టాలీవుడ్ యాక్షన్ స్టార్...!

- August 28, 2024 , by Maagulf
టాలీవుడ్ యాక్షన్ స్టార్...!

సముద్రంలో కెరటాలు తగ్గిన తరువాత స్నానం చేయాలనుకుంటే ఒక జీవితకాలం పాటు అక్కడ ఎదురుచూస్తూ కూర్చోవాల్సిందే. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది కదా అని అసలు ప్రయత్నమే చేయకపోతే అభివృద్ధికి ఆమడదూరంలో ఉండి పోవాల్సిందే. జీవితంలో అవాంతరాలు ఎదురైనప్పుడు డీలా పడితే, ఆ సమస్య సముద్రమంతై మింగేస్తుంది. ప్ర్రతి అడుగు ధైర్యంగా ముందుకు వేస్తూ వెళుతున్నప్పుడే ప్రతికూల పరిస్థితులు తప్పుకుంటూ ఉంటాయి .. సమస్యపై సాహసంతో విరుచుకుపడినప్పుడే విజేతగా నిలబెడతాయి.అలా సుడిగాలిలా తనని చుట్టుముట్టిన సమస్యలను సహనంతోనే జయించిన కథానాయకుడిగా సుమన్ కనిపిస్తారు. తన కెరీర్ ను తాను నిలబెట్టుకున్న తీరు చూస్తే, తనని తాను మలచుకున్న శిల్పిలా అనిపిస్తారు. నేడు విలక్షణ నటుడు సుమన్ పుట్టినరోజు.

సుమన్  1959, ఆగష్టు 28న మద్రాసులో జన్మించాడు.  తల్లి కేసరీ చందర్ మద్రాసులోని యతిరాజ మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసింది. తండ్రి సుశీల్ చందర్ మద్రాసులోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో పనిచేసేవాడు. వీరి  స్వస్థలం మంగుళూరు.. అయితే ఆయన విద్యాభ్యాసం అంతా కూడా మద్రాసులో జరిగింది. మొదటి నుంచి కూడా ఆయన కరాటే పట్ల ఆసక్తిని చూపుతూ వచ్చారు .. బ్లాక్ బెల్ట్ సాధించారు. అలాగే వివిధ భాషలు నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని కనబరుస్తూ వచ్చారు.

సుమన్ మంచి పొడగరి .. చక్కని రంగు ఉండటం వలన స్నేహితుడు ఆయనను సినిమాల దిశగా అడుగులు వేయించాడు. అలా సుమన్ తమిళ సినిమాలు చేస్తూ తనకంటూ ఆయన ఒక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే ఆయనకి భానుచందర్ తో పరిచయమైంది. ఆయనకి కూడా మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రవేశం ఉండేది. ఆ అభిరుచి కారణంగానే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. భానుచందర్ ప్రోత్సాహంతోనే సుమన్ తెలుగు తెరకి పరిచయమయ్యారు.

'ఇద్దరు కిలాడీలు' సుమన్ తొలి తెలుగు సినిమా. అయితే ఆ తరువాత చేసిన 'తరంగిణి' ముందుగా విడుదలై సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అలా మొదలైన ఆయన ప్రయాణాన్ని 'నేటిభారతం' .. 'సితార' సినిమాలు మరింత ముందుకు తీసుకువెళ్లాయి. అప్పటికే స్టార్ హీరోలుగా వెలుగుతున్నవారితో పోటీ పడటానికి, తనకి వచ్చిన మార్షల్ ఆర్ట్స్ నే సుమన్ నమ్ముకున్నారు. ఫలితంగా యాక్షన్ హీరోగా ఆయనకి ఎక్కువ మార్కులు దక్కాయి. అలా 80వ దశకంలో ఒక రేంజ్ లో ఆయన దూకుడు కొనసాగింది.

90వ దశకం వచ్చేనాటికి ఆయన తాను చేసే యాక్షన్ చుట్టూ ఎమోషన్ ఉండేలా చూసుకున్నారు. ఫలితంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా ఆయనకి మంచి మద్దతు లభించింది. 'పెద్దింటల్లుడు' .. '20వ శతాబ్దం' .. 'బావ బావమరిది' సినిమాలు ఆయన క్రేజ్ ను మరింతగా పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'అన్నమయ్య' సినిమాలో  వేంకటేశ్వరస్వామిగా కనిపించడానికి అంగీకరించడం ఆయన చేసిన సాహసమేనని చెప్పాలి. వేంకటేశ్వర స్వామిగా ఆయన పలికించిన హావభావాలకు ప్రశంసలు లభించాయి.

'శ్రీరామదాసు'లో రాముడిగా కూడా ఆకట్టుకున్నారు. ఇలా ఒక వైపున యాక్షన్ హీరోగా .. మరో వైపున ఫ్యామిలీ హీరోగా .. ఆ తరువాత భక్తి చిత్రాలలో భగవంతుడి పాత్రలలో ఆయన ఒదిగిపోతూ తనని తాను మార్చుకుంటూ రావడం విశేషమేనని అంతా అనుకుంటూ ఉండగా, ఆయన 'శివాజీ' సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రను చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఆ విలన్ పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించి శభాష్ అనిపించుకున్నారు. 2021లో ‘లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నారు. విమర్శలకు .. వివాదాలకు దూరంగా ఉంటూ తనకు నచ్చిన సినిమాలు, ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తున్నారు సుమన్. 

- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com