ఏపీలో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియం

- August 18, 2024 , by Maagulf
ఏపీలో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని క్రికెట్ ప్రేమికులకు శుభవార్త .. మరికొద్ది రోజుల్లోనే మరో అంతర్జాతీయ స్టేడియం ఏపీలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఓ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచులు జరుగుతున్నాయి. ఇక త్వరలోనే విజయవాడలోనూ మనం టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్‌లు చూడొచ్చు. అన్నీ కుదిరితే మరో ఆరు నెలల్లో మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ, ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని) వెల్లడించారు. మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని మరో ఆరు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే విజయవాడలో క్రికెట్ ఆకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటుగా అమరావతిలో 2027 జాతీయ క్రీడల నిర్వహణ కోసం ప్రయత్నిస్తామని ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు.

మరోవైపు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై సెప్టెంబర్ 8వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రెసిడెంట్ పదవితో పాటుగా మొత్తం కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌లోని ఆరు పదవులకు శుక్రవారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నామినేషన్లు స్వీకరించారు. అయితే ఆరు స్థానాలకు ఆరు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే రావటంతో అందరూ ఏకగ్రీవమయ్యారు. సెప్టెంబర్ 9న ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంతకుముందు రోజు అధ్యక్షుడి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయి టీడీపీ కూటమి సర్కారు ఏర్పాటు కావటంతో.. కౌన్సిల్‌లోని సభ్యులు రాజీనామాలు చేశారు. సెప్టెంబర్ 8న నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తారు.

ఇక.. 2000లో ఏసీఏ విజయవాడలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియం నిర్మించాలని ప్లాన్ చేసింది. అయితే స్థలం కుదరకపోవటంతో మంగళగిరిలో నిర్మించాలని ప్లాన్ మార్చారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేయగా.. 2009లో నిర్మాణ పనులు ప్రారంభించారు. మొత్తం 24 ఎకరాల్లో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. మైదానం నిర్మాణం పూర్తైనప్పటికి నిధుల కొరత కారణంగా చాలా రోజులుగా మంగళగిరి క్రికెట్ స్డేడియం పనులు సాగుతూనే ఉన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com