చిత్రకళా సామ్రాట్-బాలి

- November 29, 2024 , by Maagulf
చిత్రకళా సామ్రాట్-బాలి

ఓ చిత్రకారుడు వేలాది పుస్తకాలకు..లక్షకు పైగా బొమ్మలు వేశారంటే మీరు నమ్ముతారా? ఎవరి విషయంలో అయితే ఏమో గానీ..'బాలి'గారి విషయంలో మాత్రం నమ్మాలి మరి. కార్టూనిస్టుగా తెలుగు పత్రికా రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు తన బొమ్మలతో ఉర్రూతలూగించిన ప్రముఖ చిత్రకారులు బాలి. ఐదు దశాబ్దాల పాటు కార్టూనిస్టుగా చందమామ లాంటి చూడచక్కని ముఖాలు, తెలుగుదనాన్ని ప్రతిబింబించే నేపధ్యాలు.చూడగానే ‘ఆహా’ అనిపించేలా బొమ్మలు గీస్తూ, స్నేహభావంతో ఎంతో మంది చిత్రకారులకి ఆదర్శంగా నిలిచిన విలక్షణ చిత్రకారులు బాలి. సాహిత్యం మీదున్న మక్కువ ఆయన్ని రచయితగా రాణించేలా ప్రేరేపించింది.నేడు సుప్రసిద్ధ కార్టూనిస్టు, కథకుడైన చిత్రకళా సామ్రాట్ బాలి గారి జయంతి    

బాలి అసలు పేరు మేడిశెట్టి శంకరరావు.1942 సెప్టెంబరు 28న అనకాపల్లిలో జన్మించారు.భారత బ్రిటిష్‌ ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసిన బాలి తండ్రి లక్ష్మణరావు ఔత్సాహిక చిత్రకారుడు.అమ్మ అన్నపూర్ణ ప్రోత్సాహంతో.. బాలి తన ఆరో ఏట నుంచే చిత్ర కళా సాధన ప్రారంభించారు. స్వయంకృషితో రాణించారు. విద్యార్థి దశలోనే 1958 నాటి ఆంధ్ర (వార)పత్రికలో ‘ఉబుసుపోక’ అనే శీర్షికతో వేసింది తొలిచిత్రమైనా, 1970 నుంచే విస్తారంగా చిత్రాలు గీస్తున్నారు.1970లో ‘ఆంధ్రపత్రిక’ కార్టూనిస్టుల పోటీల్లోనూ వరుసగా మూడు వారాలు విజేతగా నిలిచారు.

చిత్రలేఖనం మీద ప్రేమతో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్టుమెంట్‌లో క్లర్క్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 1974లోఈనాడు దిన పత్రిక విశాఖపట్నం ఎడిషన్‌ లో పొలిటికల్‌ కార్టూనిస్టుగా చేరారు.1976లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సాఫ్ట్‌ కార్టూనిస్టుగా చేరినప్పటి నుండి బాలి చిత్రలేఖన విశ్వరూపం మొదలైంది. అదే ఆయన కళా సృజన కు మేలి మలుపు అని పలు సందర్భాలలో బాలి చెప్పారు. అప్పటికే శంకర్‌ పేరుతో ఒకరిద్దరు చిత్రకారులు ఉండటంతో, అప్పటి ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక ఎడిటర్‌ పురాణం సుబ్రహ్మణ్య శర్మ సూచన మేరకు తన పేరును ‘బాలి’గా మార్చుకున్నారు.అప్పటినుండి, అదే పేరుతో ఎన్నో బొమ్మలు, కార్టూన్లు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

 ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న సమయంలోనే వేలాది కథలకు బొమ్మలు గీశారు. నవలలకు ముఖచిత్రాలను వేశారు. బాపు బాటలో సాగుతూ, వందల గ్రీటింగ్‌ కార్టూన్స్‌ ను రూపొందించారు.  1984లో ఆంధ్ర జ్యోతి సంస్థ నుండి బయటకు వచ్చిన బాలి ఫ్రీలాన్సర్‌ గా కెరీర్‌ కొనసాగించారు. కొంతకాలం హైదరాబాద్‌ లోని కలర్‌ చిప్స్‌ లో యానిమేటర్‌ గా సేవలు అందించారు.

