భారత అణు కార్యక్రమ పితామహుడు
- October 30, 2024
అణుశక్తి రంగంలో అంచెలంచెలుగా ఎదుగగల సత్తా భారతదేశానికి ఉందని స్వాతంత్రానికి ముందే ఊహించిన శాస్త్రజ్ఞుడు హోమీ భాభా. అణుశాస్త్ర రంగం మీద ఆసియాలో పరిశోధనలు చేసిన మొదటి వ్యక్తి భాభా. అణు రంగంతో పాటుగా భారత అంతరిక్ష రంగ పరిశోధనలకు బీజం వేసిన ఘనత సైతం ఆయనకే దక్కుతుంది. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగ పరిశోధనల కోసం టాటాల మద్దతుతో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థను స్థాపించారు. ముఖ్యంగా భారత అణు శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే ఆయన్ని "భారత అణు కార్యక్రమ పితామహుడు"గా పిలుస్తారు. నేడు ప్రముఖ అణు శాస్త్రవేత్త డా.హోమీ భాభా జయంతి.
హోమీ భాభా పూర్తి పేరు హోమీ జహంగీర్ భాభా. 1909, అక్టోబర్ 30న ముంబైలోని ఒక సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించారు. తండ్రి గొప్ప న్యాయవాది, తల్లి గృహిణి. 15 సంవత్సరాల వయస్సులో, సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలో ఆనర్స్ తో ఉత్తీర్ణత సాధించి, ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ప్రవేశించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కైయస్ కాలేజీలో చేరడానికి ముందు 1927 లో రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చదివారు. మేథ్స్, ఫిజిక్స్ పట్ల మక్కువతో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ప్రథమశ్రేణిలో పాసయ్యారు. అక్కడే పాల్‌డ్రిక్ మార్గదర్శకత్వంలో మేథ్స్‌లో ట్రిపోస్ పూర్తి చేశారు. అప్పడే ఆయనకు న్యూక్లియర్ ఫిజిక్స్ మీద మక్కువ పెరిగింది. దీంతో రేడియేషన్‌ను విడుదల చేసే కణాలమీద పరిశోధన మొదలు పెట్టారు.
భాభా థియరిటికల్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ కోసం కావెండిష్ ల్యాబొరేటరీలో పనిచేశారు. ఆ సమయంలో ఆయన పబ్లిష్ చేసిన ‘ది అబ్సార్‌ప్షన్ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్’ అనే సిద్ధాంత పత్రానికి ఐజాక్ న్యూటన్ స్టూడెంట్ షిప్ పొందారు.ఈ పత్రంలో.. కాస్మిక్ కిరణాల లక్షణాలను వివరించారు. అనంతరం.. రాల్ఫ్ హెచ్ ఫౌలర్ అనే గైడ్ సాయంతో థియరిటికల్ ఫిజిక్స్‌లో పరిశోధనా పత్రాన్ని సమర్పించి.. పీహెచ్‌డీ పొందారు. అదే సమయంలో ఎలక్ట్రాన్ – పాజిట్రాన్ పరిక్షేపణం గురించి పరిశోధన చేశారు. ఈ అంశంలో ఆయన సేవలకు తరువాత ఎలక్ట్రాన్ – పాజిట్రాన్ పరిక్షేపణను ‘భాభా స్కాటరింగ్’ అని పిలిచారు.
ఇలా కేంబ్రిడ్జ్‌లో పరిశోధనల్లో బిజీగా ఉన్న సమయంలోనే (1939) రెండవ ప్రపంచ యుద్ధం మొదలవ్వడంతో ఆయన స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. యుద్ధం ఆరేళ్లకు పైగా సాగటంతో ఆయన తిరిగి బ్రిటిన్ వెళ్లలేదు. డా. సీవీ రామన్ ఆధ్వర్యంలో ఉన్న బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఫిజిక్స్ రీడర్‌గా చేరారు. అక్కడ పనిచేస్తూనే.. మనదేశం అణు రంగంలో వెనకబడి ఉన్న అంశాన్ని గుర్తించి 1944లో తానే స్వయంగా కాస్మిక్ కిరణాల పరిశోధనాశాలను ప్రారంభించి, స్వతంత్రంగా అణు పరిశోధనకు దిగారు. 1945లో టాటా సంస్థల అధినేత జె. ఆర్.డి. టాటా సహకారంతో ముంబైలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) సంస్థను స్థాపించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి ద్వారా దేశం పురోగమిస్తుందని నమ్మిన భాభా, 1946 లో కాబినెట్ మిషన్లో భాగంగా నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం ముందుకు ప్రతిపాదనలు పెట్టడమే కాకుండా, నెహ్రూను ఒప్పించడంలో సఫలీకృతం అయ్యారు. 1948లో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత భాభానే మొదటి చైర్మన్ గా వ్యవహరించారు. మన దేశంలో యురేనియం నిల్వలు లేకపోవటంతో దానికి బదులు అలాంటి లక్షణాలున్న, మనదేశంలో విరివిగా లభించే థోరియం నుంచి అణు శక్తిని వెలికి తీసే వ్యూహాంతో మూడు దశల్లో అణుకార్యక్రమానికి నాంది పలికారు. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఫోరమ్‌లలో భారత ప్రతినిధిగా, 1955 లో జెనీవాలో అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలపై ఐక్యరాజ్యసమితి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1958లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌కు విదేశీ గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యారు.
భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి నాంది పలికింది కూడా భాభానే. అంతరిక్ష పరిశోధన కోసం నెహ్రూను ఒప్పించి భారత జాతీయ అంతరిక్ష కమిటీని ఏర్పాటు చేయడంలో విక్రమ్ సారాభాయ్‌కు తోడ్పాటు నిస్తూ కీలక భూమిక పోషించారు. ప్రభుత్వం నుంచి సారాభాయ్‌కు ఎటువంటి ఒత్తిడులు రాకుండా, ఫండ్స్ అందిస్తూ వచ్చారు. సారాభాయ్, సతీష్ ధావన్ సహకారంతో అంతరిక్ష పరిశోధన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
1942లో ఆడమ్స్ ప్రైజ్‌ను గెలుచుకున్న భాభా, 1954లో పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. 1951, 1953, 1956లలో ఆయన భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. కష్టించి పనిచేసేవారిని భాభా ఇష్టపడేవారు. వారు పనిలో ఏదైనా పనిలో పొరపాటు చేసినా క్షమించేవారు. కానీ.. నిర్లక్ష్యంగా, సోమరిలా ఉండేవారిని భరించేవారు కాదు. భాభా జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారు.
1966 జనవరి 24న, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిర్వహిస్తున్న సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం కోసం ఆస్ట్రియాలోని వియన్నాకు వెళ్తుండగా మౌంట్ బ్లాంక్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో భాభా మరణించారు.ఆయన మరణానంతరం ముంబైలోని అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంటును భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. అంతేగాదు అయన పేరు మీదుగా ముంబైలో డీమ్డ్ విశ్వవిద్యాలయం, సెన్సు ఎడ్యుకేషన్ సెంటర్ తదితరాలను ఏర్పాటు చేయడం జరిగింది. భాభా వంటి కొందరు అసామాన్య వ్యక్తుల శ్రమ ఫలితంగానే ఈ ఆరు దశాబ్దాల కాలంలో మన దేశం ఎన్నో రకాలుగా ముందంజ వేయగలిగింది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల