ఏపీ: అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ..

- August 08, 2024 , by Maagulf
ఏపీ: అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ..

అమరావతి: అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది.తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి నాన్ డ్యూటీ లిక్కర్ అక్రమంగా ఏపీలోకి రావడంతో ఖజానాకు రూ.18వేల కోట్లు నష్టం వచ్చినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ‘నాణ్యత లేని మద్యం అమ్మకాలతో గత ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడింది. వారి వ్యసనాన్ని ఆసరాగా తీసుకుంది. ప్రజలకు అందుబాటు ధరల్లో మద్యం అమ్మకాలు చేపడతాం’ అని చెప్పారు. ఇక ఇప్పటికే నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం.. కొత్త ఎక్స్రైజ్ పాలసీని అమలు చేసేందుకు దృష్టి సారించింది. ఇక ఇప్పటికే ఈ కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. ఈ నూతన మద్యం విధానాన్ని తయారు చేసేందుకు.. ఏపీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో అమలు అవుతున్న మద్యం పాలసీలను అధ్యయనం చేసేందుకు 4 బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉండగా.. వారు తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి మద్యం పాలసీని అధ్యయనం చేస్తున్నాయి. వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలించి.. ఈ నెల 12లోగా ఈ బృందాలు తమ నివేదికలను ఏపీ ప్రభుత్వానికి అందించనున్నాయి. వీటిని పరిశీలించి కొత్త మద్యం పాలసీపై సర్కార్ ఓ నిర్ణయానికి రానుంది. ఆ తర్వాత అక్టోబర్ 1 వ తేదీ తేదీ నుంచి.. ఆ కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com