వ్యాపార దాన కర్ణుడు - ప్రేమ్‌జీ
- July 24, 2024
మన దేశంలో దాతృత్వం గురించి మాట్లాడుకోవాల్సిన వస్తే మొదటగా వినిపించే పేరు విప్రో సంస్థల అధిపతి అజీమ్ ప్రేమ్‌జీ. వంట నూనెలు తయారుచేసే చిన్న కంపెనీ స్థాయి నుంచి మొదలైన విప్రో ప్రస్థానం…అంతింతై వటుడింతై అన్నట్లు నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యాపార సంస్థల సరసన నిలిచింది. విప్రో ఈ స్థాయికి ఎదగడంలో ప్రేమ్‌జీ కృషి చాలనే ఉంది. 55 ఏళ్లు విప్రోను అజీమ్ ప్రేమ్‌జీ ముందుకు నడిపించారు. నేడు ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ జన్మదినం సందర్భంగా ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం..
అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ 1945,జూలై 24న ఒకప్పటి బొంబాయి ప్రావిన్స్ రాష్ట్ర రాజధాని బొంబాయి (నేడు ముంబై) పట్టణంలోని గుజరాతీ ఖోజా ముస్లీమ్ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ప్రేమ్‌జీ తల్లిదండ్రులు మహమ్మద్ హుస్సేన్ హషీమ్ ప్రేమ్‌జీ, డాక్టర్ గులాబోలు అప్పటి బొంబాయి నగరంలో ప్రముఖులు. అజీమ్ స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు.
ప్రేమ్‌జీ కుటుంబం తోలి నుండి బియ్యం వ్యాపారంలో ఉండేది. దేశానికి స్వాతంత్రం రాక పూర్వం పశ్చిమ భారత దేశం నుంచి తూర్పు ఆసియా దేశాలైన బర్మా (నేడు మయన్మార్), ఇండోనేషియా, థాయ్ ల్యాండ్ దేశాల వరకు వీరి కుటుంబ వ్యాపారం విస్తరించి ఉంది. హషీమ్ హయాంలోనే బర్మాలో అతిపెద్ద బియ్యం రైస్ మిల్ వ్యాపారం ఏరపడింది.రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో బర్మాలో ఏర్పడ్డ ఆహార సంక్షోభాన్ని తీర్చడంలో హషీమ్ ప్రేమ్‌జీ తనవంతు పాత్ర పోషించారు. అప్పట్లోనే ఆయన్ను బర్మాలో రైసు కింగ్‌గా పిలిచేవారు.
హషీమ్ ప్రేమ్‌జీ 1945లో వెస్ట్రన్ ఇండియన్ వెజిటేబుల్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (దీన్నే తర్వాత కాలంలో విప్రోగా మార్చడం జరిగింది) సంస్థను స్థాపించి వనస్పతి వంట నూనెల వ్యాపారం ప్రారంభించారు.ఆ తర్వాత ఈ సంస్థ సబ్బులను తయారు చేయడం కూడా మొదలు పెట్టింది. ఇదే సమయంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలోనే పాకిస్తాన్ ఏర్పడటం జరిగింది. పాక్ దేశ జాతిపితగా పిలుచుకునే ముహమ్మద్ అలీ జిన్నా అలియాస్ జిన్నా హషీమ్ ప్రేమ్‌జీని తమ దేశానికి ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టేందుకు రమన్నానిరభ్యంతరంగా తిరస్కరించడం జరిగింది. జిన్నా బ్రతికున్నంత కాలం ప్రేమ్‌జీ కుటుంబాన్ని పాకిస్తాన్ దేశానికి రప్పించుకునే ప్రయత్నాలు ఎన్నో జరిగినా అవన్ని విఫల యత్నాలుగా మిలిపోయాయి.
