సోషలిస్టు రాజకీయ మేధావి - కె.వి.ఆర్
- September 04, 2024
భారతదేశం గర్వించదగ్గ మేధావుల్లో ఆయన ముఖ్యులు. సామ్యవాద సిద్ధాంతాలను సంపూర్ణంగా ఔపోసన ఘనుడాయన అంటే అతిశయోక్తి కాదు అనిపిస్తుంది. న్యాయవాద వృత్తి నుండి రాజకీయాలకు దిగుమతైనా తన మేధో సంపత్తితో దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. భారత రాజకీయ యవనికలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితంగా మసిలారు. ఇందిరా హయాంలో దేశ ప్రజల తలరాతను మార్చిన ప్రతి సంస్కరణలో ఆయన పాత్ర కీలకమైనది. జాతీయ రాజకీయాల్లో ఇంతటి కీర్తిని గడించిన ఆయన మరెవరో కాదు ప్రముఖ రాజనీతిజ్ఞుడు, కార్మిక నేత, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కె.వి.రఘునాథ రెడ్డి గారు. నేడు ఆయన జయంతి సందర్భంగా వారి జీవిత ప్రయాణం గురించి క్లుప్తంగా మీకోసం....
కె.వి.ఆర్ అలియాస్ కె.వి.రఘునాథ రెడ్డి గారి పూర్తి పేరు కొల్లి వెంకట రఘునాథరెడ్డి. 1924,సెప్టెంబర్ 24న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పొదలకూరు తాలూకా విరువూరు గ్రామంలోని సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరులో జరగ్గా, మద్రాస్ నగరంలో బీఏ, ఎల్.ఎల్.బి పూర్తి చేసి లక్నో యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అనంతరం న్యాయవాదిగా మద్రాసు, గుంటూరు పట్టణాల్లో ప్రాక్టీస్ చేశారు.
రఘునాథ రెడ్డి గారు విద్యార్ధి దశలోనే వామపక్ష సోషలిజం భావజాలం పట్ల ఆకర్షితులై విద్యార్ధి రాజకీయాల్లో పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీపై ఆరోజుల్లో నిషేధం ఉన్న మూలాన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన సోషలిస్టు పార్టీతో కలిసి నడిచారు. భారతదేశానికి సోషలిజం అత్యంత అనువైన సిద్ధాంత భావజాలంగా కె.వి.ఆర్ విశ్వసించారు. న్యాయ వృత్తిలో కొనసాగుతూనే కమ్యూనిస్టు, సోషలిస్టు రాజకీయ నాయకులతో సన్నిహితంగా మెలిగారు. ఇదే సమయంలో కార్మిక లోకానికి దగ్గరయ్యి వామపక్ష మరియు సోషలిస్టు కార్మిక సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. కార్మికుల తరుపున న్యాయవాదిగా కోర్టుల్లో ఉచితంగా వాదించేవారు.
ట్రేడ్ యూనియన్ ( కార్మిక సంఘం) కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన కె.వి.ఆర్ కు జాతీయ స్థాయి కార్మిక సంఘాల నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి సహచర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల సమస్యలను అధ్యయనం చేశారు. పార్టీలకతీతంగా కార్మిక సంఘాలు కార్మిక సంక్షేమం కోసం కృషి చేయాలని పలు వేదికల ద్వారా పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల్లో పూర్తి స్థాయిలో పనిచేయడానికి తన న్యాయవాద వృత్తిని సైతం పక్కన పెట్టారు. కార్మిక సంక్షేమం కోసం చేస్తున్న వీరి కృషిని గుర్తించిన కార్మిక నేతలు వారి నాయకుడిగా ఎన్నుకున్నారు.
1962లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, కార్మిక అంశాలపై అనర్గళంగా మాట్లాడుతూ అప్పటి ప్రధాని నెహ్రూ దృష్టిలో పడ్డారు. జీవిత చరమాంకంలో ఉన్న నెహ్రూ పార్లమెంట్లో కె.వి.ఆర్ పనితీరుకు మెచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో తొలుత సంశయించినా, సన్నిహితుల సలహా మేరకు ఆ పార్టీలో చేరారు. 1964లో నెహ్రూ మరణం తర్వాత వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి సాంప్రదాయిక వాది కావడం మూలాన ఆయనకు దగ్గరవ్వలేక పోయారు.
