ప్రయోగాత్మక స్టార్ హీరో... !
- July 23, 2024
టాలీవుడ్లో బలమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో ఒకరిగా.. బలమైన అభిమాన గణమున్న హీరోల్లో ఒకరిగా సూర్య గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. నేడు ఆయన జన్మదినం.
సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. ప్రముఖ కోలీవుడ్ నటుడు శివకుమార్, లక్ష్మీ దంపతులకు తొలి సంతానంగా 1975 జులై 23న చెన్నైలో జన్మించారు . కోయంబత్తూరులో పెరిగారు. సూర్యకు తమ్ముడు కార్తి, చెల్లెలు బృందా శివకుమార్ ఉన్నారు. మద్రాసులోని సెయింట్ బేడీ స్కూల్, లయోలా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. చదువయ్యాక ఎనిమిది నెలల పాటు దుస్తుల ఎగుమతి కంపెనీలో పనిచేశారు. అయితే ఆ కంపెనీలో తాను నటుడు శివకుమార్ తనయుడు అనే విషయాన్ని సూర్య ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత ఆ కంపెనీ ఓనరే స్వయంగా తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
తొలుత సినిమాలపై అంతగా ఆసక్తి లేని సూర్యకు 'ఆశై' సినిమాలో అవకాశం వచ్చినా తిరస్కరించారు. 1997లో 'నెరుక్కు నెర్' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. మణిరత్నం నిర్మించిన చిత్రమిది. ఆ తర్వాత 'కాదలే నిమ్మది', 'సందిప్పొమ', 'పెరియన్న', 'పూవెల్లమ్ కెట్టుప్పర్' తదితర చిత్రాల్లో నటించారు. ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖ్ తెరకెక్కించిన 'ఫ్రెండ్స్'తోనూ, బాల దర్శకత్వం వహించిన 'నందా'తోనూ సూర్య సినీ ప్రయాణం మలుపు తిరిగింది.
గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన 'కాక్కా కాక్కా' చిత్రం సూర్యకు ఘన విజయాన్ని అందించింది. ఆ చిత్రం తెలుగులో 'ఘర్షణ'గా రీమేకై విజయం సాధించింది. బాల దర్శకత్వం వహించిన 'పితామగన్' కూడా తమిళంతో పాటు, తెలుగులోనూ అనువాదమై ఆయనకు మంచిపేరు తీసుకొచ్చింది. 2005లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గజిని'తో సూర్య సినీ ప్రయాణమే మారిపోయింది. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అప్పట్నుంచి దాదాపుగా సూర్య నటించిన ప్రతి చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'సింగమ్' సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు సూర్య.
గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రంలో 16ఏళ్ల యువకుడిగా, 65 ఏళ్ల వృద్ధుడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి వారెవ్వా అనిపించుకున్నారు. సూర్య హీరోగా దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో రూపొందిన 'సూరారై పొట్రు' చిత్రం ఆస్కార్ రేసులో నిలిచింది. అకాడమీ అవార్డుల స్క్రీనింగ్ రూమ్లో ప్రదర్శించనున్న 366 సినిమాల్లో ఈ చిత్రానికి చోటు దక్కింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా పలు విభాగాల్లో ఈ సినిమా పోటీలో నిలిచింది. కానీ తుదిజాబితాలో ఈ సినిమాకు నిరాశే ఎదురైంది.
హీరోగానే నటించాలనేది ఆయన తత్వం కాదు. క్యారెక్టర్ నచ్చితే విలన్‌గా అయినా నటించటానికి ఏమాత్రం ఆలోచించరు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 24 సినిమా.. రీసెంట్‌గా విడుదలైన విక్రమ్ (Vikram) మూవీ. తనదైన నటనతో విలన్ పాత్రకు ప్రాణం పోశారు సూర్య. పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ కథానుగుణంగా ఎలాంటి ఫైట్స్,డాన్సులు లేకుండా కేవలం తనదైన నటనతో ఆ పాత్రలో జీవించారు సూర్య. ఈ జాతీయ అవార్డ్ రావటం అనేది సూర్యకు ఓ బూస్టప్‌లాంటిది. విలక్షణమైన పాత్రలను ఇంకా చేయాలనే తపనకు మరింత బలాన్నిచ్చిన పునాదిగా భావించవచ్చు.
సూర్య వ్యక్తిగత జీవితానికి వస్తే 'కాక్కా కాక్కా' చిత్రంలో తన సరసన నటించిన కథానాయిక జ్యోతికను సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. జ్యోతిక రీఎంట్రీ ఇచ్చిన '36 వయదినిలే' సినిమా కోసం సూర్య నిర్మాతగా మారారు. ఆ తరువాత 'పసంగ2', '24', 'మగలిర్ మట్టుమ్', 'కడైకుట్టి సింగమ్' చిత్రాల్ని నిర్మించారు.
నటుడిగా, నిర్మాతగానే కాదు టెలివిజన్ హోస్టుగానూ సూర్య పేరు తెచ్చుకున్నారు. 2012లో స్టార్ విజయ్ నిర్వహించిన 'నీంగళం వెల్లలం ఒరు కోడి' గేమ్ షోతో టీవీ ప్రెజెంటర్ గా మారారు. ఇది 'మీలో ఎవరు కోటీశ్వరుడు?' షోకి తమిళ వెర్షన్. సూర్య మంచి నటుడే కాదు..గొప్ప మనసున్న మానవతావాది. అగరం ఫౌండేషన్ (Agaram Foundation)ను స్థాపించి పేద విద్యార్థులకు విద్యను అందించటంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం సూర్య 'కంగువ' వంటి భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వెట్రిమారన్ తో చెయ్యాల్సిన 'వడివాసల్' మూవీ హోల్డ్ లో వుంది.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







