న్యాయ కోవిదుడు - ఎన్వీ రమణ
- August 27, 2024
‘కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు..మహా పురుషులు అవుతారు..తరతరాలకు తరగని వెలుగు అవుతారని ఇలవేలుపులవుతారు‘ అని అడవిరాముడిలో పాట. ఈ పాటను నిజ జీవితంలో ఆచరించి చూపించారు తెలుగు వారికి గర్వకారణమైన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి భారత అత్యున్నత ధర్మాసనం న్యాయమూర్తిగా ఎదిగిన రమణ గారి జీవితం..ఎంతో స్ఫూర్తిదాయం. నేడు ఆయన పుట్టినరోజు.
ఎన్వీ రమణ పూర్తి పేరు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ. 1957, ఆగష్టు 27న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో రమణ జన్మించారు. తమ గ్రామానికి దగ్గర్లోని కంచికర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసి, అమరావతిలోని ఆర్.వి.వి.ఎన్. (రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు) కాలేజీలో బి.యస్సీ పూర్తి చేశారు. 1982 లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10 న ఉమ్మడి ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదు చేసుకొని న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా రమణ గారు పలు కేసులు వాదించారు. తర్వాతి కాలంలో అదే కోర్టుకు చీఫ్ జస్టిస్ అయ్యారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.సివిల్, క్రిమినల్ చట్టాలతో పాటు రాజ్యాంగపరమైన అంశాల్లో దిట్టగా పేరు తెచ్చుకున్నారు.
రమణ 2000, జూన్ 27న హైకోర్టు పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు. దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయసదస్సుల్లో జస్టిస్ రమణ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2013, సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 ఫిబ్రవరి 7 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన రెండవ తెలుగు వ్యక్తి. అప్పటికే జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు 2021,ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తెలుగువారిలో రమణ రెండవ వ్యక్తి. రమణ గారి కంటే ముందు రాజమండ్రికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు గారు 1966,జూన్ 30 నుండి 1967,ఏప్రిల్ 11 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేశారు. సంవత్సరం పాటు ఆ పదవిలో కొనసాగిన రమణ గారు కీలకమైన కేసుల్లో రాగ ద్వేషాలకు, పక్షపాతానికి తావులేకుండా తీర్పులు వెలువరించి అందరి మన్ననలు అందుకున్నారు. 2022, ఆగస్టు26న పదవి విరమణ చేశారు.
రమణ గారికి తన మాతృభాష తెలుగుపై ఏంతో మక్కువ. అవసరమైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. తెలుగులోనే పలుకరిస్తారు. న్యాయవాదిగా ఉన్న రోజుల్లో తెలుగునే ఎక్కువగా వాడేవారు. ‘కోర్టు వ్యవహారాల్లో పారదర్శకత అవసరం. మనకు తెలిసిన మన యాసతో కూడిన, మన తెలుగుభాషలో మాట్లాడడానికి, కేసుల్లో వాదించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు’ అంటారాయన. తెలుగు భాష ఎదుర్కొంటున్న నిరాధారణ పట్ల పలువేదికలపై తన ఆవేదనను బహిరంగపరిచేవారు. ‘ఇంగ్లీష్ స్కిల్స్ ఫర్ లాయర్స్” అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా “చైనా, జపాన్ లలో ఆంగ్లానికి ప్రాధాన్యమేమీ లేదనీ..అయినా ఆ దేశాలు ఎంతో అభివృద్ది సాధించాయని తెలిపారు. ఆంగ్లం వస్తేనే అభివృద్ది చెందగలమనే కేవలం అపోహ మాత్రమేనంటారాయన.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!