అణుబాంబు దాడికి గురైన 'హిరోషిమా' అభివృద్దికి కారణం ఏమిటి?
- November 15, 2024అణుబాంబు దాడికి గురైన 'హిరోషిమా' అభివృద్దికి కారణం ఏమిటి?
హిరోషిమా జపాన్‌లోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక నగరం. ఈ నగరాన్ని 1589లో మోరి టెరిమోటో స్థాపించాడు. హోంషూ ద్వీపంలో ఉన్న ఈ చారిత్రక నగరం ప్రత్యేక సంస్కృతి మరియు సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు సంప్రదాయ కళలను అశేషంగా ప్రోత్సహిస్తారు. ఇంకా తమ సంప్రదాయాలను గౌరవించడమే కాకుండా వాటిని జాగ్రత్తగా పాటించి ఆచరిస్తారు.
అయితే ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతం పై 1945 ఆగస్టు 6న రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా ఈ నగరంపై అణుబాంబు దాడి చేసింది. ఆ దాడి జరిగిన తర్వాత పూర్తిగా ధ్వంసం అయిన ఈ నగరం తన చరిత్రను మరచిపోకుండా భవిష్యత్తును నిర్మించడంలో అద్భుతమైన పురోగతి సాధించి ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది.
అణుబాంబు దాడి జరిగిన తర్వాత ప్రస్తుతం హిరోషిమా నగరం అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అణుబాంబు దాడికి ప్రధాన కారణాలు? దాడి ఎలా జరిగింది? అణు బాంబులు ఎలా ప్రయోగించారు అనే విషయాలు డీటెయిల్ గా తెలుసుకుందాం.
అణుబాంబు దాడికి ప్రధాన కారణాలు:
ముందుగా హిరోషిమా నగరంపై అమెరికా అణు బాంబు దాడి చేయడానికి ప్రధాన కారణాలు తెలుసుకుందాం:
రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో, యూరోప్లో యుద్ధం ముగిసినప్పటికీ, పసిఫిక్ ప్రాంతంలో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. జపాన్ బేషరతుగా లొంగిపోవాలని మిత్రరాజ్యాలైన అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ కోరినా జపాన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో అమెరికా హిరోషిమా నగరంపై అణు బాంబు దాడి చేయాలని నిర్ణయించుకుంది.
ఈ నేపథ్యంలో యుద్ధాన్ని త్వరగా ముగించడానికి, మరిన్ని ప్రాణనష్టాలను నివారించడానికి మిత్రరాజ్యాలు పోట్స్‌డామ్ డిక్లరేషన్ ద్వారా 1945 జూలై 26న జపాన్‌కు లొంగిపోవాలని సూచించాయి. లొంగిపోకపోతే పెను వినాశనం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. అయినా జపాన్ వినలేదు.
దీంతో అమెరికా అణు బాంబు ప్రయోగం చేయాలని నిర్ణయించింది. అణు బాంబు ప్రయోగం ద్వారా అమెరికా జపాన్‌పై తన సైనిక శక్తిని ప్రదర్శించాలనుకుంది. ఇందుకోసం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన హిరోషిమా మరియు నాగసాకి నగరాలు వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది.
అణుబాంబు దాడి విద్వంసం:
1945 ఆగస్టు 6న హిరోషిమాపై మరియు ఆగస్టు 9న నాగసాకిపై అణుబాంబు దాడులు జరిగాయి. ఈ దాడి ప్రపంచ చరిత్రలో ఒక చీకటిరోజు. 1945 ఆగస్టు 6న ఆ రోజు ఉదయం 8:15 గంటలకు, “ఎనోలా గే” అనే B-29 బాంబర్ విమానం “లిటిల్ బాయ్” అనే అణుబాంబును హిరోషిమాపై వదిలింది. ఈ బాంబు దాడి కారణంగా మొత్తం లక్షా నలభై వేలమంది ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల తర్వాత, ఆగస్టు 9న, నాగసాకి నగరంపై “ఫ్యాట్ మ్యాన్” అనే మరో అణుబాంబు పడింది, దాంతో 74,000 మంది మరణించారు.
