టికెట్ చార్జీలు పెంచలేదు: విసి సజ్జనార్
- November 04, 2024హైదరాబాద్: టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సు టికెట్ ధరలను పెంచిందన్న ప్రచారంలో వాస్తవం లేదని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. రెగ్యులర్ సర్వీసులకు సాధారణ ఛార్జీలే అమల్లో ఉన్నాయని పేర్కోన్నారు. అయితే, దీపావళి తిరుగు ప్రయాణ రద్దీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ జీవో మేరకు సంస్థ ఛార్జీలను సవరించిందని తెలిపారు.
ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక సర్వీసులను నడుపుతోందన్నారు.
అయితే తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో ఆ ప్రత్యేక బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులకు అనుగుణంగా టిక్కెట్ ధరను సవరించుకోనేందుకు 2003లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16ను జారీ చేసిందని వెల్లడించారు.
పండుగలు, ప్రత్యేక సందర్భాలలో నడిచే ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టిక్కెట్ ధరలను సవరించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు కల్పించిందని తెలిపారు. ఇది గత 21 ఏళ్లుగా కొనసాగుతున్న అనవాయితీ అని స్పష్టం చేశారు.
‘‘దీపావళి పండుగ సమయంలో రెగ్యులర్ సర్వీసుల ద్వారానే ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చడం జరిగింది. కానీ తిరుగు ప్రయాణంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆది, సోమవారం నాడు రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది.
ఆదివారం నాడు కరీంనగర్ రీజియన్ నుంచి 127, రంగారెడ్డి నుంచి 105, వరంగల్ నుంచి 66, ఆదిలాబాద్ నుంచి 16 మొత్తంగా 360 ప్రత్యేక బస్సులను హైదరాబాద్‌కు సంస్థ నడిపింది. సోమవారం సాయంత్రం వరకు ఆయా ప్రాంతాలనుంచి మరో 147 సర్వీసులను ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం చార్జీలను సవరించడం జరిగింది. ఈ బస్సులు మినహా మిగతా బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయి.
సాధారణ రోజుల్లో రెగ్యులర్ టిక్కెట్ ధరలు యథావిధిగా ఉంటాయని… ప్రత్యేక సర్వీసుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టికెట్ ధరలను సవరిస్తామ’’ని టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
తాజా వార్తలు
- మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
- రూ.300కే ఇంటర్నెట్ సేవలు–తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- చెత్త ఎయిర్ లైన్స్ జాబితాలో 103వ స్థానం పొందిన ఇండిగో ఎయిర్లైన్
- దుబాయ్ లో 30% ఆల్కహాల్ అమ్మకపు పన్ను పునరుద్ధరణ..!!
- కువైట్ లో అంతర్జాతీయ 'ఫుట్బాల్ ఫర్ పీస్' కార్యక్రమం..!!
- అబుదాబిలో డ్రైవర్ లెస్ ఉబర్ సేవలు..ఎలా బుక్ చేయాలంటే..?
- మోటార్సైకిలిస్ట్ దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు..!!
- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే వారికి బిగ్ అలెర్ట్!
- దుబాయ్ 'నైట్ సఫారీ' పార్క్ సమయాలు పొడింగింపు..!!
- రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్