ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం

- October 19, 2025 , by Maagulf
ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరు రోజుల పర్యటన కోసం ఆస్ట్రేలియా చేరుకున్నారు. సిడ్నీ విమానాశ్రయంలో తెలుగు ప్రజలు, టీడీపీ అనుచరులు ఆయనకు ఘన స్వాగతం అందించారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఎన్నారైలు జెండాలు ఊపుతూ, నినాదాలతో ఆత్మీయంగా లోకేశ్‌ను ఆహ్వానించారు.

ఆస్ట్రేలియా టీడీపీ అధ్యక్షుడు విజయ్‌, ఉపాధ్యక్షుడు సతీష్‌ ఆధ్వర్యంలో బ్రిస్బేన్‌, కాన్బెర్రా‌, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌, న్యూజిలాండ్‌, న్యూకాసిల్‌ ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు సిడ్నీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో అభిమానులు లోకేశ్‌తో ఫోటోలు దిగారు. నగరమంతా స్వాగత ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చిన నారా లోకేశ్‌ను స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా ఆయన పలు విశ్వవిద్యాలయాలను సందర్శించి, అధునాతన బోధనా విధానాలు, సాంకేతికతలపై అవగాహన పొందనున్నారు.

అదే విధంగా నవంబర్‌ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం పెట్టుబడులు ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో సిడ్నీ, మెల్‌బోర్న్‌ నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌ వద్ద తెలుగు డయాస్పోరాతో నారా లోకేశ్‌ భేటీ అవనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com