పారిస్ ఒలింపిక్స్ 2024: భారత హాకీ టీమ్ శుభారంభం..

- July 28, 2024 , by Maagulf
పారిస్ ఒలింపిక్స్ 2024: భారత హాకీ టీమ్ శుభారంభం..

పారిస్: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ టీమ్ శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని ఇండియన్ హాకీ టీమ్ 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించింది.

ఆఖరి క్షణం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ సింగ్.. గోల్‌తో విజయాన్నందుకుంది.

భారత్ తరఫున మన్‌దీప్ సింగ్(24వ నిమిషం), వివేక్ సాగర్(34వ నిమిషం), హర్మన్‌ ప్రీత్ సింగ్(59వ నిమిషం) గోల్స్ నమోదు చేయగా.. న్యూజిలాండ్‌లో సామ్ లేన్(8వ నిమిషం), సిమన్ చిల్డ్(53వ నిమిషం) గోల్స్ సాధించారు.

మ్యాచ్ ప్రారంభంలోనే న్యూజిలాండ్ ఖాతా తెరిచింది. ఆట 8వ నిమిషంలో కార్నర్ నుంచి సామన్ లేన్ అద్భుతంగా గోల్‌ కొట్టి తమ జట్టు ఖాతా తెరిచాడు. దాంతో తొలి క్వార్టర్‌ను న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంతో ముగించింది. రెండో క్వార్టర్‌లో 24వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను మన్‌దీప్ సింగ్ గోల్‌గా మలిచి స్కోర్లను 1-1తో సమం చేశాడు.

ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా గోల్స్ నమోదు కాలేదు. దాంతో ఫస్టాఫ్ 1-1తో ముగిసింది. మూడో క్వార్టర్ ప్రారంభమైన కాసేపటికే వివేక్ సాగర్ అద్భుతంగా గోల్ కోట్టి 2-1తో భారత్‌ను ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ చేసిన గోల్ ప్రయత్నాలను భారత గోల్ కీపర్ శ్రీజేష్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. దాంతో మూడో క్వార్టర్‌ను భారత్ 2-1 ఆధిక్యంతో ముగించింది. ఆట 46వ నిమిషంలో భారత్ చేసిన గోల్ ప్రయత్నాన్ని న్యూజిలాండ్ అడ్డుకుంది.

53వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను న్యూజిలాండ్ గోల్‌గా మలిచి స్కోర్లను 2-2తో సమం చేసింది. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారగా.. ఆఖరి నిమిషంలో హర్మన్‌ప్రీత్ కౌర్ గోల్ నమోదు చేసి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. పూల్‌-బీలో ఉన్న భారత్.. సోమవారం అర్జెంటీనాతో తలపడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com