గేమ్ ఛేంజింగ్ డైరెక్టర్...!
- August 17, 2024
సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. భారతీయ సినిమా మొదలైన నాటి నుంచి నేటి వరకు అప్పుడప్పుడు కొందరు దర్శకులు ట్రెండ్‌ని మారుస్తూ సినిమాను కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తూ వస్తున్నారు. అలాంటి దర్శకుల్లో ఎస్.శంకర్ ఒకరు. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తను చేసిన ప్రతి సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందినదే. మేకింగ్‌పరంగా, టేకింగ్ పరంగా అప్పటివరకు ఏ దర్శకుడూ చూపించని కొత్తదనాన్ని చూపించారు.అంతేకాదు ఇప్పటి వరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించిన ఈ దర్శకుడు.. తొలిసారి డైరెక్ట్‌గా రామ్ చరణ్‌తో నిర్మిస్తోన్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నేడు స్టార్ డైరెక్టర్ శంకర్ పుట్టినరోజు.
సౌత్ ఇండియన్ సినిమాకు ఒక కొత్త రూట్ క్రియేట్ చేసిన దర్శకుడు శంకర్ 1963 ఆగస్ట్ 17న తమిళనాడులోని కుంభకోణంలో ముత్తులక్ష్మీ, షణ్ముగం దంపతులకు జన్మించారు శంకర్. సెంట్రల్ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొందారు. ఆ తర్వాత ఒక టైప్ రైటింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. సినిమా రంగంపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసారు. నాటకాల్లో నటించిన అనుభవం ఉన్న శంకర్ నటుడు కావాలని ఆశపడ్డారు. కొన్ని సినిమాల్లో నటించారు కూడా. కానీ, ఆ తర్వాత దర్శకత్వ శాఖవైపు అడుగులు వెయ్యాల్సి వచ్చింది. ఎస్.ఎ.చంద్రశేఖర్, పవిత్రన్‌ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి కొంత అనుభవాన్ని సంపాదించుకున్నారు.
1993లో అర్జున్ హీరోగా రూపొందించిన ‘జెంటిల్‌మెన్’తో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు శంకర్. ఆరోజుల్లో అది హై బడ్జెట్‌తో నిర్మించిన సినిమా. తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ప్రభుదేవాను హీరోగా పరిచయం చేస్తూ ‘ప్రేమికుడు’ చిత్రాన్ని రూపొందించి రెండో సూపర్‌హిట్‌ను అందుకున్నారు. ఇక కమల్‌హాసన్‌తో చేసిన ‘భారతీయుడు’ చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. లంచగొండితనం ప్రధానాంశంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతోనే శంకర్ విజువల్ ఎఫెక్ట్స్‌పై దృష్టి పెట్టారు. ఆ తర్వాత ప్రశాంత్ ద్విపాత్రాభినయంలో, ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా తెరకెక్కించిన ‘జీన్స్’ మరో సంచలనం. డూయల్ రోల్‌ను అంత సహజంగా చూపించిన మొదటి సినిమా అదే కావడం విశేషం.
1998లో అర్జున్ హీరోగా ఒకరోజు ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్‌తో అన్ని కమర్షియల్ హంగులతో రూపొందించిన ‘ఒకేఒక్కడు’ శంకర్ కెరీర్‌లో మరో భారీ బడ్జెట్ సినిమాగా నిలిచింది. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాను అనిల్‌కపూర్‌తో హిందీలో ‘నాయక్’ పేరుతో రీమేక్ చేశారు. అయితే బాలీవుడ్‌లో ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో మరో కొత్త తరహా సినిమా చెయ్యాలన్న ఆలోచనతో ఎప్పటి నుంచో తన మనసులో ఉన్న ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. కమల్‌హాసన్‌తోఈ సినిమా చెయ్యాలని భావించారు శంకర్. అయితే అప్పటికే కమల్ తన ఇతర సినిమాలతో బిజీ ఉన్నారు. అంతేకాదు, రోబో సినిమాని చాలా హై బడ్జెట్‌తో నిర్మించాల్సిన అవసరం ఉండడంతో అది మెటీరియలైజ్ కాలేదు. ఆ సమయంలో మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌లో ‘బాయ్స్’ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ్‌లో ఈ సినిమాకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తెలుగు వెర్షన్ మాత్రం ఘనవిజయం సాధించింది.
