రాజకీయ కింగ్ మేకర్-కాసు

- July 28, 2024 , by Maagulf
రాజకీయ కింగ్ మేకర్-కాసు

కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు. మదరాసు పచ్చయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నారు. స్వాతంత్ర సమర పోరాటం... పన్నెండటవ ఏట విజయవాడ కాంగ్రెసు సదస్సుకు విచ్చేసిన మహాత్మా గాంధీని కలిశారు. వారి బోధనలకు ప్రభావితుడై శాకాహారిగా ఉంటానని ప్రమాణం చేశారు. జీవితాంతం ఖద్దరు ధరించారు. టంగుటూరి ప్రకాశం పంతులు సాహచార్యం, బోధనలు అతనిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపాయి. లా ప్రాక్టీసును పక్కనబెట్టి బ్రిటిషు వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలారు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు.  

సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1942లో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా కాంగ్రెసు పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. రాజకీయ ప్రస్థానం జిల్లాబోర్డు సభ్యునిగా ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1946 నుండి 1952 వరకు, 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికయ్యారు.

1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెసు కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత 1956 లో పురపాలక శాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో చేరారు. పిమ్మట దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలో కొనసాగి వాణిజ్య శాఖ, ఆర్థిక శాఖలు నిర్వహించారు. ఆర్థిక శాఖను అతడు అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. 1964 వ సంవత్ఫరం ఫిబ్రవరి 29 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

రాష్ట్రప్రగతి కి సోపానాలు రాష్ట్ర ప్రగతికి బ్రహ్మానంద రెడ్డి ఆహార్నిశలు శ్రమించారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు పరిచారు. ఆధునిక దేవాలయంగా కొనియాడబడ్డ నాగార్జున సాగర్ నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చారు. ప్రత్యేకించి అప్పటి ఉమ్మడి గుంటూరు( నేటి ప్రకాశం జిల్లాలోని సగభాగం) జిల్లా వాసుల ఆహారపుఅలవాట్లు , జీవన విధానం గురించి అధ్యయనం చేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ముందు , తర్వాత అని విశ్లేషించవచ్చు. సాగు నీటి వసతి లేని ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతంతో పండే జొన్న,సజ్జ,కొర్ర వంటి చిరు ధాన్యాలు ప్రధాన ఆహార పంటలుగా ఉండే పల్నాడు ప్రాంతం ఆ నాటికి ఆర్ధికంగా కూడా వెనకబాటుకి పెట్టింది పేరు.

అలాంటి ప్రాంతానికి నాగార్జున సాగర్ నుండి పలు అడ్డంకుల్ని, వ్యయప్రయాసల్ని అధిగమించి రైతుల్ని ఒప్పించి భూసేకరణ చేసి కాలువల నిర్మాణం పూర్తి చేసి త్రాగు సాగు నీరిచ్చి సస్యశ్యామలం చేసిన ఘనత కాసుకే దక్కుతుంది.జొన్న , సజ్జ , పత్తి , అపరాలు వంటి వర్షాధార పంటలు తప్ప అన్యం ఎరుగని పలనాటి ప్రాంతన మాగాణి భూములు ఏర్పడి వరి ధాన్యాగారమైనా , మిర్చికి గుంటూరు జిల్లా ఖిల్లాగా పేరు వచ్చినా, పసుపు విరివిగా పండించినా సాగర్ కాలువల పుణ్యమే.

పలువురు మహనీయుల కృషి ఫలితంగా 1955 లో సాగు, త్రాగు నీరు , విద్యుత్ ఉత్పత్తి లాంటి లక్ష్యాలతో ప్రారంభించబడ్డ బహుళార్ధ సాధక నాగార్జున సాగర్ ప్రాజెక్టు పనులు 1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్వీకారం చేశాక ఊపందుకున్నాయి అని చెప్పొచ్చు .నిధుల లేమితో నత్తనడకన సాగుతున్న పనులను వేగవంతం చేసి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్న కాసు 1966 నాటికి ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేత ప్రారంభోత్సవం చేయించారు.

