శ్రీవారి భక్తులకు శుభవార్త

- August 02, 2024 , by Maagulf
శ్రీవారి భక్తులకు శుభవార్త

తిరుమల: శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తిరుమలలోని హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందివ్వాలని ఈవో శ్యామల రావు పునరుద్ఘాటించారు.

ఇందుకోసం ఇప్పటికే ఆహార పదార్థాల తయారీదారులు మరియు హోటల్ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. తిరుమలలోని హోటల్ యజమానులందరూ ఫుడ్ సేఫ్టీ విభాగం సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలన్నారు.

డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియా సమావేశంలో జూలై నెలలో భక్తులకు సంబంధించిన దర్శనం మరియు ఇతర వివరాలను తెలిపారు.

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు సేవ చేసేందుకు ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో జేశ్యామలరావు చెప్పారు.

తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ టీటీడీ అందించే శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు, అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కల్పించేలా కృషి చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు:

ఈ ఏడాది అక్టోబరు 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబరు చివరినాటికి పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించామని, శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

శ్రీవారి పవిత్రోత్సవాలు:

ఆగస్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 14వ తేదీన అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని శ్యామలరావు తెలిపారు.

శ్రీవారి పుష్కరిణి మూత:

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్‌ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1వ తేదీ నుండి పుష్కరిణిని మూసివేశాని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో షవర్లు ఏర్పాటుచేశామని, భక్తులు వీటిని వినియోగించుకోవాలని కోరుతున్నామని టీటీడీ ఈవ్ జే. శ్యామలరావు వివరించారు. ఇటీవల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.

ఆఫ్‌లైన్‌లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లు

సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకుగాను జూలై 22వ తేదీ నుండి ఆఫ్‌ లైన్‌లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లను మాత్రమే జారీ చేయాలని నిర్ణయించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. .

శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో జారీ చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వివరించారు.

అన్నప్రసాదాల రుచి మరింత పెంచేందుకు చర్యలు

తిరుమలలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంచేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదాలు, ముడిసరుకులను ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నని శ్యామలరావు తెలిపారు.

క్యూ లైన్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు

- క్యూలైన్లల్లో, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగు నీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరివేక్షించేలా ప్రత్యేకంగా కొందరు ఆధికారులకు బాధ్యతలు అప్పగించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో ఆరు చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని శ్యామలరావు వివరించారు.

తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు

శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జితసేవ టికెట్లకు సంబంధించి మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని,

శ్రీవారి భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యం అని, టీటీడి నిబంధనలు పాటించని హోటళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని శ్యామలరావు హోటల్ యజమానులను హెచ్చరించారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెంపు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడిసరుకులు, నెయ్యి కోనుగొలు చేసేందుకు చర్యలు చేపట్టామని, టీటీడీ ఐటి వ్యవస్థ మరింత బలోపేతం చేస్తామని, టీటీడీ ఐటి వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టామని గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న ఎస్‌ఎస్‌డీ టోకెన్లను, భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.47 లక్షలు ఇస్తున్నామని, వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని, అదేవిధంగా ఎస్ఈడీ, ఎస్ఎస్ డీ టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి దర్శనానికి రావాలని టీటీడీ ఈవో శ్యామలరావు మనవి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com