1966లో హషీమ్ ప్రేమ్‌జీ ఆకస్మిక మరణం కారణంగా కంపెనీ వ్యాపార బాధ్యతలను ఆయన కుమారుడైన 21 ఏళ్ల అజీమ్ ప్రేమ్‌జీ చేపట్టారు. అజీమ్ తల్లి డాక్టర్ గులాబో ప్రేమ్‌జీ చైర్పర్సన్ బాధ్యతల్లో ఉన్నప్పటికీ వ్యాపార నిర్ణయాలు తీసుకునేందుకు తన కుమారుడికి సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చారు. వంట నూనెలు, సబ్బుల తయారీ నుంచి చిన్న పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులను తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావడంతో ఎలక్ట్రికల్ బల్బుల వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ప్రేమ్‌జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతి కంపెనీ విజయవంతం కావడం విశేషం.
1977లో దేశంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఐటీ కంపెనీ ఐబీఎంను కంపెనీ విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తు మొత్తం కంప్యూటర్ రంగానిదే నమ్మిన ప్రేమ్‌జీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ సమయంలోనే కంప్యూటర్ల వ్యాపారంలోకి అడుగు పెట్టారు. 1981లో విప్రో కంపెనీ తొలి దేశీయ కంప్యూటర్లను రూపొందించి అమ్మడం ప్రారంభించింది. రెండు దశబ్దాల్లోనే విప్రో కంపెనీ దేశంలోనే అతిపెద్ద కంప్యూటర్ల తయారీ కంపెనీగా నిలిచింది.
కంప్యూటర్ల తయారీలో ఉంటూనే 1984లో ఐటీ రంగంలోకి విప్రో ప్రవేశించింది. 1990ల చివరికి ఇండియాలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా విప్రో నిలపడంతో ప్రేమ్‌జీ పాత్ర కీలకం. భారతదేశంలో ఉన్న అత్యంత విశ్వసనీయత కలిగిన వ్యాపార సంస్థల్లో విప్రో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఐటీ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లుగా ఉంది. మొత్తంగా 2 లక్షలకు పైబడిన ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. 2019లో విప్రో సంస్థల ఛైర్మన్ బాధ్యతల నుండి వైదొలిగి తన కుమారుడికి అప్పగించారు.
దేశంలో సంపన్నుల్లో ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా అజీమ్ ప్రేమ్‌జీ పేరు ప్రస్తావన వస్తుంది. ప్రేమ్‌జీ తల్లి గులాబో బొంబాయిలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేసేవారు. అంతేకాకుండా, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తన తల్లి నుండి స్ఫూర్తి పొందిన ఆయన విప్రో సంస్థ తరుపున పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2001లో తన పేరు మీదనే అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తొలుత రూ.998 కోట్ల రూపాయిలు డొనేషన్‌ను ఇచ్చారు. 2019లో రూ.52,750 కోట్లు విలువైన 34 శాతం విప్రో షేర్లను ఫౌండేషన్‌కే ఇచ్చారు.దీంతో ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన విరాళాలు రూ.1,45,000 కోట్లు. కరోనా కాలంలో కూడా దేశవ్యాప్తంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పర్చేందుకు ప్రేమ్‌జీ అత్యధికంగా రూ.9,713 కోట్లను విరాళంగా ఇచ్చారు.
అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగంపై ఎక్కువ దృష్టిపెడుతుంది. ప్రభుత్వ స్కూళ్లల్లో నాణ్యమైన, సమానమైన విద్య అందేందుకు తెలంగాణతో పాటు కర్నాటక, ఉత్తరాఖండ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చెరి, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది ఈ సంస్థ. బెంగళూరు కేంద్రంగా అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీని ఏర్పాటు చేసి పలు కీలకమైన విభాగాల్లో కోర్సులను అందజేస్తున్నారు. తన సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేసేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేశారు.
వ్యాపార రంగానికి, సామాజిక సేవా రంగానికి ప్రేమ్‌జీ చేసిన కృషికి గాను ఆయన్ని 2005లో పద్మ భూషణ్, 2011లో పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. దేశ, విదేశలకు చెందిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఆయన్ని పలు అవార్డులతో సత్కరించింది.
అజీమ్ ప్రేమ్‌జీ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన పెద్ద కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ, ప్రస్తుతం ప్రస్తుతం విప్రో కంపెనీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు తారిఖ్ ప్రేమ్‌జీ అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లోని ఎండోమెంట్ ఫండ్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







