గుప్పెడంత ప్రేమ రివ్యూ
- June 16, 2016
చిత్రం: గుప్పెడంత ప్రేమ తారాగణం: సాయిరోనక్.. అతిథి సింగ్.. ఐశ్వర్య.. ఆనంద్.. నవీన్ నేలి.. అభిలాష్ తదితరులు సంగీతం: నవనీత్ సుందర్, ఛాయాగ్రహణం: సంజయ్ లోక్‌నాథ్, పాటలు: వనమాలి.. శ్రీమణి, నిర్మాణం: ఐ వింక్ ప్రొడక్షన్స్, రచన - దర్శకత్వం: వినోద్ లింగా
సంస్థ: ఐ వింక్ ప్రొడక్షన్స్, విడుదల: 17-06-2016
ప్రేమకథని ఎవరెన్నిసార్లు చెప్పినా ఏదో ఓ కొత్త కోణం ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతూనే ఉంది.
ఒకవేళ పాత కథనే చెప్పినా.. దాన్ని కొత్తగా తీర్చిదిద్ది మెప్పిస్తూనే ఉన్నారు. స్వచ్ఛమైన ప్రేమ భావనలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుందని ఎన్నోచిత్రాలు రుజువు చేశాయి. చలన చిత్ర చరిత్రలో గొప్ప ప్రేమకథలన్నీ ఎప్పుడూ సాదాసీదాగానే ఉంటాయి. కానీ వాటిని తీర్చిదిద్దిన విధానం మాత్రం అబ్బురపరుస్తుంది. అలాంటి కథల్ని.. చిత్రాల్ని.. ఆ విజయాల్ని స్ఫూర్తిగా తీసుకొని తీసిన సినిమా 'గుప్పెడంత ప్రేమ'. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేమకథల్లో ఈ సినిమా స్థానమెక్కడ? తెలుసుకోవాలంటే ముందు 'గుప్పెడంత ప్రేమ' కథ గురించి చెప్పుకోవాల్సిందే.
కథేంటి?: యువన్(సాయి రోనక్) యూనివర్సిటీలో అడుగుపెడతాడు. అక్కడే తన జీవితం ఉందనుకొంటాడు. అతని తల్లిదండ్రులు ప్రేమించుకొని ఒక్కటైన చోటు అది. తన జీవిత భాగస్వామీ అక్కడే దొరుకుతుందన్న ఆశతో.. 'తొలిప్రేమ' అనుభూతుల్ని దక్కించుకోవాలన్న కోరికతో ప్రయాణం ప్రారంభిస్తాడు. అయితే కాలేజీ రోజులు చప్పగా మొదలవుతాయి. రూల్సు.. రెగ్యులేషన్స్ అంటూ.. అక్కడ స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే వాటిని బ్రేక్ చేస్తూ ఓ అమ్మాయి కనిపిస్తుంది. ఆమె పేరు శాండీ (అతిథి సింగ్). ఆ యూనివర్సిటీ డీఎన్ (ఆనంద్) కూతురు. తను షిల్లాంగ్‌లో చదువుకొంటుంటుంది. సెలవుల్లో ఇక్కడకొచ్చిందన్నమాట.