1966లో శాస్త్రి మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరా గాంధీ దగ్గరకు తీయడంతో కాంగ్రెస్ పార్టీలో కె.వి.ఆర్ హవా మొదలైంది. 1967 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి రెండో సరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇందిరా కోటరీలో స్థానం దక్కించుకున్న కొద్దీ రోజులకే కంపెనీ వ్యవహారాలు, పరిశ్రమల అభివృద్ధి శాఖల కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సోషలిస్టు సిద్ధాంత భావజాలంలో తేలియాడే కె.వి.ఆర్ మొదటి నుంచి ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా ఉండేవారు. ఇందిరా పాలనలో నయా సామ్యవాద దేశంగా భారత్ అవతరిస్తున్న తరుణంలో ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలను ప్రభుత్వం నిర్వహించాలి తప్పించి ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించకూడదన్న వాదాన్ని బలం చేకూరుస్తూ మంత్రిగా పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందిరా ఆశీస్సులతో 1968,1974లలో కాంగ్రెస్ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
పారిశ్రామిక వేత్తలకు వెన్నులో ఒణుకు పుట్టించిన మొనోపలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969 చట్టాన్ని రూపొందించడంలో కె.వి.ఆర్ కీలక పాత్ర పోషించారు. అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న స్వతంత్ర పార్టీకి మద్దతుగా ఉన్న పారిశ్రామికవేత్తల ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చట్టం ద్వారా బ్యాంకింగ్, బీమా రంగాలను జాతీయకరణ చేయడంతో ప్రారంభమై, దేశంలోని కీలకమైన పరిశ్రమలను ప్రభుత్వ పరం చేసిన ఘనత వీరికి దక్కుతుంది. పరిశ్రమల మంత్రిగా కె.వి.ఆర్ దీర్ఘ కాలం కొనసాగితే నష్టపోతామని గ్రహించిన కాంగ్రెస్ మద్దతుదారులైన బిర్లా, బజాజ్ కుటుంబాలు మరియు ఇతర పారిశ్రామిక వేత్తలు ప్రధాని ఇందిరా మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్మిక శాఖకు మార్పించారు.
కార్మిక సంఘాల నాయకుడిగా వారి కష్టాలను దగ్గర్నుంచి చూసిన కె.వి.ఆర్ కార్మిక శాఖ మంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలు తరువాత కాలంలో కార్మికులకు ఎంతో మేలు చేకూర్చాయి. అంతర్జాతీయ కార్మిక సమావేశాలకు భారత ప్రతినిధిగా హాజరవుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక సమాజానికి అనువైన చట్టాలను రూపొందించటంలో తనవంతు పాత్ర పోషించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో వివాద పరిష్కారాలకు కె.వి.ఆర్ ఎల్లప్పుడూ ముందుండేవారు. సింగరేణి కాలరీస్ అవార్డును రూపొందించడంలో కె.వి.ఆర్ ప్రధాన పాత్ర వహించారు. వెట్టిచాకిరి నిర్మూలణ చట్టం (1976) రూపకల్పన చేసి పార్లమెంట్ ఆమోదం పొందడంలో శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
కె.వి.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. పార్టీలోని తన తోటి సోషలిస్టు ఎంపీలైన చంద్రశేఖర్(మాజీ ప్రధాని), కృష్ణకాంత్(మాజీ ఉపరాష్ట్రపతి), మోహన్ ధారియా, అమృత్ నహతాలతో కలిసి "యంగ్ టర్క్స్ " గా ప్రసిద్ధి చెందారు. వీరు మిగిలిన కాంగ్రెస్ నేతల్లా భజనకు పరిమితం కాకుండా ఇందిరాను ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా నడిపించారు. ఇందిరా పాలనలో ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలను విమర్శించడంలో ముందుండేవారు. వీరిని ఇందిరా సైతం అనుసరించి రాజ్య భరణాల రద్దు, బ్యాంకులు, బీమా సంస్థల జాతీయకరణకు పూనుకునేలా ప్రేరేపించారు. కె.వి.ఆర్ మంత్రిగా ఉన్నప్పటికి వీరితో స్వేచ్ఛగా కలిసి మెలసి ఉండేవారు.
