హైదరాబాద్ లో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
- September 04, 2024
గురువారం, శుక్రవారం (సెప్టెంబర్ 5, 6) రెండు రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు జరగనుంది.
"ప్రతి ఒక్కరి కోసం పనిచేసే కృత్రిమ మేథస్సు" అనే థీమ్‌తో ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వహించడం దేశంలో ఇదే మొదటి సారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభిస్తారు.
ప్రపంచం నలుమూలల నుంచి AI రంగంలో పేరొందిన ప్రముఖులు.. సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, IBM నుంచి డానియెలా కాంబ్, XPRIZE ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతారు. ఏఐ రంగం అభివృద్ధికి తమ ఆలోచనలను పంచుకుంటారు. భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరుపుతారు. సామాజిక బాధ్యతగా సమాజంపై AI ప్రభావం, నియంత్రణ, సవాళ్లను చర్చిస్తారు.
కొత్త సాంకేతికత పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ది దశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్‌లను ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. రెండు రోజుల ఈవెంట్లో ప్రధాన వేదికతో పాటు నాలుగు అదనపు వేదికలు ఏర్పాటు చేశారు. అన్ని వేదికలపై AIకి సంబంధించి వేర్వేరు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్టి సెషన్స్ నిర్వహించే ఏర్పాట్లు చేశారు. హై-ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్స్, ఇంటరాక్టివ్ సెషన్లు ఏర్పాటు చేశారు.
ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టినీ ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా AI సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్నీ, అందుకు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్నీ ఈ AI గ్లోబల్ సదస్సు ప్రపంచానికి చాటి చెపుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రాన్ని AI హబ్‌గా తీర్చిదిద్దేందుకు.. ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో AI సేవలను అబివృద్ధి అవకాశాలతో.. భవిష్యత్తు కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను రూపొందించింది. దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. AI గ్లోబల్ సదస్సులో ముఖ్యమంత్రి ఈ రోడ్ మ్యాప్‌ను విడుదల చేస్తారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..