ఆమెను చూడగానే ప్రేమించేస్తాడు. శాండీకి తన చుట్టూ ఉన్నదే ప్రపంచం. 'ఈ రోజు ఇక్కడున్నా.. రేపు ఎక్కడో ఉంటా.. అప్పుడు నిన్ను మర్చిపోవొచ్చు కదా' అంటుంది. అన్నట్టుగానే కొంతకాలం యువ్‌తో స్నేహం చేసి వెళ్లిపోతుంది. శాండీ వెళ్లిపోవడంతో యువన్ మనస్తాపానికి గురవుతాడు. కానీ శాండీ తిరిగొస్తుంది. 'నీ ప్రేమతో నన్ను పడేశావ్' అని యువన్ ప్రేమని అంగీకరిస్తుంది. 'కానీ షిల్లాంగ్ వెళ్లినప్పుడు ఫోన్లతో నన్ను ఇబ్బంది పెట్టకూడదు.. అసలు నేనెక్కడుంటానో చెప్పను. తిరిగొచ్చాక మాత్రం కలుసుకొందాం' అని షరతు పెడుతుంది. దానికీ ఒప్పుకొంటాడు యువన్. రెండు మూడు సార్లు తన కోసం తిరిగొచ్చిన శాండీ ఈసారి ఎంతకీ రాదు. ఆమె ఎదురుచూపుల్లోనే ఏళ్లు గడిచిపోతాయి. మరి శాండీ ఏమైంది? వచ్చిందా? రాలేదా? స్వర (ఐశ్వర్య) ఎవరు? ఆమెకీ యువన్‌కీ ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..: గత చిత్రాల ప్రభావం ఈ దర్శకుడిపై చాలా ఉందనిపిస్తుంది. అందుకే ఈ సినిమాని ఓ క్లాసిక్‌లా.. పొయెట్రీలా తీర్చిదిద్దాలన్న ప్రయత్నం కనిపించింది. సినిమా చాలా స్లోగా మొదలవుతుంది. శాండీ రాకతో కథలో కాస్త వేగం వస్తుంది. శాండిపై యువన్ చూపించే ప్రేమ.. వాళ్ల మధ్య సన్ని శాలు వీటితోనే సగం సినిమా గడిచిపోతుంది. వినోదానికి చోటు లేని ఈ సినిమా మెల్లమెల్లగా సాగుతుంది. ఇంట్రవల్ బ్యాంగ్‌లో కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆ వెంటనే లవ్‌స్టోరీ కాస్త ట్రయాంగిల్ టర్న్ తీసుకొంటుంది.
శాండీ ఒక్కసారిగా మారిపోయి.. యువ్ ప్రేమకు పరీక్ష పెడుతుంటుంది. ఎందుకన్నది సినిమాలపై పరిజ్ఞానం ఉన్న ఎవ్వరికైనా అర్థమైపోతుంది. క్లైమాక్స్‌లో త్యాగాల ఎపిసోడ్ నడుస్తుంది. అదీ బోర్ కొట్టించే వ్యవహారమే. ఇలాంటి కథలు చదువుకోవడానికి బాగుంటాయి. పేపర్‌పై.. మన వూహల్లో అందంగా కనిపిస్తాయి. కానీ తెరపై ఎక్కించేటప్పటికి ఫీల్‌ని తర్జుమా చేయలేం.
'గుప్పెడంత ప్రేమ' కథగా చెప్పుకొన్నప్పుడు వచ్చిన ఫీల్.. తెరపై చూసినప్పుడు ఆ దర్శకుడికి కూడా కలిగి ఉండదేమో? తాను చెప్పేది లవ్ స్టోరీనా, కాలేజీ స్టోరీనా అన్న మీమాంశ దర్శకుడిలో ఉండి ఉండొచ్చు. అందుకే.. కాలేజీలు, చదువులు, ధ్యేయాలూ.. అంటూ విశ్రాంతికి ముందు హీరో చేత పెద్ద ఎత్తున స్పీచ్ ఇప్పించారు. తీరా చూస్తే ఆ ఆంశం ఆ స్పీచ్ వరకే పరిమితం చేశారు.
ఎవరెలా చేశారంటే..: ఇలాంటి ప్రేమకథల్లో ప్రేమ జంట అందంగా ఉండాలి. హీరో సాయి బాగానే ఉన్నాడు. తన నటన పరంగా వంక పెట్టలేం. ఎనర్జీ బాగుంది. డాన్సుల్లోనూ బాగానే మెప్పించాడు. అయితే కథానాయికగా నటించిన అతిథి సింగ్ మాత్రం నిరాశ పరుస్తుంది. ఆ పాత్రతో ఐడెంటిఫై కాలేం. ఐశ్వర్య హుషారుగా కనిపించింది. ఆనంద్ కేవలం ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితం. ప్రతి సన్నివేశాన్నీ ఓ పెయింటింగ్‌లో చూపించారు. లొకేషన్లు కొత్తగా అనిపిస్తాయి. పాటలు వినడానికి బాగున్నా... అన్నీ ఒకేలా ఉన్నాయి. వరుస పాటలు బోర్ కొట్టించాయి. నేపథ్య సంగీతంలో హోరు ఎక్కువగా వినిపించింది.
బలాలు + సాయిరోనక్ + కెమెరా
బలహీనతలు - నీరసమైన కథనం - వినోదం లేకపోవటం చివరగా.. గుప్పెడంత ప్రేమ.. గుండెల్లో దాచుకొనేంత గొప్పగా లేదు గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