అడవి బాపిరాజు, కొడవటిగంటి కుటుంబరావు, రంగనాయకమ్మ, తెన్నేటి హేమలత వంటి ప్రముఖ రచయితల నవలలకు ముఖ చిత్రాలను, కవర్‌పేజీ డిజైన్లను గీశారు. వందల కథలకు ఇల్లస్ట్రేషన్లు అందించారు. బాపు, మోహన్‌ వంటి ప్రముఖ చిత్రకారుల ప్రశంసలనూ అందుకున్నారు. ఆయన కార్టూన్లు నవ్వించడమే కాక.. ఆలోచింపజేసేలా ఉంటాయని పలువురు చిత్రకారులు కొనియాడేవారు. ఆయన వేసిన బొమ్మలు, కార్టూన్లు ప్రచురితం కాని పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు. వివిధ వార, పక్ష, మాస పత్రికల్లో బాలి కార్టూన్‌ శీర్షికలూ నిర్వహించారు. అంతర్జాతీయ కార్టూన్‌ పోటీల్లో బాలి కార్టూన్లు బహుమతులు పొందాయి.

బాలి చిత్రకారుడిగానే కాదు.. రచయితగానూ రాణించారు. ‘అమ్మే కావాలి’ పిల్లల నవలతో రచనా వ్యాసంగం మొదలై 30కిపైగా కథలు రాశారు. నవమల్లె తీగ-కలిమిశ్రీ ఈ కథల సంపుటిని ప్రచురించారు. దీనికి కారణం తాను బొమ్మ వేయటానికి ఎందరో రచయితల ఎన్నెన్నో కథల్ని పరిశీలనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చదివి ‘కథాత్మ’ని పట్టుకోగలగటమే అన్నారు. అలాగే, ఎంత ఎక్కువగా చదివి, అంత తక్కువగా రాస్తే అంతమంచిది అనేవారు. బాలి రాసిన అద్దం కథ, సై..కిల్ కథ, అప్పికట్ల వారి వీధి, సమాహారం, మేలు చేసిన కీడు, చిలకపచ్చ చీర కథ వంటి కథల్లోని వస్తురూపాల మేళవింపు కథకుడుగా ఆయన రచనా నైపుణ్యానికి అద్దంపడతాయి. బాలి ‘చందు’ అనే బాలసాహిత్య పత్రికకు సంపాదకత్వం కూడా నెరపారు. కార్టూన్లపై ఎనిమిది పుస్తకాలతో పాటు మరో రెండు చిన్నపిల్లల నవలలు, ‘చిన్నారులు బొమ్మలు గీయడం ఎలా?’ తదితర పుస్తకాలు వెలువరించారు.

బాలి నిరాడంబరుడు. చాలా మొహమాటస్తుడుగా కనపడేవాడు. మితభాషి. మాట్లాడేడంటే - ఆ మాటల్లో చల్లని ‘వెట్ట’తనం! బాలికి అంతర్జాతీయ ఖ్యాతి వుంది. ఎన్నెన్నో జాతీయ వర్క్ షాపుల్లో, ఎగ్జిబిషన్ లలో ఆయన పాల్గొన్నారు. ఎందరెందరో ప్రసిద్ధులతో ప్రత్యక్ష పరోక్ష పరిచయాలూ, సాన్నిహిత్యాలూ ఉండేవాయనకు. కథలకు బాలి వేసిన మానవ ఆకారాల భంగిమల్లోని హావభావాలను పరీక్షించుకుంటూ చూస్తుంటే, భావుకుడైన ఏ రచయితకైనా-మనోయవనికమీద చెప్పలేనన్ని కొత్త ప్రపంచాలూ, కొత్త వెలుగులూ కనిపిస్తాయి. ఆ రేఖల లాలిత్యం, depth, ప్రపోర్షన్స్ మహిమ అది!!

