మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు..?

- November 25, 2024 , by Maagulf
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు..?

ముంబై: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. గత శనివారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయతి (ఎన్డీయే) కూటమి 230 స్థానాల్లో విజయం సాధించింది. తద్వారా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అత్యధికంగా 132 స్థానాల్లో విజయం సాధించారు. శివసేన (శిందే) వర్గం 57 స్థానాల్లో, ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గం 41 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల ముందు వరకు కూటమి ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రులుగా అజిత్ పవార్, ఫడణవీస్ లు కొనసాగారు. ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీకి చెందిన నేత అదిష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రముఖంగా ఫడణవీస్ పేరు వినిపిస్తోంది. అయితే, శివసేన కార్యకర్తలు మాత్రం ఏక్ నాథ్ శిందేను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని పట్టుబడుతున్నారు. దీంతో తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఏక్ నాథ్ శిందే సిద్ధంగా ఉన్నారు. ఆయన వర్గీయులుసైతం శిందేకే అవకాశం దక్కుతుందని ఆశతో ఉన్నారు. అయితే, బీజేపీ అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ శిందే ముఖ్యమంత్రి రేసు నుంచి వెనక్కితగ్గి బీజేపీ నేతకే సీఎం పదవి అప్పగిస్తే.. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్ నాధ్ శిందే, అజిత్ పవార్ లు ఉండే అవకాశం ఉంది. మరోవైపు మహారాష్ట్ర శాసన సభ గడువు మంగళవారంతో ముగియనుంది. గెలిచిన కూటమి 72గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటుకు మహాయతి వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం వరకు మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయంపై కూటమి నేతల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com