2005లో విక్రమ్ హీరోగా శంకర్ రూపొందించిన ‘అపరిచితుడు’ మరో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఒకే వ్యక్తి.. సందర్భాన్ని బట్టి ముగ్గురు విభిన్నమైన వ్యక్తులుగా ప్రవర్తించడం ఇతివృత్తంగా రూపొందించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. తన మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాకీ ఎ.ఆర్.రెహమాన్‌తోనే మ్యూజిక్ చేయించిన శంకర్ మొదటి సారి హేరిస్ జయరాజ్‌తో పనిచేశారు. ఈ సినిమా తర్వాత సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో సొసైటీలో ఉన్న అవినీతి నేపథ్యంలో ‘శివాజీ’ చిత్రం చేశారు. ఈ సినిమా అప్పట్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.
ఈ సినిమా తర్వాత తను ఎప్పటి నుంచో కలలు కంటున్న ‘రోబో’ చిత్రానికి శ్రీకారం చుట్టారు శంకర్. మొదట కమల్‌హాసన్‌తో అనుకున్న ఈ సినిమాను రజినీకాంత్‌తో చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అప్పటికి ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్ సినిమాగా ‘రోబో’ రికార్డు క్రియేట్ చేసింది. దేశంలోని వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ పరంగా సంచలనం సృష్టించింది. రీమేక్స్ జోలికి వెళ్ళని శంకర్ మొదటిసారి బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘త్రీ ఇడియట్స్’ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇది అందర్నీ నిరాశపరచింది. ఈ సినిమా తర్వాత మరో కొత్త కాన్సెప్ట్‌తో ‘ఐ’ పేరుతో విక్రమ్ హీరోగా సినిమాను స్టార్ట్ చేశారు శంకర్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ‘రోబో’ చిత్రానికి సీక్వెల్‌గా ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు2’ చిత్రాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో కమల్‌హాసన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం, షూటింగ్‌లో పెద్ద ప్రమాదం జరగడం, కరోనా మహమ్మారి వంటి కారణాల వల్ల షూటింగ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ గ్యాప్‌లో రామ్‌చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కమల్‌హాసన్ కూడా అందుబాటులోకి రావడంతో ‘భారతీయుడు2’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలను ఒకేసారి చేస్తానని ఎనౌన్స్ చేశారు శంకర్. ఇటీవల విడుదలైన ‘భారతీయుడు2’ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా చివరలో చూపించిన ‘భారతీయుడు3’ ట్రైలర్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంది.ప్రస్తుతం శంకర్ తన దృష్టిని ‘గేమ్ ఛేంజర్‌పై పెట్టారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. దీని తర్వాత ‘భారతీయుడు3’ సెట్స్‌పైకి వెళుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
శంకర్ దర్శకుడిగానే కాదు, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను నిర్మించడం ద్వారా అభిరుచి కలిగిన నిర్మాత అనిపించుకున్నారు. 30 ఏళ్ళ తన కెరీర్‌లో కేవలం 15 సినిమాలు మాత్రమే చేసిన శంకర్ తన ప్రతి సినిమాలోనూ ఎంతో వైవిధ్యాన్ని చూపించారు. ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో మరో సంచలనానికి తెరతీయాలని చూస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష
- డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
- ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం
- అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత..
- మిస్సోరీలో దిగ్విజయంగా NATS వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
- ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- రియాద్‌లో జాయ్ ఫోరం 2025..SR4 బిలియన్ ఒప్పందాలు..!!