సేవా శిఖరం-రాస్ మునిరత్నం

- August 01, 2024 , by Maagulf
సేవా శిఖరం-రాస్ మునిరత్నం

ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్రీయ సేవా సమితి (RASS) పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త  రాస్‌ మునిరత్నం నాయుడు. తిరుపతి కేంద్రంగా ప్రారంభించిన రాస్ సంస్థ ద్వారా ఎంతోమంది నిరు పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో సేవా రత్నం అని పిలిపించుకున్న మహనీయుడు రాస్‌ ట్రస్ట్ పూర్వ చైర్మన్ స్వర్గీయ పద్మశ్రీ డా. గుత్తా మునిరత్నం నాయుడు.

రాస్ మునిరత్నం నాయుడు అలియాస్ గుత్తా మునిరత్నం నాయుడు ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తణికి సమీపంలోని కనకమ్మసత్రం గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన గుత్తా రంగయ్య నాయుడు, మంగమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పదోతరగతి వరకు తిరుత్తణిలో చదువుకున్నారు. మేనమామ కన్నయ్య నాయుడుకు చెందిన బస్సులో కొంతకాలం పనిచేశారు.

మునిరత్నం పదిహేనేళ్ళ వయసు నుంచే బాలానంద సంఘం పేరిట పిల్లల క్లబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా సమాజ సేవకు శ్రీకారం చుట్టారు. ఇదే దిగ్గజ రైతు నాయకులైన ఆచార్య ఎన్.జి.రంగ, పాటూరి రాజగోపాల్ నాయుడు (రాజన్న)తో పరిచయం ఏర్పడింది.రంగా, రాజన్నల శిష్యరికంలో సామాజిక సేవా కార్యక్రమాల పట్ల మరింత అనురక్తిని పెంచుకున్నారు. రాజకీయంగా వారి బాటలో నడుస్తూనే వారు కీలకంగా వ్యవహరించిన భారత్‌ సేవక్‌ సమాజ్‌లో చేరిక ఆయన్ను సేవారంగం దిశగా స్థిరమైన అడుగులు వేసేలా చేసింది.1960-66 నడుమ యువజన సంక్షేమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. రంగా మార్గదర్శనంలో తిరుత్తణిలో రైతాంగానికి శిక్షణా తరగతులు నిర్వహించచారు.  

1970లో చెన్నైలో కళా ప్రింటర్స్‌ను స్థాపించారు. తెలుగు భాషాసమితి తరపున విజ్ఞాన వ్యాసాలు, తెలుగు సినీ పత్రికలను ప్రచురించేవారు. అదే ఏడాది తిరుపతికి నివాసం మార్చడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. చిత్తూరు జిల్లా రాజకీయ దురంధరుడైన మాజీ మంత్రి కిలారి గోపాల్ నాయుడు గారి తనయుడు కిలారి కృష్ణమూర్తితో కలిసి అభ్యుదయ రచయితల సంఘంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు.రేణిగుంట రోడ్డులో నేషనల్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ ప్రారంభించి మహిళా మాస పత్రికను ప్రారంభించారు. అనంతరం ఆ ప్రింటింగ్‌ ప్రెస్‌ను 1985లో ఉదయం ప్రతిక కోసం ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు విక్రయించారు.

కరువుకోరల్లో రాయలసీమ చిక్కుకొని ప్రజల పడుతున్న అవస్థలను చూసి చలించిన రాజన్న గారు, వారిని ఆదుకునేందుకు చాట్ సభల వెలుపల, లోపల ఎన్నో ఏళ్ళు కృషి చేసి ప్రభుత్వం నుంచి రాయలసీమకు ఆర్థిక ప్యాకేజీలు అందేలా చేశారు. వెనుకబడిన ప్రణతాల జాబితాలో రాయలసీమ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని సైతం పలు మార్లు కోరారు. ప్రభుత్వం ఎన్ని నిధులు వెచ్చించినా ప్రజలకు కావలసిన కనీస అవసరాలను తీరేందుకు సరైన వ్యవస్థ లేక అవి దుర్వినియోగం జరగడాన్ని గుర్తించిన రాజన్న, 1981లో తిరుపతి కేంద్రంగా ఆచార్య ఎన్.జి.రంగా ఆశీస్సులతో రాయలసీమ సేవా సమితి (RASS) సంస్థను ప్రారంభించారు.

ఈ సంస్థకు రాజగోపాల్ నాయుడు గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, నాటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సర్వోదయ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన మునిరత్నం, కిలారి కృష్ణమూర్తిలు వ్యవస్థాపక కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. రాజన్న అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నప్పటికీ రాస్ వ్యవహారాల్లో మునిరత్నం కీలకంగా వ్యవహరించేవారు. తన మిత్రుడైన కృష్ణమూర్తి ఆకస్మిక మరణం తర్వాత రాస్ బాధ్యతల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు.  
           
రాయలసీమలోని పలు ప్రాంతాల్లో బాల్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తర్వాత ఈ సంస్థ "రాష్ట్రీయ సేవా సమితి"గా పేరు మార్చుకుని రాస్‌గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 2500 గ్రామాలలో బాల్వాడీ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, మహిళా ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు, రెయిన్ షెడ్ కార్యక్రమాలను రాస్ సంస్థ పెద్దఎత్తున అమలు చేస్తోంది.