1967 నాటికి తుది దశ పూర్తి చేసుకున్న 1.6 కిలోమీటర్ల పొడవైన నాగార్జున సాగర్ ఆనకట్ట ఎత్తు 590 అడుగులు కాగా , నీటి నిల్వ ఉండే జలాశయ విస్తీర్ణం షుమారు 380 చదరపు కిలోమీటర్లు.ప్రాజెక్టు నుండి కాలువల కోసం భూసమీకరణలో కాసు కృషి ఎప్పటికీ మరువలేనిది. నాడు కాంగ్రెస్ వ్యతిరేకులు ప్రాజెక్ట్ కోసం భూములిచ్చి నీరు వస్తే వరి పండుతుంది. ఇప్పుడు మీకు పొగాకు మీద వరి కన్నా ఎక్కువ ఆదాయం వస్తుండగా ఇంకా వరి కోసం భూములివ్వడం దండగ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి భూములివ్వకుండా అడ్డుపుల్లలు వేయగా పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన బ్రహ్మానంద రెడ్డి ఆయా ప్రాంతాల రైతుల్ని ఒప్పించి కాలువల తవ్వకం జరిపించి ప్రాజెక్టు లక్ష్యాన్ని నెరవేర్చారు . ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ప్రకాశం, గుంటూరు జిల్లాల త్రాగు, సాగు నీటి అవసరాలు తీరగా కృష్ణా, నల్గొండ , ఖమ్మం జిల్లాలు సైతం లబ్ది పొందాయి.

అంతేకాదు తుంగభద్ర హైలెవల్ కెనాల్ కి అవసరమైన నిధులు మంజూరు చేయించటంలోనూ, కేంద్రం నుండి అన్ని క్లియరెన్స్ లు రావటంలోనూ ప్రధాన పాత్ర కాసుదే . పోచంపాడు ప్రాజెక్టు రూపకల్పనలోనూ వారిదే ప్రధాన పాత్ర. కేవలం నీటి ప్రాజెక్టులే కాదు , పారిశ్రామిక రంగంలో రాష్ట్రానికి వారు చేసిన అభివృద్ధి గతంలో ఎవరూ చేయలేదు , భవిష్యత్లో మరెవ్వరూ చేయలేరు అని చెప్పొచ్చు . ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత 74లో ఇందిరా ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రివర్గంలో చేరి 77 వరకూ హోమ్, పరిశ్రమలు మరియు కమ్యూనికేషన్ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు.

కాసు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ కి మహర్దశ పట్టింది అని చెప్పొచ్చు . ప్రభుత్వ రంగ సంస్థలైన BHEL, IDPL, BDL. Nuclear Fuel Complex, ECIL, HMT Bearings, DRDL, CCMB, Sardar patel national police academy వంటివి హైదరాబాద్ నగరంలోనే ఏర్పడ్డాయి. ఇవి కాక జీడి మెట్ల, బాలానగర్, పటాన్ చెరువు, ఎద్దు మైలారం, ఉప్పల్, సనత్ నగర్, కాటేదాన్ బోలారం, బాచుపల్లి పారిశ్రామిక వాడలు అన్నీ కాసు హయాం లో నిర్మితం అయినవే . 1966లో హైదరాబాద్ దక్షిణ మధ్య రైల్వే జోన్ కావడంలో కూడా వీరి కృషి ప్రధానమైనది.

1977 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసాక ఎన్నిక ద్వారా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికై పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ పునరుజ్జీవం కల్పించడానికి తీవ్రమైన కృషి చేసారు . తల పై ఖద్దరు టోపీ అటూ ఇటూ మారిస్తే ఎదో అద్భుతమైన రాజకీయ ఎత్తుగడ వేస్తున్నాడు అని పేరున్న కాసు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇందిరా గాంధీతో విభేదాలు తలెత్తగా ఇందిరా గాంధీని కాంగ్రెస్ నుండి బహిష్కరించి సంచలనం సృష్టించారు.

ఆ తర్వాత ఇందిరాగాంధీ కాంగ్రెస్(ఐ) ని స్థాపించగా 1978 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ (ఐ) విజయం సాధించగా కాంగ్రెస్ నుండి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ (ఐ) లో చేరగా , తదనంతరం పలు చర్చల మీదట 1980 లో జాతీయ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ (ఐ) లో విలీనం చేశారు. దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కాసు 1984 లోక్ సభ ఎన్నికల్లో నరసరావుపేట నుండి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి కాటూరి నారాయణ స్వామి చేతిలో ఓటమి చెందడంతో కాసు వారి రాజకీయ జీవితం ముగిసింది. 1994 మే 20 న కాసు బ్రహ్మానంద రెడ్డి మరణించారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com