లద్ధాఖ్‌లో 'అనలాగ్‌ మిషన్‌'.. ఏమిటీ ఇస్రో ప్రాజెక్ట్‌..!

- November 01, 2024 , by Maagulf
లద్ధాఖ్‌లో \'అనలాగ్‌ మిషన్‌\'.. ఏమిటీ ఇస్రో ప్రాజెక్ట్‌..!

అంతరిక్ష యాత్రలను చేపట్టే సంస్థలు, స్పేస్‌ఏజెన్సీలు ముందుగా అత్యంత కీలకమైన అనలాగ్‌ మిషన్లను చేపడతాయి. ఆ తర్వాతే వీటికి భిన్నమైన వాతావరణాలు, భౌగోళిక ప్రదేశాలు వ్యోమగాములకు అవసరం అవుతాయి.

త్వరలో భారత్‌ గగన్‌యాన్‌ ప్రాజెక్టు చేపట్టనుంది. ఈనేపథ్యంలో తన కీలకమైన అనలాగ్‌ మిషన్‌కు లద్ధాఖ్‌లోని లేహ్‌ను వేదికగా ఎంచుకొంది.

ఇతర గ్రహాల వాతావరణాన్ని తలపించేలా..
అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అంతరిక్ష యాత్రకు సంబంధించి చేపట్టే ఫీల్డ్‌ టెస్టులను అనలాగ్‌ మిషన్‌ అంటారు. దీనిలో ప్రభుత్వ ఏజెన్సీలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేసి తమ అంతరిక్ష యాత్ర సన్నద్ధతను విశ్లేషిస్తాయి. సాధారణంగా కొత్త టెక్నాలజీలు, రోబోటిక్‌ పరికరాలు, ప్రత్యేకమైన వాహనాలు, కమ్యూనికేషన్లు, విద్యుత్తు తయారీ వంటి పలు అంశాలకు సంబంధించిన ప్రయోగాలు చేస్తారని నాసా వెబ్‌సైట్‌ పేర్కొంది.

* స్పేస్‌ రేడియేషన్‌ అంచనా వేయడం ఈ ప్రాజెక్ట్‌లో కీలకభాగం. సాధారణంగా భూమిపై ఉండే అయస్కాంత క్షేత్రాలు, వాతావరణం వంటివి విశ్వం నుంచి వచ్చే రేడియేషన్‌ను తగ్గిస్తాయి. కానీ, అంతరిక్షంలో వీటికి రక్షణ ఉండదు.

* ఒక చిన్న ప్రదేశంలో కొందరు వ్యక్తులు ఒంటరిగా ఉంటే వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను గుర్తించడం. ఎంత శిక్షణ పొందినవారైనా ఈ ప్రభావాలను తప్పించడం కష్టం.

* భూమి నుంచి చాలా దూరం ప్రయాణించడంతో కమ్యూనికేషన్లు బలహీనపడతాయి. అలాంటి పరిస్థితులకు వ్యోమగాములను సిద్ధం చేయడం వంటి అంశాలుంటాయి.

ఇస్రో ఇలా..
తాజాగా మన ఇస్రో, ఆకా స్పేస్‌ స్టూడియో, ది యూనివర్శిటీ ఆఫ్‌ లద్ధాఖ్‌, ఐఐటీ బాంబే, లద్ధాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఈ మిషన్‌ కోసం చేతులు కలిపాయి. చంద్రుడు, అంగారకగ్రహం లాంటి కఠిన భౌగోళిక పరిస్థితులున్న ప్రదేశాన్ని లద్ధాఖ్‌లో గుర్తించారు. ఉష్ణోగ్రతల్లో భారీ తేడాలను చూపడం, ఎత్తైన పర్వత ప్రదేశం కావడంతో టెక్నాలజీల పరీక్షకు సుదీర్ఘ స్పేస్‌మిషన్‌ల వ్యూహాల తయారీకి దీనిని వాడనున్నారు.

ఇతర గ్రహాల పరిస్థితులను అంచనా వేస్తూ.. వ్యోమగాములు నివాసం ఉండటానికి తగిన ఏర్పాట్లను అభివృద్ధి చేయనున్నారు. దీంతోపాటు అంతరిక్షంలోకి తీసుకెళ్లే వనరులను ఎలా వాడుకోవాలో ప్లాన్‌ చేస్తారు. వ్యోమగాములపై నిర్మానుష్య ప్రదేశంలోని ఒంటరితనం ప్రభావాన్ని అంచనా వేయనున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడి పైకి మానవ సహిత యాత్రలకు ఇది ప్రయోజనకరంగా మారనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com