జర్నలిస్టుల మార్గదర్శి-డిఎన్ఎఫ్ హనుమంతరావు
- August 30, 2024
ఆయన జర్నలిజం ప్రయాణంలో అనేక మైలురాళ్ళను దాటారు. వార్తలు, అభిప్రాయాలను సామాన్యుల దృక్కోణం నుండి వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందించే జర్నలిజమే నిజమైన జర్నలిజం అని ఆయన విశ్వాసం. ఆదే తరచు చెబుతూ ఉండేవారు. ఆయన మరెవరో కాదు తెలుగు నాట డెవలప్మెంట్ జర్నలిజం ఆద్యుడిగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ పాత్రికేయుడు విహెచ్ అలియాస్ డిఎన్ఎఫ్ హనుమంతరావు. నేడు జర్నలిస్టు దిగ్గజం హనుమంతరావు శత జయంతి సందర్బంగా వారి జర్నలిజం ప్రయాణం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం....
డిఎన్ఎఫ్ హనుమంతరావు గారి పూర్తి పేరు వాడకట్టు హనుమంతరావు. 1925, ఆగస్టు 30వ తేదీన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేటలో జన్మించారు. ఎస్.ఎల్.సి పూర్తి చేసి టైపింగ్, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు. చిన్నతనంలోనే స్వాతంత్య్ర పోరాట వీరులకు మద్దతుగా పలు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ సమయంలోనే వామపక్ష భావజాలానికి దగ్గరయ్యారు.
కమ్యూనిస్ట్ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వద్ద స్టెనోగా చేరి ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తకాంశాలను సుందరయ్యగారు ఇంగ్లిష్‌లో చెబుతోండగా టైప్ చేశారు.1945లో విజయవాడలో ప్రజాశక్తి పత్రికను ప్రారంభించిన తొలిరోజు నుంచీ పనిచేశారు. ఆ పత్రిక విలేకరిగా అప్పటి జాతీయ కమ్యూనిస్టు నాయకులైన డాంగే, అరుణా అసఫ్ ఆలీలు ఆంధ్రప్రాంతంలో పర్యటించిన సమయంలో వారికి సహాయకుడిగా ఉంటూనే వారి వార్తలను కవర్ చేస్తూ వచ్చారు. కమ్యూనిస్టుపార్టీ, ప్రజాశక్తి పత్రిక నిషేధానికి గురైనప్పుడు అండర్‌గ్రౌండ్‌కి వెళ్లారు. ప్రజాశక్తి స్థానంలో కొద్దీ కాలం పాటు వచ్చిన నవశక్తిలో, ఆ తర్వాత విశాలాంధ్ర పత్రికలో పనిచేశారు.
విశాలాంధ్ర కోసం 1952లో ఢిల్లీ వెళ్లి పార్లమెంటు సమావేశాలకు హాజరై అక్కడి వార్తలు కవర్ చేసిన తోలి తెలుగు పాత్రికేయునిగా విహెచ్ ఘనత సాధించారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక సమయంలో సీపీఐ వెంట నడిచారు. 60వ దశకం మధ్యర్థంలో విశాలాంధ్రాకు రాజీనామా చేసి యూఎన్ఐ వార్త సంస్థలో చీఫ్ రిపోర్టర్ గా విశాఖపట్నంలో పనిచేస్తున్న సమయంలోనే బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో కీలకమైన పాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి యుద్ధ వార్తలు అందించారు. యూఎన్ఐ తర్వాత కృష్ణా పత్రికకు కొంత కాలం పనిచేశారు.
1974లో మార్గదర్శి చిట్ ఫండ్ అధినేత రామోజీరావు స్థాపించిన ఈనాడు దినపత్రికలో ఆయన ఆహ్వానం మేరకు రెసిడెంట్ ఎడిటర్ బాధ్యతలు చేపట్టి ఆ పత్రికకు పటిష్టమైన న్యూస్ కవరేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. విలేకరుల ఎంపిక నుండి వారికి వార్తల కవరేజీలో అనుసరించాల్సిన విషయాల్లో శిక్షణ ఇచ్చారు. ఆయన ఏర్పర్చిన వ్యవస్థే దీర్ఘకాలంగా ఈనాడు పత్రిక మనుగడకు దోహదపడుతూ వస్తుంది. ఈనాడు నుంచి కొన్ని కారణాలతో బయటకు వచ్చిన ఆయన 1977లో డేటా న్యూస్ ఫీచర్స్ (డిఎన్ఎఫ్)ను నెలకొల్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర సమాచారంలో కూడిన వార్షిక పుస్తకాలను ప్రచురించారు. మూడు దశాబ్దాలకు పైగా డిఎన్ఎఫ్ ఏజెన్సీని నిర్వహించదమే గాక, వార్తా రంగానికి, విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువత కోసం ఏ ఏడాదికా ఏడు తాజా సమాచారంతో ఇయర్ బుక్‌లను ప్రచురించారు.