50 లక్షలకు పైగా పేద కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా సహాయపడిన మునిరత్నం సలహాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేవి. ప్రణాళిక సంఘంలోని ప్రజ్ఞావంతుల మండలిలో ఆయన సభ్యులుగా వ్యవహరించారు. రాష్ట్రీయ మహిళా కోష్‌, సాక్షర భారత్‌లకు వారు సలహాలందించేవారు. అఖిల భారత రచనాత్మక సంఘంలో నిర్మలా దేశ పాండేతో కలిసి పని చేశారు.

మునిరత్నం హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒరిస్సా, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలకు రాస్ సంస్థ సేవలను విస్తరించారు. బాలల సంక్షేమం కోసం బాల వికాస కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, అనియత విద్యా కేంద్రాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, మహిళాభివృద్ధి, పశుగణాభివృద్ధి కోసం వీరు చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం ఆ సంస్థ శిశువిహార్‌, బాల విహార్‌, ఛైల్డ్‌ స్పాన్సర్‌షిప్‌ ప్రోగ్రాం, అంగన్వాడీ కేంద్రాలు, వయో వృద్ధులకు పునరావాస కేంద్రం, వితంతు పునరావాస కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, స్వధార్‌ హోం, మత్తు మందు బానిసల పునరావాస కేంద్రం తదితర సేవల ద్వారా ప్రజలకు మరింత చేరువైంది.

రాస్‌ అంటే మునిరత్నం పేరు గుర్తొచ్చేలా ఆయన సంస్థతో మమేకం అయ్యారు. విశేష సామాజిక సేవలతో లెక్కలేనన్ని అవార్డులు, ప్రశంసలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్‌తో మొదలు పెట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రతిష్టాత్మక సంస్థల నుంచీ గుత్తా మునిరత్నం అసంఖ్యాకంగా అవార్డులు అందుకున్నారు.  

1987లో ఇందిరా గాంధీ నేషనల్‌ యూనిటీ అవార్డు, 1989లో కేంద్ర ప్రభుత్వం నుంచీ బాలల సంక్షేమానికి గానూ జాతీయ అవార్డు, 1994లో కేంద్ర ప్రభుత్వం నుంచీ వికలాంగుల సంక్షేమానికి గానూ జాతీయ అవార్డు, 1995లో జమ్నాలాల్‌ బజాజ్‌ అవార్డు అందుకున్నారు. 1995లోనే ఎస్వీయూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. 1996లో ఫిక్కీ అవార్డు, 2004లో ఇండియా రోటరీ అవార్డు, 2006లో కేంద్ర ప్రభుత్వం నుంచీ రాజీవ్‌ గాంధీ మానవ సేవా అవార్డు, 2012లో సీతారామ్‌ జిందాల్‌ ఫౌండేషన్‌ అవార్డు, 2016లో జెరియాట్రిక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అవార్డు, అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ యూఎ్‌సఏ నుంచీ జీవన సాఫల్య పురస్కారం వంటి పలు ముఖ్యమైన అవార్డులు ఆయనను వరించాయి. 2012లో ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.

మునిరత్నం వ్యక్తిగతంగానే కాకుండా రాస్‌ సంస్థకు సైతం పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. మునిరత్నం పలు దేశాల్లో పర్యటించి తమ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన రంగాలను అధ్యయనం చేసి విలువైన పరిశోధక పత్రాలను, పుస్తకాలను రాశారు. బాలప్రభ తెలుగు మాస పత్రికకు ఎడిటర్‌గా, మహిళ తెలుగు మాసపత్రికకు అసోసియేట్‌ ఎడిటర్‌గా, సమాజ్‌ వికాస్‌ తెలుగు మాసపత్రికకు ఎడిటర్‌గా ఆయా పత్రికలను సమర్ధవంతంగా నడిపారు.

ముంబై భారతీయ విద్యా భవన్‌, ఏపీ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ఢిల్లీలోని యూత్‌ హాస్టల్స్‌ ఆఫ్‌ ఇండియా, ఢిల్లీకే చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితర ప్రఖ్యాత సంస్థల్లో జీవితకాలపు సభ్యుడిగా కొనసాగారు. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థల్లో వివిధ హోదాల్లో గౌరవ సభ్యత్వాలు, పదవులూ నిర్వహించారు. కేంద్ర ప్రణాళికా సంఘంలో నిపుణుల విభాగం సభ్యుడిగా కీలక పాత్ర వహించారు. వివాహం చేసుకోని గుత్తా మునిరత్నం తన జీవితం మొత్తాన్నీ రాస్‌ సంస్థ నిర్వహణకు, సామాజిక సేవకే అంకితం చేశారు. రాస్‌ ప్రధాన కార్యాలయ భవనంలోనే ఆయన నివసించేవారు.

ఆరు దశాబ్దాలకు పైగా కులమతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యకమాలను నిర్వహించారు. సేవాతత్వానికి నిలువెత్తు నిదర్శనంగా, నిస్వార్థ సేవకుడిగా, ఎన్నో  బాలరిష్టాలు అధిగమించి కేంద్ర, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహనీయుడిగా మునిరత్నం చరిత్రలో నిలిచిపోయారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com