"యంగ్ టర్క్స్ " ఆధ్వర్యంలో ఏర్పాటైన కాంగ్రెస్ ఫోరం ఫర్ సోషలిస్ట్ ఆక్షన్ కమిటీలో క్రియాశీలక సభ్యుడిగా కె.వి.ఆర్ వ్యవహరించారు. 1971 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడిగా గరీబీ హఠావో నినాదం, 20 సూత్రాల ఆర్థిక పథకాలు రూపకల్పన కె.వి.ఆర్ చేశారు. తన పరిచయాలను ఉపయోగించి ఇందిరమ్మను, ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కలపడంలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా వారి మధ్య వారథిగా నిలిచారు.
ఎమెర్జెన్సీ సమయంలో ఇందిరాతో విభేదాలు పొడచూపడంతో 1977 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఆమెకు దూరమయ్యారు. 1980లో ఇందిరా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మునుపటి సాన్నిహిత్యం కరువైంది. అయితే, పాలనా పరంగా కె.వి.ఆర్ సేవలను ఉపయోగించుకుంటూ వచ్చారు. ఇందిరా మరణంతో కాంగ్రెస్ పార్టీలో ఆయన సన్నిహితులు తగ్గిపోయారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పులు, చేర్పుల్లో తెరమరుగైపోయి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.
తన పాత మిత్రుడైన చంద్రశేఖర్ ప్రధాన మంత్రి కావడంతో కె.వి.ఆర్ తొలుత త్రిపుర గవర్నరుగా 1990లో నియమితులై 1993 వరకు పనిచేశారు. జ్యోతి బసు అభ్యర్థన మేరకు పివి ప్రభుత్వం ఆయన్ని పశ్చిమ బెంగాల్ గవర్నరుగా 1993 నియమిస్తే 1998 వరకు అక్కడ పనిచేశారు. బెంగాల్ రాష్ట్రంతో పాటుగా ఒరిస్సా(ఇప్పటి ఒడిశా) రాష్ట్రానికి 1997- 98 మధ్య గవర్నరుగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆర్థిక, న్యాయ వ్యవస్థలకు సంబంధించిన జ్ఞానం అపారం. వారి పాండిత్యానికి ముగ్దులైన ఎందరో రాజకీయ నేతలు, పాత్రికేయులు ఉన్నారు. కె.వి.ఆర్ పలు అంశాల మీద విరివిగా పుస్తకాలు రాశారు. క్రిమినల్ లా మీద వ్రాసిన పుస్తకం అనేక న్యాయ కళాశాల్లో విద్యార్థులకు ప్రామాణిక పాఠ్యపుస్తకం అయ్యింది. వీరి కుమారుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు, వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షస్థానాన్ని వహించిన తొలి భారతీయుడిగా నిలిచారు.
కె.వి.ఆర్ పదవుల కోసం ఏనాడు పాకులాడలేదు. పదవులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. పదవుల కోసం తాను నమ్మిన సిద్ధాంతాల నుంచి ఎన్నడూ దారి తప్పలేదు. అవినీతి, అక్రమాలు, పైరవీకారులను దరిచేరనీయకుండా తన పని మాత్రమే చేసుకుంటూ పోయేవారు. అహంకారం లేదు, అతిశయాలకు ఎప్పుడూ పోలేదు. కేవలం మేధో వర్గ ప్రతినిధిగానే రాజకీయ జీవితాన్ని గడిపారు. అనారోగ్యం కారణంగా 2002, మార్చి 4న ఢిల్లీలో మరణించారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన ద్వారా ప్రజల జీవితాల్లో మార్పునకు ప్రయత్నించిన ఆయన మేధో సంపత్తికి కొలమానాలు దొరకవు. కానీ, ప్రజల కోసం ఆయన చేసిన కృషికి గాను దేశ చరిత్రలో తగిన స్థానం లభించింది.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!