శాండిల్‌వుడ్ రియల్ స్టార్..!

- September 18, 2024 , by Maagulf
శాండిల్‌వుడ్ రియల్ స్టార్..!

“నా రూటే సెపరేటు” అంటూ సాగుతున్న ఆయనకు కన్నడనాట తరగని క్రేజ్! తెలుగు నేలపైనా ఆదరణ తక్కువేమీ కాదు. నలుగురు నడచిన బాటలో కాకుండా, తనదైన పంథాలో పయనించి నలుగురినీ మెప్పిస్తున్న ఘనుడు కన్నడ స్టార్ ఉపేంద్ర. అసిస్టెంట్‌ డైరక్టర్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రచయితగా, దర్శకునిగా, నటునిగా, నిర్మాతగా ఉపేంద్ర పలు పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు.నేడు శాండిల్వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు.

ఉపేంద్ర పూర్తి పేరు ఉపేంద్ర రావు.1969, సెప్టెంబర్ 18న కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా, కుందాపురకు దగ్గర్లోని తెక్కెట్టె అనే గ్రామంలో దిగువ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మంజునాధరావు, అనసూయమ్మ దంపతులకు ఉపేంద్ర జన్మించారు. కుటుంబ పోషణ కోసం ఉపేంద్ర తల్లిదండ్రులు తమ ప్రాంతంలో శుభకార్యాలకు వంటలు చేస్తూ వచ్చారు. చిన్నతనంలోనే ఇతనికి కంటికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్ సోకి చాలా బాధపడ్డాడు. ఆర్థిక పరిస్థితుల వల్ల సకాలంలో వైద్యం అందకపోవడం ఫలితంగా ఇప్పటికీ కనుగుడ్లు త్రిప్పడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. దీనిని మనం ఉపేంద్ర నటించిన చిత్రాల్లో కూడా గమనించవచ్చు.

ఉపేంద్ర బెంగుళూరులోని ఎ.పి.ఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బి.కామ్ పూర్తిచేశారు. చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు రాయడం, వాటిలో నటించడం అంటే ఉపేంద్రకు ఎంతో ఇష్టం. అతని హంగామా చూసి మిత్రులు సినిమాల్లో చేరిపో అంటూ ప్రోత్సహించేవారు. ప్రముఖ కన్నడ నటదర్శకుడు కాశీనాథ్ ఉపేంద్రకు దూరపు బంధువు. డిగ్రీ పూర్తి కాగానే, కాశీనాథ్ వద్ద అసోసియేట్ గా చేరిపోయారు ఉపేంద్ర. ఆయన దగ్గర పనిచేస్తూనే తన మనసుకు నచ్చిన కథలను రాసుకుంటూ ఉండేవారు.

కాశీనాథ్ తెరకెక్కించిన ‘అనంతన అవాంతర’ అనే కన్నడ సినిమాకు అసోసియేట్ గా పనిచేయడమే కాదు, అందులో కామదేవుని పాత్రలో కాసేపు తెరపై కనిపించారు ఉపేంద్ర. రెండు సినిమాలు కాగానే తాను రూపొందించుకున్న కథతో ‘తర్లే నన్ మగ’ చిత్రాన్ని రూపొందించారు. ఈ తొలి ప్రయత్నంలోనే ఉపేంద్రకు దర్శకునిగా మంచి పేరు లభించింది.‘ష్!’ చిత్రంతో వైవిధ్యం చూపించారు.

ఉపేంద్ర దర్శకత్వంలో మూడో చిత్రంగా ‘ఓం’ తెరకెక్కింది. శివరాజ్ కుమార్ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. ఉపేంద్ర సోదరుడి స్నేహితుడైన సత్య అనే వ్యక్తి జీవితం ఆధారంగా తీర్చిదిద్దారు. ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఈ కథ నేపథ్యం.1995లో టాప్ గ్రాసర్ గానూ ‘ఓం’ రికార్డ్ సృష్టించింది. ‘ఓం’ చిత్రాన్ని తెలుగులో రాజశేఖర్ హీరోగా ‘ఓంకారం’ పేరుతో ఉపేంద్ర దర్శకత్వంలోనే రూపొందించారు.రిరిలీజ్లలో భాగంగా 75 సార్లు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 1995-2017 వరకు 550పైగా రీరిలీజ్లు ఉన్న ఈ చిత్రం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది.

