రాచకొండ కమిషనరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

- October 08, 2024 , by Maagulf
రాచకొండ కమిషనరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్: ఈ రోజు అంబర్పేట్ లోని సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో  రాచకొండ మహిళా పోలీసుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాచకొండ సీపీ సుధీర్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగను ప్రతి మహిళ ఎంతో ఘనంగా, ఇష్టంగా నిర్వహిస్తారని తెలుగు రాష్ట్రాల్లో దసరా మరియు బతుకమ్మ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని పేర్కొన్నారు. 

మహిళా పోలీసులు తమ సంప్రదాయాలను పండుగలను ప్రతి ఏటా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకునేలా తమవంతు సహకారం అందిస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. మహిళా పోలీసులకు చక్కటి పని వాతావరణాన్ని కల్పించడం మాత్రమే కాక వారి సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. వారి కోసం చక్కటి వసతులతో ప్రత్యేకంగా విశ్రాంతి గదులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అందుకోసం దసరా కానుకగా రాచకొండ సంక్షేమనిధి నుండి పదిహేడు లక్షల పదిహేడు వేల ఐదువందల రూపాయలను మంజూరు చేశారు. అంతేకాక భువనగిరి సిఎఆర్ హెడ్ క్వార్టర్స్  లో పోలీస్ సిబ్బందికి క్యాంటీన్ ఏర్పాటు కోసం 75 వేల రూపాయలను మంజూరు చేశారు.  నిరంతరం శాంతి భద్రతల పరిరక్షణ పనిలో అవిశ్రాంతంగా కృషి చేసే మహిళా పోలీసులకు తాము ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి అంబర్పేటలో ఏర్పాట్లు చేశామని కమిషనర్ తెలిపారు. 

రాచకొండ పరిధిలో ప్రతి సంవత్సరం ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతాయని, ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, పండుగ నిర్వహణకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా అవసరమైన అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి మరియు నేర నియంత్రణలో అమ్మవారు రాచకొండ పోలీసులకు శక్తి ఇవ్వాలని కోరుకొంటున్నానని కమిషనర్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.

ఈ వేడుకలలో డిసిపి పద్మజ, డిసిపి ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డిసిపి ఎస్బి కరుణాకర్, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, డిసిపి సునీత రెడ్డి, అడ్మిన్ డిసిపి ఇందిర, డిసిపి మురళీధర్, డిసిపి రమణా రెడ్డి, అడిషనల్ డిసిపిలు శ్యామ్ సుందర్, వెంకట్ రెడ్డి పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్ భద్రారెడ్డి, కృష్ణారెడ్డి ఇతర అధికారులు మరియు మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com