భారత హరిత విప్లవ సారథి...!

- August 07, 2024 , by Maagulf
భారత హరిత విప్లవ సారథి...!

ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త. అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త. ప్రజలు పస్తులుండే దుస్థితి పోవాలని పరితపించిన వ్యక్తి. రైతులకు గిట్టుబాటు ధర మొదలు, వ్యవసాయంలో అధిక దిగుబడులు, మార్కెట్‌లో సంస్కరణలకు నిరంతరం కృషిచేసిన హరిత విప్లవ పితామహుడు. వ్యవసాయ స్వయంసమృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, దేశ వ్యవసాయ పద్ధతుల ముఖచిత్రాన్నే మార్చిన కర్షక పక్షపాతి. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి దశాదిశను చూపిన వ్యక్తి డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌. నేడు ఆయన జయంతి సందర్భంగా, వ్యవసాయ రంగంలో వారి ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం...

మంకొంబు సాంబశివ స్వామినాథన్ అలియాస్ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ 1925 ఆగస్టు7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు స్వామినాథన్. ప్రాథమిక విద్యను స్థానిక పాఠశాలలో పూర్తిచేశారు. తర్వాత కుంభకోణంలో మెట్రిక్యులేషన్ చదివారు. తండ్రి వైద్యుడు కావడం వల్ల మెడికల్ పాఠశాలలో చేరిన స్వామినాథన్‌, 1943 నాటి భయంకరమైన బంగాల్ కరవును చూసి చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలనే లక్ష్యంతో వైద్యరంగం నుంచి వ్యవసాయ రంగానికి మారిపోయారు. కేరళ త్రివేండ్రంలోని మహారాజా కళాశాలలో జువాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. తర్వాత మద్రాస్ వ్యవసాయ కళాశాలలో చేరి బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు.

1949లో దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో సైటోజెనెటిక్స్‌లో పీజీ చేశారు. పీజీ పూర్తయ్యాక యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అఖిల భారత సర్వీసులైన ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయితే అదే సమయంలో యునెస్కో ఫెలోషిప్‌తో హాలెండ్‌ (నెదర్లాండ్స్‌) దేశంలో అగ్రికల్చర్ కోర్సు చదివేందుకు ఆయనకు అవకాశం వచ్చింది. దీనితో ఐపీఎస్ వైపు వెళ్లకుండా నెదర్లాండ్స్‌లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్శిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళాదుంపల జన్యువులపై పరిశోధన చేశారు. సోలానమ్ విస్తృతమైన అడవి జాతుల నుంచి బంగాళాదుంపకు జన్యువులను బదిలీ చేసే విధానాలను ప్రామాణీకరించడంలో స్వామినాథన్ విజయం సాధించారు.

ఆ తర్వాత 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి పీహెచ్డీ చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. అయితే విస్కాన్సిన్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ అధిక జీతంతో భారీ ఆఫర్‌ ఇచ్చినా దాన్ని తిరస్కరించి.. 1954లో భారతదేశానికి తిరిగి వచ్చి కటక్‌లోని కేంద్ర వరి పరిశోధన సంస్థలో చేరారు. ఆ తర్వాత భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా పరిశోధనలు మొదలుపెట్టారు.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేసరికి ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. ఆ సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే దేశ అవసరాలకు సరిపోయేవి. 1960 దశకంలో దేశంలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. భారత్‌లో ఇక తగిన ఆహారోత్పత్తి జరగదని, ప్రజలు ఆకలితో అలమటించి చనిపోవడం ఖాయమని అప్పట్లో ప్రపంచ దేశాలన్నీ భావించాయి. ఆ సందర్భంలోనే స్వామినాథన్‌ జపాన్‌లో కొత్తగా కనుగొన్న గోధుమ వంగడాన్ని దేశంలో ప్రవేశపెట్టి, అధిక ఉత్పత్తిని, 200 శాతం లాభాలను సాధించేందుకు దోహదపడ్డారు. ఈ విప్లవాన్నే ‘గోధుమల విప్లవం’ అంటూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వామినాథన్‌ సేవలను వేనోళ్ల కొనియాడారు.

