ప్రేమ మూర్తి...!
- August 26, 2024
ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి అమ్మగా మారింది. భారతీయులతో ‘అమ్మ’అని పిలిపించుకున్న అంతటి మహొన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేడు ఆ సేవా మూర్తి జన్మదినం.
1910 ఆగష్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్ థెరిసా అసలు పేరు ఆగ్నెస్ గోన్సా బొజాక్ష్యూ. మదర్ తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు. అనాథల కోసం లెట్నికాలో ఆయన స్థాపించిన ఓ ఆశ్రమం ఇప్పటికీ ఎంతో మందికి అన్నం పెడుతోంది. తండ్రి సేవాతత్వాన్ని పుణికిపుచ్చుకున్న మదర్ థెరిసా... అనారోగ్యంతో ఆయన 1919లో కన్నుమూయగా, మరణానికి ఆయన పడిన బాధ చూసి తీవ్ర ఆవేదనకు గురైంది. 12 ఏళ్ల వయస్సులోనే సేవకు అంకితమైన మదర్.. తన 18వ ఏట సిస్టర్స్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరింది.
ఆ సంస్థకు చెందిన కోల్‌కతాలోని స్కూల్‌కు 1937, మే 4న టీచర్‌గా వచ్చారు. కోల్‌కతాలోని మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామ చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారు.అనాథల కోసం మొతిజిల్ అనే పాఠశాలను ఏర్పాటు చేసి, వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్‌కతా వీధుల్లో జోలెపట్టి కడుపు నింపారు. ఆమె సేవానిరతిని గుర్తించిన కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సాయంగా నిలిచారు. ఆర్థికంగా ఆ స్కూలుకు సాయం లభించడంతో 1950లో వాటికన్ అనుమతితో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ ఏర్పాటు చేశారు.
భారతదేశ పౌరసత్వం పొంది 45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలురాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు. ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.
మదర్ థెరీసా ఆధ్వర్యంలో మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది.
జాయన్ గ్రాఫ్ క్లూకాస్ రాసిన జీవితచరిత్ర ప్రకారం12 ఏళ్ల తర్వాత ఆమె తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటురోగాలు సోకినవారికి, బాధితులు, శరణార్థులు, అంధులు, దివ్యాంగులు, వృద్ధులకు, మద్యపాన వ్యసనానికి బానిస అయినవారికి సైతం థెరీసా సేవలందించారు. 1982లో ఇజ్రాయిల్ - పాలస్తీనా గెరిల్లాల పోరు మధ్య చిక్కుక్కున్న 37 మంది పిల్లలను థెరీసా కాపాడారు. రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించారు.
ఎక్కడో విదేశాల్లో పుట్టి, సేవా మార్గంలో పయనించి, భారతదేశంలోని కోల్‌కతాలో స్థిరపడి, అనారోగ్యంతో బాధపడ్తున్నవారిని చేరదీసి, సేవలు చేసిన ‘తల్లి’ థెరీసా రాయడానికి వీల్లేనంత దయనీయ స్థితిలో రోగంతో బాధపడ్తున్నవారిని అక్కునచేర్చుకున్న ‘దేవత’. పట్టుకుంటే ఆ రోగం తమకెక్కడ అంటుకుంటుందోనని కుటుంబ సభ్యులు రోడ్డున పడేసిన అభాగ్యులు, మదర్ థెరీసా పుణ్యమా అని కోలుకున్నారు. ఇక బతికే అవకాశం లేదని తెలిసీ, చివరి రోజుల్లో మథర్ థెరీసా సపర్యలతో బాధల్ని మర్చిపోయారు కొందరు అభాగ్యులు.
అయితే, లక్షలాది మంది ప్రజలు,ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలు ఆమెను కీర్తించినప్పటికీ విమర్శలను కూడా ఎదుర్కొని.. వాటికి తన సేవతో సమాధానం చెప్పారు. క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వక్తలు, విశ్వ హిందూ పరిషత్ వంటివి మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం చేస్తున్నారని ఆరోపించాయి.
1997న మార్చి 13న మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అదే ఏడాది తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 5న మరణించారు. అయితే, ఆమెను ఇప్పటికీ బోర్డు అధినేతగా ఎన్నుకుంటూ ఆమె తమతోనే ఉందని చారిటీ సభ్యులు చాటిచెబుతున్నారు. ‘ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న’అన్న నినాదం తోనే విశ్వమాతగా పేరు గాంచిన మదర్ థెరీసాకు సెయింట్‌హుడ్ హోదా కూడా దక్కింది.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