ఈ సినిమా విడుదలకాక ముందు నుంచే దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడిచింది. ఇటువంటి సినిమాను దిగ్గజ నటుడు రాజ్కుమార్ బ్యానర్లో నిర్మించి ఉండాల్సింది కాదంటూ ఓ మ్యాగజైన్ ఏకంగా కవర్ స్టోరీనే ప్రచురించింది.ఈ చిత్రంలో నిజ జీవితంలో అండర్వరల్డ్తో సంబంధాలు ఉన్న వ్యక్తులు నటించారు. ఇందుకోసం కొందరు నేరస్థులకు బెయిల్ ఇప్పించాల్సి వచ్చింది. జేదరహల్లి కృష్ణప్ప, బెక్కిన కన్ను రాజేంద్ర, కోరంగు, తన్వీర్ వంటి పేరు మోసిన రౌడీలు ఇందులో నటించారు. 20 ఏళ్ల తర్వాత కూడా.. 2015లో ఈ చిత్రం టీవీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. రూ. 10 కోట్ల రూపాయలకు టీవీ హక్కులను సంబంధిత సంస్థ దక్కించుకుంది. ‘ఓం’ చిత్రం కన్నడ సినీ పరిశ్రమ చరిత్రలో ఓ క్లాసిక్గా నిలిచిపోయింది.

‘ఓంకారం’తోనే తెలుగువారికీ దగ్గరయ్యారు ఉపేంద్ర. దాంతో ఉపేంద్రకు నటునిగానూ తెలుగునాట క్రేజ్ లభించింది. ఇ.వి.వి. సత్యనారాయణ తన ‘కన్యాదానం’లో ఉపేంద్రను ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఎంచుకున్నారు. ఈ సినిమా ఆశించిన రీతిలో ఆకట్టుకోలేక పోయింది. ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన ‘ఎ’, 'ఉపేంద్ర', 'సూపర్', 'రా' చిత్రాలు సంచలన విజయం సాధించాయి.ఈ సినిమాలు తెలుగులోనూ అనువాదమై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను అందుకొని, ఉపేంద్రకు భారీ ఫాలోయింగ్ లభించింది. సూపర్ చిత్రాన్ని చూసి సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఉపేంద్రను అభినందించారు.

ఉపేంద్ర కన్నడలో హీరోగా నటించిన అనేక చిత్రాలు ప్రెకషకులను ప్రేక్షకులను ఎంతగానో మురిపించాయి. ద్విపాత్రాభినయాలతోనూ, త్రిపాత్రాభినయాలతోనూ ఉపేంద్ర ఆకట్టుకున్న తీరే వేరు అని చెప్పవచ్చు. హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సైతం నటించేందుకు సిద్ధంగా ఉంటారు. ఆలా వచ్చినవే నీతోనే ఉంటాను, టాస్, సెల్యూట్, సన్నాఫ్‌ సత్యమూర్తి, గని చిత్రాలు.

ఉపేంద్ర వ్యక్తిగత జీవితానికి వస్తే ప్రముఖ  కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక త్రివేదిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికిద్దరు పిల్లలు. ప్రియాంక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి కన్నడలో ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తున్నారు. ఉపేంద్రకు ఇప్పటి వరకు లెక్క లేనన్ని అవార్డులు అందుకున్నారు. 2015లో కంబోడియాలోని ఆంగ్కోర్ విశ్వవిద్యాలయం "డాక్టరేట్" ను ప్రదానం చేసింది.

డొంక తిరుగుడు లేకుండా, ముక్కుసూటిగా మాట్లాడటం ఉపేంద్ర నైజం. అందుకే ఆయన సినిమాల్లోని పాత్రల్లో ఆ విలక్షణం కనిపిస్తూ ఉంటుంది. అదే జనాన్ని మైమరిపిస్తూ ఉంది. అందుకే ప్రేక్షకులు ‘ఉప్పి’ అంటూ అభిమానంగా ఆయన్ను ఆరాధిస్తున్నారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకొనేవాణ్ణి. అదొక కోణం. కానీ నేను ఎప్పుడూ రియాలిటీలోనే బతుకుతూ ఉంటా. అయితే ఏదో చేయాలనే తపన మాత్రం నన్ను వెంటాడుతూ ఉంటుంది అంటారు ఉపేంద్ర.

జనం కోసం మనం అంటూ ప్రజావాణి వినిపించాలని 2018లో ‘ఉత్తమ ప్రజాకీయ పక్ష’ అనే రాజకీయ పార్టీని ఆరంభించారు.  ‘‘రాజకీయాలు కలుషితం కాకూడదు.. దానిలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉండకూడదు. అవినీతి ఉండకూడదు సమస్యలే ప్రధాన అంశాలుగా ఎన్నికలు జరగాలి. ‘రైట్‌ టూ రీకాల్‌’ అమలు చేయాలి’’ ఇలా అనేక ఆలోచనలు పంచుకున్నారు. తాను పోటీ చేయకుండా పలువురు అభ్యర్థులను బరిలోకి దింపారు ఉపేంద్ర. అయితే సినిమాల్లోలాగా రాజకీయాల్లో విజయం ఆయన్ను వరించలేదు. అయినా సరే, జనం పక్షాన నిలచి పోరాడుతూనే ఉంటానని అంటారు ఉపేంద్ర. అభిమానులు మాత్రం ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నారు.దానికి ఇంకొంత సమయం ఉందని అంటున్నారు ఉపేంద్ర. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల మీద దృష్టి సారించారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com