గాంధీ జయంతి

- October 02, 2024 , by Maagulf
గాంధీ జయంతి

మహాత్మా గాంధీ జీవితం సరళతకు ప్రతీక. ఆయన ఎల్లప్పుడూ సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకనే ధోతి ధరించి ఆశ్రమంలో నివసించడం ద్వారా సాదాసీదా జీవితం గడిపారు. ఈ కారణంగా ప్రజలు ఆయనను ‘బాపు’ అని ముద్దుగా పిలుచుకోవడం ప్రారంభించారు. ఇకపోతే ., మహాత్మా గాంధీకి ‘జాతి పితామహుడు’ గౌరవాన్ని అందించిన మొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. గాంధీజీ నాయకత్వానికి, దేశాన్ని ఏకం చేసినందుకు గానూ ఆయనకు ఈ బిరుదు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ‘జాతి పితామహుడు’గా గౌరవించబడ్డారు. అహింస సూత్రం ఆధారంగా దేశానికి స్వాతంత్ర సాధించడంలో ముఖ్యమైన కృషి చేశారు. దాంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న ఆయన జయంతిని గాంధీ జయంతిగా జరుపుకుంటారు.

మహాత్ముడి పూర్తి పేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.1869 అక్టోబర్ 2న ఆనాటి బొంబాయి ప్రావిన్స్ నందు ఉన్న పోర్‌బందర్‌లో జన్మించారు.గాంధీజీ ప్రాథమిక విద్యాభ్యాసం పోర్‌బందర్, రాజ్‌కోట్‌ లలో జరిగింది.ఆ తర్వాత ఇంగ్లండ్ వెళ్లి అక్కడ న్యాయశాస్త్రం అభ్యసించారు. 1891లో బారిస్టర్ డిగ్రీని పొందిన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం న్యాయశాస్త్రంలో సేవలను అందించారు.చట్టపరమైన కేసుకు సంబంధించి 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్లిన తర్వాత, అతను అక్కడ జాతి వివక్షను ఎదుర్కొన్నారు.ఇది సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఆయన్ని ప్రేరేపించింది.

దేశ స్వాతంత్రం కోసం సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ వంటి అనేక ముఖ్యమైన ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన ఎల్లప్పుడూ తన ఉద్యమానికి అహింస మార్గాన్ని ఎన్నుకున్నాడు. అలాగే హిందూ-ముస్లిం ఐక్యతను పెంపొందించడానికి నిరంతరం కృషి చేశాడు. స్వాతంత్య్రానంతరం గాంధీజీ సామాజిక, ఆర్థిక సంస్కరణల కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన శాంతి, సామరస్యాన్ని పెంపొందించడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. అలాగే సత్యం, నిగ్రహం, అహింస మార్గాన్ని అనుసరించేలా ప్రజలను ప్రేరేపించారు.

సత్యవ్రతం, నిజాయితీ, నిగ్రహం, పవిత్రత, శాకాహారం బాపు జీవన విధానం. ఈ జీవన విధానంతో ఎవరైనా మారుతారు. బాపూజీ చూపించిన మార్గంలో నడుస్తూ, ఆయన అవలంభించిన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంబిస్తే దేశంలో నేరాలు ఉండవు. అవినీతి, అరాచకాలు ఉండనే ఉండవు. మనమందరం గాంధీజీ ఆచరించి చూపించిన మార్గంలో నడుస్తూ దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను గాడిలో పెట్టడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.  


 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com