ఉత్తరాంధ్ర అభ్యుదయ రచయిత 'పూసపాటి'
- November 18, 2024ఉత్తరాంధ్ర నుంచి తెలుగు కథా సాహిత్యాన్ని వైభవోపేతం చేసిన ప్రఖ్యాత రచయితలెందరో ఉన్నారు.గురజాడ, చా.సో., కాళీపట్నం,రావిశాస్త్రి వంటి మహా రచయితలు తమ అద్భుతమైన రచనల ద్వారా ఆ ప్రాంతానికి, అక్కడి మాండలికానికీ ఎంతో వన్నె తెచ్చారు.ఆబాటలోనే ఎందరో రచయితలు తమవంతు సేవలందించారు.అందరూ ప్రతిభావంతులే. అలాంటివారిలో ఆ రోజుల్లో చా.సో.వారసునిగా చెప్పబడే పూసపాటి కృష్ణంరాజు రాసిన కథలను విమర్శకులందరూ ఆణిముత్యాలుగా పేర్కొంటారు.నేడు సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు వర్థంతి.
కృష్ణంరాజు పూర్తి పేరు పూసపాటి సూర్య వెంకట కృష్ణంరాజు.1928, ఆగష్టు 20న ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన విజయనగరం జమిందారీలోని ద్వారపూడి గ్రామంలో జన్మించారు. విజయనగరం జమిందారులైన పూసపాటి గజపతి రాజులకు వీరు దగ్గర బంధువు. ఆయన పదకొండవ తరగతి వరకూ మాత్రమే చదువుకున్నారు. అయితే, స్వయంకృషితో తెలుగులో అన్ని కావ్యాలూ, కథలూ, ఇంగ్లీషులో టాల్ స్టాయ్, మపాసా, ఓహెన్రీ, చెహోవ్ నుండి ఆల్డస్ హక్సలీ వరకూ బాగా చదివారు.ఏ సాంకేతిక విద్యార్హత లేకుండానే ఆయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కాల్ టెక్స్ రిఫైనరీ వంటి సంస్థలకు పైపులైను వెయ్యడంలో సహాయపడ్డారు.
1948లో 'జమీందారీ రద్దు' చట్టం ప్రభావం వారి జీవితం మీద బాగా పడింది.ఆ చట్టం వల్ల అనేకమంది జమీందారులు ముఖ్యంగా క్షత్రియులు తమ భూములమీద అధికారాలు కోల్పోయారు.ఎన్నో రాచకుటుంబాలు చితికిపోయాయి.అయినా వాళ్ల అలవాట్లు, సంప్రదాయాలు, లేనిపోని భేషజాలని ప్రదర్శించడాన్ని ఎత్తిపొడుస్తూ కృష్ణంరాజు గొప్ప శిల్పంతో కథలు రాశారు. 'దివాణం సేరీవేట', 'రెండు బంట్లు పోయాయి' 'దిగులు' మొదలైనవి ఆ కోవలోని కథలు.కానీ వారు అభ్యుదయవాది.ఆ భావాలతోనే వారు కూలీ నాలీ చేసుకునే బడుగు జీవుల బ్రతుకుల గురించి ఎంతో ఆవేదనతో రాశారు. దైనందిక కార్మిక జీవనంతో ఇంత ప్రత్యక్ష, వైవిధ్య అనుభవం ఉండబట్టేనేమో ఆయన కథలు జనజీవనాన్ని గొప్పగా ప్రతిబింబించాయి.
కృష్ణంరాజు కథల్లో బలంగా కనిపించేది వాతావరణ చిత్రణ. వర్ణనలే కాక, సంభాషణలు, సంఘటనలతో ఆయన చకచకా ఒక సజీవమైన చిత్రాన్ని మనముందు పెడతారు. ఆ చిత్రంలో పాత్రలు జీవంతో కళకళలాడతాయి. దీనికితోడు సునిశితమైన పరిశీలన ఉంటుంది. వ్యంగ్యమో, చమత్కారమో, బలమైన అనుబంధాలో మేధకు చురుకు పుట్టేట్టు, మనసును హత్తుకునేట్టు ఉంటాయి. ఇంతచేసీ, కథల నిడివి మరీ పెద్దగా ఏమీ ఉండదు. ఆకర్షణీయంగా కథ చెప్పే విద్య కృష్ణంరాజు గారికి బాగా తెలుసు.ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోని సుప్రసిద్ధ పాత్రికేయుడు, కథా రచయిత కె.ఎన్.వై పతంజలి సైతం అదే బాణీలో రచనలు చేశారు.
పూసపాటి కృష్ణంరాజు తక్కువగానే కథలు వ్రాశారు.నిజానికి చాలా ఆలస్యంగా కథలు వ్రాయటం మొదలుబెట్టారట.ఆ ఆలస్యానికి, తక్కువ కథలు రాయటానికి ఆయనే చెప్పిన కారణాలు…“కథలు రాద్దామనే ఉద్దేశం నాలో కలిగే నాటికి అనేక దశలు గడిచిపోయినై. కాస్త ఆలస్యంగా కలం పట్టుకొన్నందున చురుగ్గా సాగలేక ఆయాసంతో కాళ్ళు సరిగ్గా పడ్డం లేదు. అనుభవం, బాధ్యత బరువుని గుర్తు చేస్తుంటే గమనానికి ఆటంకాలు కదూ!…లెక్కలేనన్ని కథలు, గల్పికలు రాయాల్సిన వయస్సులో చేతను కలానికి బదులు హలం ఉండటం, విద్వద్గోష్టిలో పాల్గొనవలసిన ప్రాయంలో ఆలమందలను కాసుకుంటూ వాటివెంట తిరిగి మూగభాషలో మచ్చిక చేసుకోవడం, కుకవి సుకవుల కావ్య మీమాంసల్లో తలదూర్చవలసిన నాడు చెరుకుపొదల్లో కూలినై దూరి, ఆకుల రంపపుకోతకు ఓర్చి తోట చుట్టడం, కావ్యాలల్లవలసిన ప్రాయంలో భయంకరమయిన ఉక్కు కార్ఖానాఘోషల మధ్య నిర్మలమైన మనస్సుతో కండలు కరిగించుకునే కార్మికునివంటి అనేకానేక సంఘటనలు నాకు రచయితగా కన్ను విప్పుకునేందుకు కాస్త ఆటంకాలయినవి.”
కృష్ణంరాజు దాదాపు 15 కథలు వ్రాశారని పుస్తకాల్లో కనిపించే మాట.1964లో వచ్చిన సీతాలు జడుపడ్డది సంకలనంలో పదే కథలు ఉన్నాయిట.వాటికి భూతాల స్వర్గం కథ కలిపి 11 కథలతో ఈ పుస్తకం వచ్చింది.ఇవి కాక ఆయన వేరే కథలు కూడా వ్రాశారో, లేక 15 అనేది ఒట్టి ఉజ్జాయింపు లెక్కో తెలీదు.రాజు వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన మనవరాలు సాహిత్య 2022లో ఐ.ఎఫ్.ఎస్ అధికారిగా ఎంపికయ్యింది.కృష్ణంరాజు అరవై ఆరేళ్ళుదాటాక 1994 నవంబరు 18న మరణించారు.ఆయన మరణించి మూడు దశాబ్దాలు దాటుతున్న, ఇప్పటికి ఆయన రచనలు పాఠకులను అభిమానాన్ని పొందుతూనే ఉన్నాయి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!