చైనా వరివంగడాలను కూడా దేశంలో ప్రవేశపెట్టి వరిధాన్యాల ఉత్పత్తిని అధికం చేశారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధించేందుకు ఎంతో కృషి చేశారు. వ్యవసాయ రంగంలో అపారమైన అభివృద్ధిని తీసుకొచ్చి భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన చేర్చారు. ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితిని తప్పించి వ్యవసాయోత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దిన ఘనత స్వామినాథన్‌కే దక్కుతుంది. బంగాళాదుంపల ఉత్పత్తిని పెంచడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు.

1967 నుంచి 1978 మధ్య దేశ వ్యవసాయ పరిస్థితిలో భారీ మార్పు ప్రారంభం అయింది. వరి, గోధుమ సహా ఇతర పంటలపై స్వామినాథన్‌ జరిపిన విశేష కృషితో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది.ఆ తర్వాత అధిక దిగుబడులను ఇచ్చే గోధుమ వంగడాల కోసం పరిశోధనలు ప్రారంభించారు. మెక్సికోలో తయారు చేసిన గోధుమ వంగడాలను భారత్‌లో తయారుచేయటం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నం ఫలించి హెక్టారుకు 2 టన్నుల దిగుబడి వచ్చే గోధుమలు నాలుగున్నర టన్నుల దిగుబడికి పెరిగింది. దీంతో హరిత విప్లవ పితామహుడిగా స్వామినాథన్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

1980లలో ‘ఎంఎస్‌ స్వామినాధన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ను స్థాపించారు. చిరుధాన్యాలపై పరిశోధనలకు అప్పట్లోనే స్వామినాథన్‌ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన ముందుచూపునకు నిదర్శనంగా 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం ఆరాటపడి మద్దతు ధరలతో అండగా ఉండాలని పాలకుల మీద ఒత్తిడి తెచ్చారు. రైతు నాయకులకు కార్యకర్తలకు సంఘీభావంతో కదిలిన ఘటనలు వారి జీవితంలో చూడవచ్చు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తగా, హరిత విప్లవ పితామహుడుగా డా.ఎం.ఎస్‌. స్వామినాథన్‌ వ్యవసాయ రంగానికి చేసిన కృషి అందరికీ తెలిసిందే.

స్వామినాథన్ ఎన్నో పదవులను సమర్ధంగా నిర్వహించారు. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ జనరల్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1979 నుంచి 1980 వరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరక్టర్ జనరల్‌గా పని చేశారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు. 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా "టైం 20" లో స్వామినాథన్ పేరును టైమ్‌ మ్యాగజైన్ ప్రచురించింది.

వ్యవసాయ రంగంలో స్వామినాథన్‌ చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యుత్తమ పురస్కారాలను అందించింది. 1989లో పద్మవిభూషణ్‌ అవార్డును ఆయన అందుకున్నారు. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్‌ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది. 1971లో రామన్‌ మెగసెసే అవార్డును అందుకున్నారు. 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అవార్డు స్వామినాథన్‌ను వరించింది. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యత పురస్కారాన్ని స్వామినాథన్ అందుకున్నారు. ఆయన మరణించిన తరువాత 2024లో దేశ అత్యున్నత పురస్కారం "భారతరత్న"తో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది.

రైతుల కష్టాలకు కారణాలు, రైతుల ఆత్మహత్యల నివారణ, వ్యవసాయ ఉత్పాదకత, భూ సంస్కరణలు, నీటిపారుదల, రుణ సదుపాయం, పంటల భీమా, ఆహార భద్రత, ఉపాధి, తదితర అంశాలపై డాక్టర్‌ స్వామినాథన్‌ నేతృత్వంలోని ”నేషనల్‌ కమీషన్‌ ఆన్‌ ఫార్మర్స్‌” లోతైన అధ్యయనం చేసి, అత్యంత కీలకమైన సిఫార్సులతో నాటి యు.పి.ఏ. ప్రభుత్వానికి  2006 అక్టోబర్‌ 4న నివేదికను సమర్పించింది. 17 సంవత్సరాలు గడచిపోతున్నా ఆ నివేదికలోని రైతాంగం యొక్క ప్రయోజనాలతో ముడిపడిన సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. వ్యవసాయ ఉత్పత్తులకు సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% ఎక్కువగా కనీస మద్దతు ధర (MSP)ను నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం తక్షణం అమలు చేస్తే, డా. ఎం.ఎస్‌. స్వామినాథన్‌ గారికి ఘనమైన నివాళి అర్పించినట్లు కాగలదు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com