మహానేత లాల్ బహదూర్ శాస్త్రి

- October 02, 2024 , by Maagulf
మహానేత  లాల్ బహదూర్ శాస్త్రి

జీవితంలో ఎదురైన కష్టాలను అతి సులభంగా అధిగమించడమే కాకుండా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు లాల్ బహదూర్  శాస్త్రీజీ. జీవితంలో ఎదురైన కష్టాలను చాలా తేలికగా అధిగమించడంతో ఆయన అందరికీ స్ఫూర్తిదాయకునిగా నిలిచారు. స్వతంత్ర భారత దేశానికి రెండవ ప్రధానమంత్రిగా కూడా పనిచేసి భారత రాజకీయాల్లో తన చెరగని ముద్ర వేశారు. నేడు భారత రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి.

లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్ సరాయ్ గ్రామంలో శారదా ప్రసాద్ శ్రీవాస్తవ, రామ్ దులారి దేవి దంపతులకు జన్మించారు.1925లో వారణాసిలోని కాశీ విద్యాపీఠం నుండి పట్టభద్రుడై "శాస్త్రి" బిరుదు పొందారు. 'శాస్త్రి' అనే పదం 'విద్వాంసుడు' లేదా గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన వ్యక్తిని సూచిస్తుంది. యువకుడిగా శాస్త్రి స్వామి వివేకానంద, గాంధీజీ, అనీబిసెంట్ వంటి గొప్ప వ్యక్తుల చరిత్రలను, వారు చేసిన సేవలను గూర్చి అధ్యయనం చేసి స్వాతంత్రోద్యమంపై మక్కువ పెంచుకున్నారు. గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్‌లో చేరి స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో శాస్త్రి ఒక సంవత్సర కాలం జైలుశిక్ష అనుభవించారు. శాస్త్రి స్వాతంత్రోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు. జైలులో ఉన్న కాలంలో పుస్తకాలు చదివి పశ్చిమ దేశాల తత్వవేత్తలు, విప్లవకారులు, సాంఘిక సంస్కర్తల కృషిని బాగా తెలుసుకున్నారు.

1946లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, పాలనలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు అర్హులైన అభ్యర్థుల కోసం వెతుకుతున్న సమయంలో పార్టీ ఆయనను ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించింది. 1947 ఆగస్టు 15న పోలీసు, రవాణా మంత్రిగా నియమితులయ్యారు.1951లో న్యూఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రివర్గంలో అనేక శాఖలు నిర్వహించారు. అతను రైల్వే మంత్రి, రవాణా, కమ్యూనికేషన్ల మంత్రి, వాణిజ్యం, పరిశ్రమల మంత్రి, హోం వ్యవహారాల మంత్రి, ఆ తర్వాత భారతదేశ రెండవ ప్రధాన మంత్రిగా కూడా పని చేశారు.

నెహ్రూ మరణం తరువాత దేశానికి రెండవ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన శాస్త్రి దేశంలో ఆహార కొరత లేకుండా ఉండడానికి ఆహార భద్రత పెంపొందించే క్రమంలో పాల ఉత్పత్తి పెరిగేలా శ్వేత విప్లవం, వ్యవసాయం అభివృద్ధి చెందేలా హరిత విప్లవం లాంటి ఉద్యమాలను ప్రోత్సహించడంలోనూ లాల్ బహదూర్ శాస్త్రి తన వంతు కృషి చేశారు.


దేశాన్ని కాపాడుతున్న జవాన్ల గొప్పతనం, దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతల విలువను ప్రపంచానికి చాటిచెప్పేలా ' జై జవాన్.. జై కిసాన్ ' అనే నినాదానికి పిలుపునిచ్చింది లాల్ బహదూర్ శాస్త్రినే. 1965లో ఇండో-పాక్ వార్ సందర్భంగా ఆయన ఈ నినాదం ఇచ్చారు. ఆ నినాదం ఇప్పటికీ దేశం నలుమూలలా మార్మోగుతూనే ఉంది. ఇకపై కూడా ఉంటుంది. ఆ నినాదానికి ఉన్న గొప్ప అర్థం అలాంటిది.

దేశ రాజకీయాలకు వన్నెతెచ్చిన అతి కొద్ది మంది ప్రముఖులలో శాస్త్రి అగ్ర స్థానంలో ఉంటారు. చేతిలో దేశ ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి వంటి అత్యున్నత పదవులు ఉన్నా.. ఎలాంటి హంగులు, ఆర్బాటాలకు పోకుండా ఊపిరి ఉన్నంత కాలం అతి సాధారణ జీవితమే గడిపిన ఒక మహా నేత ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు మాత్రమే !

దేశ ప్రధాని అంటే ఎలా ఉండాలి అని ఆరోజుల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో చాటిచెప్పిన ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రికి మంచి పేరుంది. మరీ ముఖ్యంగా స్వతంత్ర భారతంలో పేదరిక నిర్మూలన కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది. ప్రజల మధ్య నుంచి  వచ్చిన నాయకుడిగా, ప్రజల కష్టం తెలిసిన మనిషిగా అహర్నిశలు వారి అభ్యున్నతి కోసమే పాటుపడిన నిస్వార్థ జీవి లాల్ బహదూర్ శాస్త్రి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com