలో ఎంతో మంది నేతలకు అధికారం కైవసం చేసుకునేందుకు మార్గదర్శనం చేసింది.
1989లో జనతాదళ్ పార్టీ ఏర్పాటులో సైతం చంద్రశేఖర్ కీలకమైన పాత్ర పోషించారు. ఆ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఏర్పాటులో కీలకమైన నాయకులు ఎన్టీఆర్ , దేవిలాల్ సహకారంతో మాజీ కాంగ్రెస్ నేత వి.పి.సింగ్ ప్రధాని చేపట్టాడు. అయితే ఈ నిర్ణయం కింది స్థాయి నాయకులకు తీవ్ర ఆగ్రహం కూడా తెప్పించింది. అయినప్పటికీ వారిని చంద్రశేఖర్ సముదాయించడంతో శాంత పడ్డారు.
వి.పి.సింగ్ ప్రధానిగా ఓబిసీ రిజర్వేషన్లు అమలు చేసిన కారణంగా దేశవ్యాప్తంగా అలర్లు చెలరేగాయి, దీంతో సింగ్ రాజీనామా చేయడంతో ప్రధాని పదవి చేపట్టమని స్వయంగా రాజీవ్ గాంధీ, దేవీలాల్ వంటి వారు కోరడంతో ప్రధాన మంత్రిగా చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు.కాంగ్రెస్ తరుపున రాజీవ్ గాంధీ బయటి నుండి షరతులు లేని మద్దతు ఇవ్వడం జరిగింది. స్వాతంత్ర భారతదేశ ప్రధాన మంత్రి గా ఎన్నికైన తొలి సోషలిస్టు నేతగా చంద్రశేఖర్ చరిత్ర సృష్టించారు.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ , దేశంలో అలర్లకు కారణమైన రిజర్వేషన్ల సమస్యను అధిగమించేందుకు ఎంతో కృషి చేశారు. క్రమంగా ఆయన పాలన మీద పట్టు సాధిస్తూ ఉండటం వలన కాంగ్రెస్ నేతలకు కన్ను కుట్టింది. అధికారమే పరమావధిగా రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీకి చంద్రశేఖర్ బలమైన శక్తి గా ఎదగడం ఇష్టం లేదు. ప్రభుత్వాన్ని పడగొడతామని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనల పట్ల రాజీవ్ గాంధీ స్పందించక పోవడంతో మనస్థాపం చెంది రాజకీయాల్లో ఆత్మగౌరవమే ప్రాణంగా భావించే చంద్రశేఖర్ ప్రధాని పదవికి రాజీనామా చేయడం జరిగింది.
మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, 8 సార్లు లోక్ సభ సభ్యుడిగా పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించిన చంద్రశేఖర్ ఒక గొప్ప పార్లమెంటేరియన్. సభలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడం కోసం ఏటువంటి భేషజాలకు పోకుండా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేశారు.
చంద్రశేఖర్ భారత రాజకీయాల్లో భయమే ఎరుగని నాయకుడు. ఇందిరా గాంధీ మరణం తర్వాత అకారణంగా దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులను కాంగ్రెస్ గుండాలు ఊచకోత కోస్తున్న సమయంలో అమాయక సిక్కు ప్రజలకు అండగా నిలిచి ప్రతిఫలంగా ఇందిరా గాంధీ వ్యతిరేకిగా ముద్రపడి 1984 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన చిరునవ్వుతో పరాజయాన్ని స్వీకరించారు.
చంద్రశేఖర్ గొప్ప వక్త , అనేక విషయాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండటమే కాకుండా వాటికి సంబంధించిన వివరాలను ప్రజలకు తన ఉపన్యాసాల ద్వారా తెలియజేసే వారు. ఉద్వేగానికి లోనుకాకుండా సరళమైన బాషతో మాట్లాడే ఆయన ప్రసంగాలు పామరుడిని సైతం విశేషంగా ఆకట్టకునేవి.
చంద్రశేఖర్ ఏనాడు పదవుల కోసం తన తరం నాయకుల్లా వెంపర్లాడ లేదు. పదవులే ఆయన కోరుకొని ఉంటే తనకున్న అర్హతలకు సుదీర్ఘ కాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించేవారు. స్వతంత్ర భారత దేశంలో వీరి గురించి పూర్తిగా తెలిసిన ఏకైక వ్యక్తి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాత్రమే. నమ్మిన సిద్ధాంతం కోసం ఏనాడు రాజీ పడని భారతీయ రాజకీయ నాయకుల్లో ముఖ్యులు మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్. రాజకీయాల్లో రాబోయే తరాలకు సైతం వీరు స్ఫూర్తిదాయకమైన నేత.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!