బాలి వేసిన పుస్తక ముఖచిత్రాలు, వివిధ కరపత్రాలకూ, పోస్టర్లకూ సమకూర్చిన లే అవుట్లూ, డిజైన్లూ, లోగోలూ, కామిక్స్ కోకొల్లలు. ఆయన గీతలూ, ఆ గీతలకు ఆయన ఇచ్చిన రాతలూ-సున్నితమైనవీ, లలితమైనవీ, రమణీయమైనవీనూ. కార్టూన్ కి కేప్షన్-నిజానికి-అసలైన జీవం. ఆయన బొమ్మల్లో ‘కళ’, భావ ప్రకటన, ఆహార్యం, భంగిమ, విన్యాసం ఎంత అద్భుతమో అంతకంత అద్భుతం ఈ ‘కేప్షన్’! అతని ‘శైలి’, ‘రేఖ’ - అతనిదే అయిన ముద్ర. ఇదే తెలుగు పాఠకులకు, ప్రచురణకర్తలకు, సంపాదకులకు, అంతకంటే మిన్నగా రచయితలకు అతన్ని దగ్గర చేసింది. ఆ దగ్గరితనంలో సహృదయత, స్నేహం అనుభవైకవేద్యం.

న్యూజిలాండ్‌ బైబిల్‌ సొసైటీకి బాలి గీసిచ్చిన బొమ్మకు గాను వారు ఆయన్ను ప్రత్యేక పురస్కారంతో సత్కరించారు. ప్రాంక్‌ఫర్డ్‌లో పర్యావరణ పరిక్షణపై గీసిన బొమ్మల ద్వారా జర్మనీలోనూ ఆయనకు పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. గుంటూరు కళాపీఠం వారి ఆయన్ని 'చిత్రకళా సామ్రాట్' బిరుదుతో సత్కరించారు. 2013లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హంస అవార్డుతో ఆయన్ను గౌరవించింది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, షికాగో(అమెరికా) తదితర నగరాల్లో ఆయన బొమ్మల ప్రదర్శనలు జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో బాలి వేసిన చిత్రాలను అలంకరించడం బాలి చిత్రాల ప్రివిలేజ్ ను తెలియజేస్తోంది.

ఔత్సాహికవంతులైన చిత్రకారులకు బాలి పలు సూచనలు కూడా చేసారు. “కళ అన్నది మహా సముద్రం, మనకు తెలిసింది అందులో చిన్న నీటి బిందువు. ఆర్టిస్ట్ ఎప్పుడు సమాజాన్ని గమనిస్తూ ఉండాలి..అప్పుడే చిత్రం కళకు పరిపూర్ణత వస్తుందంటారు.అలాగే, వేసే బొమ్మలెప్పుడూ ఒకే రకమైన మూస పద్దతిలో ఉండకూడదంటారాయన. అవకాశాన్ని వినియోగించుకోండి మనకు తెలిసింది అతి తక్కువని భావించండి, ఒప్పుకున్న పనిని సకాలంలో వారికి అందించండి. దానికి మీ మూడ్ బాగులేదన్న కారణం చూపకండి. ప్రతీ క్షణం చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించండి. వారి హాహాభావాలను, అదే పెద్ద లెసన్ బొమ్మలుగా గీసుకోడానికి."

సుమారు ఐదు దశబ్దాల పాటు తన కార్టూన్లు, చిత్రాలతో తెలుగు పాఠక లోకాన్ని రంజింపజేసి, వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న బాలి 2023 ఏప్రిల్ 17న విశాఖపట్టణంలోని తన స్వగృహంలో అనారోగ్యం కారణంగా తన 81వ ఏట కన్నుమూశారు. బాలి భౌతికంగా లేకపోవొచ్చు. ఆయన గీసిన చిత్రాలూ, రాసిన కథలూ తెలుగు సాహిత్య వాకిలిలో ప్రతినిత్యం శోభిస్తూనే ఉంటాయి. 

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com