అణుబాంబు దాడి తర్వాత హిరోషిమా నగరం పూర్తిగా ధ్వంసమైంది. భవనాలు, రోడ్లు, వసతులు అన్నీ నేలమట్టం అయ్యాయి. రేడియేషన్ ప్రభావం కారణంగా, అనేక మంది ప్రజలు కేన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. హిరోషిమాలో ఈ దాడి మానవ చరిత్రలో అణు ఆయుధాల వినియోగం జరిగిన మొదటి సంఘటన.
ఈ దాడి తర్వాత, ప్రపంచం మొత్తం అణు ఆయుధాల వినాశన శక్తిని గుర్తించింది. హిరోషిమా నగరంపై అణు బాంబు దాడితో యుద్ధాన్ని త్వరగా ముగించడమే కాకుండా, జపాన్‌ను బేషరతుగా లొంగిపోవడానికి ఒప్పించడం, ప్రపంచానికి అణు ఆయుధాల శక్తిని చూపించడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారణాల వల్ల హిరోషిమాపై మరియు నాగసాకిపై అణుబాంబు దాడులు జరిగాయి. ఈ దాడి తర్వాత జపాన్ మిత్రదేశాలకు లొంగిపోయింది. జపాన్ లొంగిపోవడం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది.
అణుబాంబు దాడి జరిగిన తర్వాత ప్రస్తుతం హిరోషిమా నగరం అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? అంచెలంచెలుగా ఎలా ఎదిగింది:
అణుబాంబు దాడుల తర్వాత నగరం పూర్తిగా ధ్వంసమైంది. అనేక మంది ప్రజలు రేడియేషన్ ప్రభావంతో బాధపడ్డారు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. ప్రస్తుతం
నగరం పూర్తిగా పునర్నిర్మించబడింది. శాంతి చిహ్నంగా మారింది. ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగుపడ్డాయి.
1945 నుండి 2024 వరకు హిరోషిమా అనేక మార్పులను చూసింది. 1945లో జరిగి అణుబాంబు దాడి తర్వాత హిరోషిమా పూర్తిగా ధ్వంసమైంది. కానీ, ఈ నగరం తన పునర్నిర్మాణంలో అద్భుతమైన పురోగతి సాధించింది.
1945: హిరోషిమా నగరంపై అణుబాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మరియు నగరం పూర్తిగా ధ్వంసమైంది.
1950-1960:అణుబాంబు దాడి జరిగిన తర్వాత నగరం పునర్నిర్మాణం ప్రారంభమైంది. ప్రజలు మళ్లీ తమ జీవితాలను పునర్నిర్మించుకోవడం ప్రారంభించారు.
1970-1980: అణుబాంబు దాడి జరిగిన తర్వాత హిరోషిమా శాంతి చిహ్నంగా మారింది. ఆ తరువాత హిరోషిమా శాంతి పార్క్ మరియు శాంతి మ్యూజియం నిర్మించబడ్డాయి.
1990-2000: నగరం ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి చెందింది. హిరోషిమా ఇప్పుడు ఒక ప్రధాన నగరంగా మారింది.
2024: హిరోషిమా ఇప్పుడు ఒక శాంతి చిహ్నంగా నిలిచింది. నగరం పునర్నిర్మాణం, ప్రజల ఆత్మస్థైర్యం ప్రపంచానికి ఒక స్ఫూర్తి.
ఈ 80 సంవత్సరాల కాలంలో, హిరోషిమా తన చరిత్రను మరచిపోకుండా, భవిష్యత్తును నిర్మించడంలో అద్భుతమైన పురోగతి సాధించింది.
1945లో జరిగిన హిరోషిమా అణుబాంబు దాడిని స్మరించడానికి మరియు అణ్వస్త్రాల వినియోగం వల్ల కలిగే భయంకరమైన పరిణామాలను గుర్తు చేసుకోవడానికి అణుబాంబు దాడికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 6న హిరోషిమా డే జరుపుకుంటారు.
ప్రస్తుతం ఈ నగరం పునర్నిర్మాణం ప్రజల ఆత్మస్థైర్యం ప్రపంచానికి ఒక స్ఫూర్తి. 80 సంవత్సరాల తర్వాత కూడా, హిరోషిమా దాడి మానవతా విలువలను గుర్తు చేస్తుంది. ఇది శాంతి మరియు అణ్వస్త్రాల వ్యతిరేకతకు సంబంధించిన సందేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. ఈ దాడి ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!