డిఎన్ఎఫ్ ప్రచురించిన పుస్తకాలను రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు సైతం చదివేవారు. ఒకవైపు పుస్తకాల ప్రచురణతో పాటుగా డిఎన్ఎఫ్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంను ప్రారంభించి ఎందరో గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులను జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు. ఆయన వద్ద శిక్షణ పొందిన వారు డేటాను వివరించే డెవలప్మెంట్ జర్నలిజంలో నిష్ణాతులయ్యారు. ఈరోజు వారందరూ జర్నలిజంలోనే కాకుండా కార్పొరేట్ రంగంలో సైతం ఉన్నత హోదాల్లో రాణిస్తున్నారు. రాజకీయ, పాత్రికేయ రంగాల్లో పలువురు సీనియర్లు ఇప్పటికి ఆయనకు అభిమానులున్నారంటే ఆర్థిక, రాజకీయ సామాజిక, గ్రామీణ వ్యవస్థలపై ఆయనకున్న పట్టు తెలుపుతుంది.
చట్టసభల వార్షిక బడ్జెట్లను అక్షరం వదలకుండా అధ్యయనం చేసిన వ్యక్తి అని చెప్పవచ్చు. అసెంబ్లీ, పార్లమెంట్ వార్షిక బడ్జెట్లపై వివరాణాత్మక సమాచారం అందివ్వడంలో, విశ్లేషించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ది ఎకనామిక్ టైమ్స్ పత్రికలో సరళమైన రీతిలో బడ్జెట్ పై ఆయన రాసిన వ్యాసాలు జాతీయస్థాయిలో ప్రశంసలు పొందాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపై ఖచ్చితమైన డేటాను అందించడంలో ఆయనది అందె వేసిన చెయ్యి.
హనుమంతరావు గారి రచనలు పలు రంగాల వారిని ఆలోచింపజేసేవి. సామాజిక, ఆర్థిక సమస్యలపై రాయడానికి పలువురు యువకులను ప్రోత్సహించారు. తెలుగునాట పాత్రికేయ, రాజకీయ వర్గాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. సామాజిక, ఆర్థిక అంశాల ప్రాతిపదికన వీక్షణం అనే మాసపత్రికను స్థాపించి వ్యవస్థాపక సంపాదకులుగా కూడా పనిచేశారు. హనుమంతరావు వివిధ వార్తాపత్రికలు, పత్రికలలో అసంఖ్యాకంగా వ్యాసాలు రాశారు. ప్రముఖ పాత్రికేయుడైన జర్నలిస్టు డైరీ సతీశ్ బాబు గారు వీరి చిన్నకుమారుడు.
దాదాపు 6 దశాబ్దాల పైగా వివిధ హోదాల్లో జర్నలిజం రంగంలో హనుమంతరావు గారు కొనసాగారు. జర్నలిజంలో వచ్చిన విపరీత ధోరణుల గురించి మాట్లాడుతూ పత్రికారంగం కార్పొరేటీకరణ చెందింది.‘పెయిడ్‌న్యూస్’ విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇది వరకు జర్నలిస్టులు సమాజంలో తప్పు లను చూపేవారు. ఇప్పుడు సమాజం జర్నలిస్టులలో తప్పులను చూపుతోంది. రాజకీయాల్లో రాణిస్తున్నవారికి, జర్నలిస్టు సంఘాల్లో చేరి రాణిస్తున్న కొందరు జర్నలిస్టులకు మధ్య తేడా లేకుండా పోతోందని ఆయన వాపోయారు. జర్నలిజంలో నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వద్దని తన చివరి శ్వాస వరకు పాత్రికేయులను హెచ్చరిస్తూ వచ్చారు. అనారోగ్యం కారణంగా 2016, డిసెంబర్ 13వ తేదీన కన్నుమూశారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..